గల్ఫ్ కష్టాలు

- August 03, 2016 , by Maagulf
గల్ఫ్ కష్టాలు

పొట్ట చేత పట్టుకుని గల్ఫ్‌బాట పట్టిన వలస కూలీల బతుకులు ఎడారులయ్యాయి. సౌదీలోని పేరుమోసిన కంపెనీలన్నీ మూతపడటంతో వేలాదిమంది ఆసియా దేశాల కార్మికులు రోడ్డున పడ్డారు. కొన్నినెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్న కార్మికులు కంపెనీల మూసివేతతో ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. వీరిలో దాదాపు పదివేల మంది భారతీయ కార్మికులున్నారు. ఇందులో సగం మంది తెలుగు వారు  ఉన్నారని తెలుస్తున్నది. ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు ఆకలి దప్పులు తీర్చుకోవడం కోసం మరోచో ట పనిచేయడానికి రోడ్డెక్కితే వర్క్ పర్మిట్లు లేవనే కారణంతో అరెస్టు చేస్తున్నారు. ఇట్లా సౌదీలోని జెడ్డా, రియాద్‌లలోని ఔట్ జైళ్లలో వేలాదిమంది తెలుగువారు కనీస సౌకర్యాలు, ఆహారం లేక నరకయాతన అనుభవిస్తున్నారు. భారత ప్రభుత్వం కార్మికులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు అడుగులు వేస్తున్నది. జెడ్డా, రియాద్, కౌసిమ్, హాయిల్ నగరాల్లో ఐదు ఆహార శిబిరాలను ఏర్పాటు చేసింది. భారతీయ కార్మి కులందరినీ క్షేమం గా రప్పించేందుకు చర్యలకు ఉపక్రమించింది. అయితే నెలల తరబడి జీతాలు ఇవ్వని కంపెనీల నుంచి కార్మికులకు రావలసిన బకాయిలు రాబట్టడం, తిరుగు ప్రయాణానికి కావలసిన తతంగం, ఖర్చులు తదితర సమస్యలు ఒక కొలిక్కిరావడం అంత సులభం కాదు. 

   కొన్నేళ్లుగా చమురు ఉత్పత్తిలో తలెత్తిన పోటీ అరబ్ దేశాల్లో విపరీత పరిణామాలకు కారణమవుతున్నది. రష్యా, ఇరాన్ చమురు ఉత్పత్తులను పెంచి గల్ఫ్ దేశాలకు పోటీగా రంగంమీదికి వచ్చాయి. అమెరికా కూడా చమురు నిల్వలను వెలికితీస్తూ ఎగుమతులు చేయడం ప్రారంభించింది. దీంతో మున్నెన్నడూ లేనివిధంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధర కనిష్టస్థాయికి పడిపోయింది. చమురు ఉత్పత్తిపై ఆధారపడిన గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. దీంతో గల్ఫ్ దేశాలన్నీ కూడబలుక్కొని చమరు ఉత్పత్తులను పెంచి చౌకధర విధానం అమలు చేశాయి. ఫలితంగా అమెరికా రిగ్గు కంపెనీలు నష్టాల వల్ల మూతపడ్డాయి. రష్యా, ఇరాన్‌లు కూడా తీవ్ర నష్టాల పాలై వెనక్కి తగ్గాయి. మార్కెట్ పోటీలో నిలబడటం కోసం గల్ఫ్‌దేశాలు అనుకున్న ఫలితాలు సాధించాయి కానీ, చమురు ఉత్పత్తిలో తలెత్తిన పోటీ చివరికి కుదేలు చేసింది. ఈ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభాల్లో కూరుకుపోయాయి. గత ఏడాది కింగ్ సల్మాన్ సౌదీ అధికారం చేపట్టిన నాటినుంచీ ఆర్థిక సంక్షోభాన్నుంచి గట్టెక్కడం కోసం అనేక ప్రయత్నాలు చేసినా ఫలితాలివ్వలేదు. చమురు బ్యారెల్ ధర వంద డాలర్ల నుంచి ముప్ఫై డాలర్లకు పడిపోవటంతో సౌదీ 390 బిలియన్ల రాబడి కోల్పోయింది. దీంతో వంద బిలియన్ల లోటు బడ్జెట్ ఏర్పడింది. ఆర్థిక సంస్కరణలతో సంక్షోభం నుంచి బయట పడటానికి సౌదీ రాజు ప్రయత్నించారు. ఇంధనాలు, మంచినీటిపై పన్నులు విధించడానికి ప్రయత్నిస్తే, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించటంతో ఆదాయ వనరులకు దారులేవీ మిగలలేదు. చమురు అమ్మకాలపైనే ఆధారపడాలంటే, చౌకధరల విధానం కలిసిరాక పరిస్థితి చేయిదాటి పోయింది. చెల్లింపులన్నీ నిలిచిపోయాయి. దీంతో సౌదీలోని ప్రముఖ కంపెనీలన్నీ దివాలా తీశాయి. ఈ ప్రభావం నిర్మాణరంగంపై భారీగా పడ్డది. 

సౌదీలో అతి పెద్ద కంపెనీలైన బిన్‌లాదెన్ నిర్మాణ కంపెనీ, ఓజర్ కంపెనీలు మూత పడటంతో కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి. ఒక్క బిన్ లాదెన్ కంపెనీలోనే యాభై వేల మంది కార్మికులు పనిచేస్తారు. దీంట్లో ఏడు నెలలుగా జీతాల్లేవు. మొన్న అకస్మాత్తుగా లాకౌట్ ప్రకటించడమే కాదు, కార్మికులకు నిర్వహిస్తున్న మెస్‌ను కూడా మూసేశారు. ఈ క్రమంలోనే ఓజెస్ కూడా మూత పడ్డది. ఈ కంపెనీల్లోనే నైపుణ్య రహిత కార్మికులు వేలాదిగా పనిచేస్తున్నారు. మన దేశం నుంచీ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కడప ,కర్నూలు ,తూర్పుగోదావరి  జిల్లాలనుంచి గల్ఫ్ బాట పట్టిన వారు అనేక మంది ఉన్నారు. లక్షలాది రూపాయల అప్పులు చేసి సౌదీ విమానం ఎక్కిన వారు తిరిగి వట్టి చేతులతో ఎలా తిరిగి రావాలని గొల్లుమంటున్నారు. గల్ఫ్ చట్టాల ప్రకారం ఒక కంపెనీలో ఐదేళ్లు పనిచేస్తే ఏడాదికి పదిహేను రోజుల చొప్పున రెండున్నర నెలల జీతం సదరు కంపెనీ కట్టివ్వాలి. ఐదేళ్లకు పైగా పనిచేస్తే ఏడాదికొక నెల జీతం కట్టివ్వాలి. కానీ ప్రభుత్వం నుంచి సాయమందితే తప్ప తామేమీ చెల్లించలేమని కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. అయితే ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సౌదీ ప్రభుత్వం నుంచి తగిన హామీ పొంది కార్మికుల జీతభత్యాలు రాబట్టేందుకు భారత ప్రభుత్వ ప్రయత్నం చేయాలి. సరియైన ధృవపత్రాలు లేక జైళ్ల పాలైన కార్మికులను కూడా విడిపించుకు రావా లి. గల్ఫ్ కష్టాలు కొత్తవి ఏమీ కాదు. ఎంతో కాలంగా అనేక రకాలుగా మోసపోయిన, దౌర్జన్యాలకు బలైన గల్ఫ్ కార్మికులు ప్రభుత్వ తోడ్పాటు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత ఘటన నుంచైనా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. గల్ఫ్ దేశాల్లోని కార్మికుల సంక్షేమం, భద్రత కోసం బాధ్యతగా వ్యవహరించాలలి.

సాయికృష్ణ యాదవ్, 
గల్ఫ్ వలసలపై పరిశోధక విద్యార్థి.
ఉస్మానియాయూనివర్సిటీ.​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com