తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ

- August 03, 2016 , by Maagulf
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ

భూసేకరణపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రైతుల నుంచి నేరుగా భూములు సేకరించేందుకు ఉద్దేశించి జారీ చేసిన జీవో 123ని హైకోర్టు కొట్టేసింది. మల్లన్నసాగర్ సహా పలు ప్రాజెక్టుల భూసేకరణపై ఈ తీర్పు ప్రభావం చూపించబోతోంది. ప్రభుత్వ జీవో 123ని వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లాకి చెందిన రైతు హైకోర్టును ఆశ్రయించారు. పరిహారం చెల్లించే విషయంలో రైతులతోపాటు, కౌలు రైతులు, రైతు కూలీలకు కూడా న్యాయం చేయాలని కోరారు. ఐతే, 123 జీవోలో కౌలు రైతుల పరిహారం విషయం లేకపోవడంతో పిటిషనర్‌ లేవనెత్తిన అభ్యంతరాలతో కోర్టు ఏకీభవించింది. జీవో రద్దు చేస్తూ నిర్ణయం వెలువరించింది.

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంట్లో భాగంగానే మల్లన్నసాగర్ సహా పలు ప్రాజెక్ట్‌లు చేపట్టింది. ఇందుకోసం జీవో 123ని తెచ్చింది. ఈ జీవో ప్రకారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ పరిహారంపై నిర్ణయం తీసుకున్నాక, ఆ లెక్కనే చెల్లింపులు చేస్తారు. ఐతే, ఇందులో రైతులకే తప్ప కౌలుదార్లకు, ఈ భూములపై ఆధారపడ్డ మిగతా వాళ్లకు చెల్లింపులపై ఎలాంటి నిర్ణయం లేదు. దీన్నే ఇప్పుడు హైకోర్టు కూడా తప్పుపట్టింది. 2013 చట్టం ఉండగా కొత్త జీవో అవసరం ఎందుకొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తే కౌలుదార్లకు కూడా న్యాయం జరుగుతుంది. అలాగే భూమి విలువకు నాలుగురెట్లు పరిహారం చెల్లించాల్సి వస్తుంది. కానీ 123 జీవోలో ఈ అంశాలు లేవు. మార్కెట్ విలువ ప్రకారమే ఇక్కడ పరిహారం ఇస్తారు. ఐతే, మంత్రి హరీష్‌ స్వయంగా రంగంలోకి దిగి రైతులతో మాట్లాడడంతో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు భూములిచ్చేందుకు కొందరు రైతులు ముందుకొచ్చారు. ఇంతలో ఇప్పుడు హైకోర్టు జీవోను కొట్టేస్తూ తీర్పు ఇవ్వడంతో ప్రాజెక్టుల భూసేకరణపై ఇది ప్రభావం చూపించే పరిస్థితి కనిపిస్తోంది. మల్లన్నసాగర్‌, ఏటిగడ్డ, పాలమూరు ఎత్తిపోతల సహా పలు ప్రాజెక్ట్‌ల భవితవ్యం ఇప్పుడు గందరగోళంలో పడింది.                        

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com