నైతిక విలువలను పాటిస్తూ సమాజ సేవకు అంకితమవ్వాలి: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
- June 09, 2026
విజయవాడ: విద్యార్థులు జీవితాంతం ఉన్నత నైతిక, సామాజిక విలువలను పాటిస్తూ, సమాజంలోని పేద, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్.అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన 10వ, 11వ, 12వ సంయుక్త వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, విద్యార్థులు పొందిన డిగ్రీలు కేవలం విద్యా విజయాలకు గుర్తింపు మాత్రమే కాకుండా, సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేస్తాయని అన్నారు. ముఖ్యంగా వెనుకబడిన, అణగారిన వర్గాల సంక్షేమం కోసం తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను వినియోగించాలని సూచించారు.
విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక నాక్ (NAAC) ‘ఏ’ గ్రేడ్‌ను 3.23 సీజీపీఏతో సాధించడం అభినందనీయమని గవర్నర్ పేర్కొన్నారు.ఈ ఘనత విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల సమిష్టి కృషికి నిదర్శనమని కొనియాడారు.
అలాగే, కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సంయుక్తంగా ‘డీప్ ఓషన్ మిషన్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్’ కింద విశ్వవిద్యాలయం మెరైన్ బయాలజీ విభాగానికి రూ.4.12 కోట్ల గ్రాంట్ మంజూరు చేయడం సంతోషకరమని తెలిపారు. దీని ద్వారా సముద్ర శాస్త్ర విద్య, పరిశోధనలు, మానవ వనరుల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు.
స్నాతకులు, పీజీ విద్యార్థులు, పరిశోధకులు, బంగారు పతక విజేతలను గవర్నర్ అభినందించారు. విశ్వవిద్యాలయం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్, రాజ్యసభ సభ్యుడు శ్రీ బీడా మస్తాన్ రావు యాదవ్, శాంతా బయోటెక్నిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డిలకు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (హానరిస్ కాజా) ప్రదానం చేసింది.
ఈ సందర్భంగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు వార్షిక నివేదికను సమర్పించారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







