మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం

- July 08, 2026 , by Maagulf
మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం

హైదరాబాద్: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మరియు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి మంగళవారం ఘనంగా శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా క్రీడా పోటీలను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. విధుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడం ప్రతి పోలీసు ఉద్యోగి బాధ్యత అని సూచించారు.

“పోలీసు సేవ నుంచి ఒకరోజు విరామం తీసుకుంటాను.. కానీ క్రీడలను మాత్రం ఎప్పటికీ వదలను” అని డీజీపీ పేర్కొంటూ, జీవితాంతం క్రీడాస్ఫూర్తిని కొనసాగించాలని ప్రతి ఒక్కరికీ పిలుపునిచ్చారు. క్రీడలు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావనను పెంపొందిస్తాయని ఆయన అన్నారు.

కమిషనర్ సుమతి మాట్లాడుతూ, పోలీసు సిబ్బందిలో ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించేందుకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ క్రీడా మహోత్సవంలో వివిధ విభాగాలకు చెందిన పోలీసులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రారంభ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com