పోలీస్ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలి: సీఎం రేవంత్
- August 04, 2026
హైదరాబాద్: రాష్ట్రంలో పోలీస్ శాఖలో 7,437 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని దశల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇటీవల విడుదలైన పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు, ఇతర స్వార్థపూరిత శక్తులు (Vested Interests) నియామక ప్రక్రియకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి నివేదించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అత్యవసరంగా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో డీజీపీ సీ.వీ ఆనంద్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సీఎం ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నియామక ప్రక్రియలో ప్రతి దశను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించి, ఎలాంటి లోపాలకు తావులేకుండా చూడాలని ఆదేశించారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణా, భద్రపరిచే ప్రక్రియలలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
అలాగే పరీక్షా కేంద్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా కోచింగ్ సెంటర్ల కార్యకలాపాలపై నిఘా పెంచాలని ఆదేశించారు. నియామక పరీక్షలపై సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అభ్యర్థులను మోసం చేసే దళారులు, నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ విభాగం ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పరీక్షల నిర్వహణ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలు పూర్తిస్థాయి అప్రమత్తతతో పనిచేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇక ఇంటింటికీ ఇంటర్నెట్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- దుబాయ్ కార్ షోరూమ్ పేలుడు ఘటనలో మృతి చెందినది భారతీయుడే..
- టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం
- పోలీస్ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలి: సీఎం రేవంత్
- ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- కాంగోలో ఎబోలా వైరస్ కలకలం..1,700 మంది మృతి
- ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- 17 రోజుల్లో 839 మంది అరెస్ట్.. 280 మిలియన్ డాలర్ల ఆస్తుల సీజ్..!!
- ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం.. 9 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత కేరళ ప్రవాసికి రూ.1.36 లక్షల పరిహారం
- కువైట్‌లో బ్యాంక్ కార్డుల వినియోగం జోరు..!!







