చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్..
- October 05, 2026
న్యూ ఢిల్లీ: చిన్న వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా జీఎస్టీ నిబంధనల్లో పలు మార్పులను పరిశీలించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఢిల్లీలో అక్టోబర్ 7న జరగనున్న 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను విధానాన్ని మరింత సరళీకరించడం, వివాదాలను తగ్గించడం, రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేయడం వంటి పలు ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. అయితే ఇవి ప్రస్తుతం ప్రతిపాదనలు మాత్రమే.. కౌన్సిల్ ఆమోదించిన తర్వాతే అమల్లోకి వస్తాయి.
GST ఉల్లంఘనల పై అరెస్టు అధికారాలకు చెక్?
జీఎస్టీ ఉల్లంఘనలకు సంబంధించి పన్ను అధికారులకు ఉన్న అరెస్టు అధికారాలను తొలగించడం లేదా పరిమితం చేయడం ప్రధాన ప్రతిపాదనల్లో ఒకటిగా ఉంది. అరెస్టు అవసరమైతే న్యాయపరమైన అనుమతి తప్పనిసరి చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో క్రిమినల్ ప్రాసిక్యూషన్ ప్రారంభించే పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచే ప్రతిపాదన కూడా ఉంది. దీంతో చిన్న స్థాయి పన్ను వివాదాలు క్రిమినల్ కేసులుగా మారకుండా చూడాలన్న ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది.
నిజాయితీగా పన్ను చెల్లించే కొనుగోలుదారులకు ఊరట
సప్లయర్ పన్ను చెల్లించకపోయినా, కొనుగోలుదారు నిబంధనల ప్రకారం లావాదేవీ జరిపి పన్ను చెల్లించినట్లయితే అతడి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను రక్షించే ప్రతిపాదనను కూడా కౌన్సిల్ పరిశీలించనుంది. ఇలాంటి సందర్భాల్లో తప్పు చేసిన సప్లయర్‌పై రికవరీ చర్యలు తీసుకోవడం ద్వారా.. నిజాయితీగా వ్యవహరించిన కొనుగోలుదారులపై భారం పడకుండా చూడాలని ప్రతిపాదిస్తున్నారు.
చిన్న వ్యాపారులకు ఫైలింగ్‌లో మరింత సౌలభ్యం
రూ.5 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులకు జీఎస్టీ రిటర్నుల విషయంలో మరింత సులభమైన విధానాన్ని తీసుకురావడంపై చర్చ జరగనుంది. త్రైమాసిక పన్ను చెల్లింపులతో పాటు రిటర్న్ దాఖలును సరళీకరించే అవకాశం ఉంది. చిన్న ఈ-కామర్స్ వ్యాపారులు తమ సొంత ప్రాంగణం లేకపోయినా.. ప్లాట్‌ఫామ్‌కు చెందిన వేర్‌హౌస్‌ను GST రిజిస్ట్రేషన్ కోసం వ్యాపార చిరునామాగా ఉపయోగించుకునే వెసులుబాటుపైనా ప్రతిపాదన ఉంది.
రీఫండ్లు, ITC ప్రక్రియ వేగవంతం
GST రీఫండ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కూడా సమావేశంలో చర్చకు రానుంది. రిస్క్ ఆధారిత విధానంతో తక్కువ ప్రమాదం ఉన్న క్లెయిమ్‌లను ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేసే విధానాన్ని విస్తరించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే ఉద్యోగులకు సంస్థలు అందించే గ్రూప్ హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌పై చెల్లించే GSTకి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనుమతించే అంశం కూడా పరిశీలనలో ఉంది. ఈ మార్పు ఆమోదం పొందితే సంస్థలకు, ముఖ్యంగా ఉద్యోగుల బీమా కల్పించే కంపెనీలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.
57th GST Council Meeting: ఆరోగ్య రంగానికి కూడా పన్ను ఊరట?
అరుదైన వ్యాధుల చికిత్సకు ఉపయోగించే కొన్ని ఔషధాల దిగుమతిపై GST మినహాయింపులను విస్తరించే అంశంపైనా చర్చ జరగనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన తుది జాబితా, మినహాయింపు పరిమితులు కౌన్సిల్ నిర్ణయం తర్వాతే స్పష్టమవుతాయి. GST కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే.. పన్ను వివాదాల పరిష్కారం, చిన్న వ్యాపారుల compliance, ITC, రీఫండ్ ప్రక్రియల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అంశాలను తుది నిర్ణయాలుగా భావించకూడదు. అక్టోబర్ 7న జరిగే 57వ GST కౌన్సిల్ సమావేశం తర్వాతే ఏ మార్పులు అధికారికంగా అమల్లోకి వస్తాయనే దానిపై స్పష్టత రానుంది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!
- నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ స్కూళ్లలో ఫొటోలు, వీడియోలపై కొత్త నిబంధనలు..!!
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్







