వియత్నాంకు భారత్ రూ. 3400 కోట్ల రుణసాయం

- September 03, 2016 , by Maagulf
వియత్నాంకు భారత్ రూ. 3400 కోట్ల రుణసాయం

చైనా, రష్యాల తర్వాత వియత్నాంతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం భారత్ శనివారం పలు ఒప్పందాలు చేసుకుంది. ప్రధాని మోదీ వియత్నాం పర్యటనలో భాగంగా కీలక అంశాలపై చ ర్చించారు. రక్షణ సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకునేందుకు వియత్నాంకు భారత్ రూ. 3400 కోట్ల రుణసాయం చేయనుంది. ఇరు దేశాలు 12 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వియత్నాం ప్రధాని గుయేన్ ఫుక్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తర్వాత మోదీ మీడియాతో మాట్లాడుతూ..'పూర్తి స్థాయి ద్వైపాక్షిక సహకారం కోసం చర్చలు జరిపాం. ఈ ప్రాంతంలో రెండు దేశాలు కీలకం కావడంతో సహకారం పెంచుకోవడంతో పాటు బలోపేతానికి అంగీకరించాం.' అని మోదీ పేర్కొన్నారు. 

రక్షణ, ఐటీ రంగాల్లో తోడ్పాటు:
చర్చల అనంతరం రక్షణ, ఐటీ, అంతరిక్షం, సైబర్ భద్రత వంటి రంగాల్లో 12 ఒప్పందాలపై ఇద్దరు ప్రధానుల సమక్షంలో సంతకాలు జరిగాయి. సముద్రంలో గస్తీ బోట్ల నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. వియత్నాం తీర రక్షక దళం కోసం భారత్‌కు చెందిన ఎల్‌అండ్‌టీ బోట్లను నిర్మించనుంది. నాహ్ త్రాంగ్‌లోని టెలీకమ్యూనికేషన్స్ విశ్వవిద్యాలయంలో సాఫ్ట్‌వేర్ పార్కు కోసం ప్రధాని మోదీ రూ. 34 కోట్ల సాయాన్ని ప్రకటించారు. మోదీ మాట్లాడుతూ... 'నూతన వాణిజ్యం, వ్యాపార అవకాశాల్ని వినియోగించుకుంటూ 2020 నాటికి రూ. లక్ష కోట్ల వాణిజ్యం లక్ష్యాన్ని సాధించాలి. భారత్ చేపడుతున్న కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలంటూ వియత్నాం కంపెనీల్ని ఆహ్వానించాను. ' అని మోదీ హామీనిచ్చారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థతో వియత్నాం కలిసి పనిచేసేందుకు అంతరిక్ష సహకారంపై ఒప్పందం అవకాశం కల్పిస్తుందని చెప్పారు.

ముఖ్య నేతలతో మోదీ భేటీ:
తన పర్యటనలో మోదీ వియత్నాంకు చెందిన పలు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం విషయంలో భారత్ వైఖరిని ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీని పూర్తిగా సమర్దిస్తున్నానని వియత్నాం అధ్యక్షుడు క్వాంగ్ పేర్కొన్నారు. ఇరు దేశాల సంబంధాలపై ప్రధాని మోదీతో ఆయన చర్చించారు. అంతర్జాతీయ వేదికలపై సహకారాన్ని మెరుగుపర్చుకోవాలని వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గుయేన్ త్రాంగ్ కోరారు. పర్యటనలో భాగంగా మోదీ చారిత్రక పగోడాను సందర్శించారు. వియత్నాం ప్రధానితో కలిసి చేపలకు మేత వేశారు. పర్యటన ముగించుకున్న మోదీ జీ 20 సదస్సు కోసం శనివారం చైనాలోని హంగ్జౌకు చేరుకున్నారు. ఎన్‌ఎస్జీలో భారత్‌కు చోటు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో చైనా సహకారంతో నిర్మిస్తోన్న ఎకనామిక్ కారిడార్‌పై నేడు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో మోదీ చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com