'మిస్‌ జపాన్‌' కిరీటాన్ని గెలుచుకున్న భారత సంతతి..

- September 06, 2016 , by Maagulf
'మిస్‌ జపాన్‌' కిరీటాన్ని గెలుచుకున్న భారత సంతతి..

భారత మూలాలున్న జపాన్‌ అందాల సుందరి ప్రియాంక యోషికవా (22) 'మిస్‌ జపాన్‌' కిరీటాన్ని గెలుచుకున్నరు. భారతీయుడైన తండ్రి, జపాన్‌ దేశస్థురాలైన తల్లి అందచందాలన్నీ పుణికి పుచ్చుకున్న పొడగరి (5 అడుగుల8 అంగుళాలు) ప్రియాంకకు ఏనుగుల శిక్షకురాలిగా అధీకృత లైసెన్స్‌ ఉండటం మరో ప్రత్యేకత. తాను ఎన్నోసార్లు జాతి సంబంధమైన సమస్యలను ఎదుర్కొన్నట్లు ఆమె తన విజయానంతరం మాట్లాడుతూ....ఉద్వేగంగా చెప్పారు. జపాన్‌ కాలమానం ప్రకారం సోమవారం ఆమె 'మిస్‌జపాన్‌' పోటీలో విజేతగా నిలిచారు. ఇప్పుడిక డిసెంబరులో వాషింగ్టన్‌లో జరగనున్న 'మిస్‌ వరల్డ్‌' పోటీల్లో ఆమె పాల్గొంటారు.ఇతర దేశాలు, జాతుల మూలాలున్న వారు ఇలాంటి అందాల పోటీల్లో ఇదివరకెన్నడూ జపాన్‌కు ప్రాతినిధ్యం వహించలేదు. ఇటీవలే నల్లజాతి మూలాలున్న యువతి అరియానా మియామోటో జపాన్‌కు ప్రాతినిధ్యం వహించడంతో సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక అందాల సుందరి కిరీటాన్ని గెలుచుకోవడం ప్రత్యేకతను సంతరించుకుంది. తనలా ఇతర దేశాల మూలాలను కలిగిన వారెవరూ ప్రాతినిధ్యం వహించలేకపోవడాన్ని ప్రియాంక ప్రస్తావిస్తూ...అరియానా తనను ఎంతగానో ప్రోత్సహించిందని పేర్కొన్నారు. జపాన్‌లోని సజాతీయతా భావజాలంపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని ప్రియాంక యోషికవా తెలిపారు.టోక్యోలోనే పుట్టిన ప్రియాంక కొన్నేళ్లపాటు శాక్రమెంటో, ఓ ఏడాది పాటు భారత్‌లో ఉండి...పదేళ్ల వయసులో జపాన్‌కు తిరిగి వచ్చారు. తనలాగే ఇతర దేశాల మూలాలున్న ఎంతోమంది ఎన్నోరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. తనను ఓ పురుగుతో సమానం'గా భావించారనీ...తనను తాకితే మైలపడిపోతామన్నట్లు ప్రవర్తించినవారూ ఉన్నారని ఆమె ఆవేదనగా చెప్పారు. అయితే, ఈ పరిణామాలన్నీ కూడా తనను మరింత రాటుదేల్చాయంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com