అగ్రరాజ్యం అమెరికా బాంబు పేలుళ్లలో దద్ధరిల్లుతోంది..
- September 18, 2016
అగ్రరాజ్యం అమెరికా బాంబు పేలుళ్లలో దద్ధరిల్లుతోంది. తాజాగా న్యూయార్క్ పరిధిలోగల మన్‌హటన్‌లోని వెస్ట్ 23 వీధిలోని డంప్ యార్డులో శనివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. మొత్తం రెండు చోట్ల పేలుడు పదార్థాలు పెట్టారు.
విస్ఫోటనంలో 29 మంది గాయపడ్డారు. రెండో బాంబును రోబో సాయంతో పరీక్షిస్తున్నారు. అగ్నిమాపక శకటాలు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రులకి తరలించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఉగ్రవాదుల కుట్రా? అన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. న్యూజెర్సీలో ఛారిటీ రేస్ జరుగుతున్న సమయంలో పైప్ బాంబు పేలిందని.. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే ఈ విస్ఫోటనం చోటు చేసుకుందనిఅధికారులు తెలిపారు.
రెండో బాంబు గుర్తింపు
కనీసం రెండు చోట్ల పేలుడు పదార్థాలు పెట్టి వుంటారనే అధికారుల అనుమానాలు నిజమయ్యాయి. తొలి విస్ఫోటనం వెస్ట్23 వీధిలో జరగ్గా రెండో పేలుడు పదార్థాన్ని వెస్ట్27 వీధిలో అంటే నాలుగు బ్లాకుల దూరంలో కనిపెట్టారు. ఇది 2013లో బోస్టన్ మారథాన్‌లో వినియోగించిన ప్రెషర్ కుక్కర్ తరహా బాంబు కావడం గమనార్హం. పేలుడు జరిగిన దాదాపు మూడు గంటల తర్వాత దీనిని గుర్తించారు. ప్రెషర్ కుక్కర్‌కు సంబంధించిన చిత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కుక్కర్‌కు వైర్లతో ఓ మొబైల్ ఫోన్ అనుసంధానమై వుంది. ఈ చిత్రం సరైనదే అని పోలీసులు ధ్రువీకరించారు.
ఒబామా ఆవేదన
పేలుడు జరగడం పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆవేదన వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లో సోమవారం ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఒబామా కొన్ని రోజులు పాటు అక్కడే ఉండనున్నారు. ఆయన నగరానికి బయలుదేరడానికి కొన్ని గంటల ముందుగా ఈ విస్ఫోటనం సంభవించింది. పేలుడుకు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఉద్దేశ పూర్వక చర్య
మన్‌హటన్‌లో జరిగిన పేలుడు ఉద్దేశపూర్యక చర్య అని న్యూయార్క్ మేయర్ బిల్ దె బ్లసియో వెల్లడించారు. వీటితో ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ ఉగ్రవాద సంస్థ నుంచీ న్యూయార్క్ నగరానికి ప్రత్యేక గురి లేదని ఆయన పేర్కొన్నారు. పేలుడుకు కారణాలేవైనా సరే నగర ప్రజలను భయపెట్టలేవన్నారు.
అనుమానితుల జాడ లేదు
పేలుడు ఘటనకు సంబంధించి అనుమానితులెవర్నీ అదుపులోకి తీసుకోలేదని పోలీసు కమిషనర్ జేమ్స్ ఓ నెయిల్ తెలిపారు. బాధ్యులను గుర్తించే పనిలో నిమగ్నమయినట్లు వెల్లడించారు. విస్ఫోటనానికి సంబంధించిన వీడియో ఫుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారని, ప్రజల వద్ద ఏమైనా వుంటే తమకు అందిచాలని కోరారు. ప్రత్యక్ష సాక్షులనూ విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవి తెలియదు
* పేలుడు ఘటనకు బాధ్యులెవరో ఇంకా తెలియలేదు.
* రెండో పేలుడు పదార్థంగా భావిస్తున్న ప్రెషర్ కుక్కర్ లోపల ఏముందో తెలియదు.
* విస్ఫోటనానికి ఆ స్థలాన్నే ఎందుకు ఎంచుకున్నారు?
* వీటి వెనక వున్న ఉద్దేశం ఏమిటి?
హిల్లరీ, ట్రంప్ స్పందన
విస్ఫోటన ఘటనపై అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ వాషింగ్టన్లో తమ ఎన్నికల సభను వాయిదా వేసుకున్నారు. నిరంతరం ఘటనకు సంబంధించిన అంశాలు తెలుసుకుంటున్నారు. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, విచారణ వేగవంతం చేయాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









