నేడు భారత జాతిపిత మహాత్మగాంధీజీ 147 వ జయంతి--స్పెషల్ స్టోరీ

- October 02, 2016 , by Maagulf

మహాత్ముడికి  " మా గల్ఫ్.కామ్ "  మహా నివాళి. 

మహాత్మగాంధీజీ ! ఈ పేరు స్ఫురణకు రాగానే చంటి పిల్లలనుంచి చరమాంకానికి చేరువవుతున్న వృద్ధుల వరకు ఒకే భావన ఉప్పొంగుతుంది. మన "బాపు" అంటూ ప్రతి ఇంటా ఆ పేరు జే గంటై మ్రోగుతుంది. ఆయన గురించి అందరి అభిప్రాయం ఒక్కటే. ఆయన మహాత్ముడు. మహా వైశాల్యంగల ఒక దేశ ప్రజానీకాన్ని ఏక తాటిపై నడిపించగలిగిన మహిమాన్వితుడు. తన పట్ల ఏకైక భావనను ఏక కాలంలో కలిగేట్లు చేయగలిగిన సమ్మోహన శక్తి కలిగిన గాంధి ప్రపంచ దేశాల్లోనూ అదే విధమైన అభిమానాన్ని పొందినవాడు కావడం ఒక చారిత్రక విప్లవం. ఇది మరే ఇతర నాయకుడికీ సాధ్యంకాని మహాద్భుత విశేషం. ఒక సాధారణ మనిషి అసాధారణ స్థాయికి ఎలా ఎదగగలిగాడు? ఏ ప్రతిఫలాపేక్షను ఆశించి తెల్ల దొరతనాన్ని ప్రశ్నించాడు? ఏ లక్ష్యం కోసం వారిని ప్రతిఘటించాడు? అని ప్రతి భారతీయుడూ ఈ ప్రశ్న కోసం సమాధానం వెదుక్కుంటే తాను తన దేశానికి ఏం చెయ్యాలో బోధపడుతుంది.
అక్టోబర్ 2, 1869లో గుజరాత్‌లోని పోర్ బందర్‌లో జన్మించిన గాంధి మెట్రిక్యులేషన్ పాసయ్యాక ఉన్నత చదువుల నిమిత్తం ఇంగ్లాండ్ వెళ్ళారు. అక్కడే లా విద్యను అభ్యసించారు. తరువాత దేశానికి తిరిగొచ్చి న్యాయవాద వృత్తిని చేపట్టి మూడేళ్ళపాటు బొంబాయి, రాజ్కోట్‌లలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 1893లో దక్షిణాఫ్రికా వెళ్ళి 20 సంవత్సరాలకు పైగా అక్కడే నివాసమున్నారు. అక్కడ ఇతర భారతీయుల వలె అనేక అవమానాలకు గురయ్యారు. అవమానకరమైన ఈ సంఘటనలే ఆయన్ను ఓ గొప్ప నాయకుడుగా తీర్చిదిద్దాయి. 1915లో ఆయన భారతదేశానికి తిరిగొచ్చాక సబర్మతీ తీరాన ఆశ్రమాన్ని నిర్మించి, భారతదేశం మొత్తం పర్యటించారు. మాతృదేశం గురించి విజ్ఞానాన్ని సంపూర్ణంగా గ్రహించిన తరువాత పూర్తిస్థాయిలో స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. సత్యాగ్రహాన్ని ఆయుధంగా చేసుకుని ఆయన సాగించిన పోరు దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించిపెట్టింది. ప్రపంచాన్ని నివ్వెరపోయేట్లు చేసింది. ఒకే ఒక్కడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి జాతి యావత్తునూ ఒక్కటి చేసి తన ఉద్యమం ద్వారా తన మనసునీ, తన మనసు ద్వారా తన జీవితాన్నీ, తన జీవితం ద్వారా ఓ మహా సందేశాన్ని అందించిన బాపు "నా జీవితమే నా సందేశం" అని చాటారు. ఆ సందేశం వెనక ఆయన ఆరాటం, పోరాటం స్పష్టంగా కనిపిస్తాయి. ఆ సందేశం భారత జాతికే కాదు, విశ్వ జాతికీ అని ప్రపంచమంతా గ్రహించింది. అంతే కాకుండా ఆ సందేశం విశ్వ శాంతికి అని కూడా స్పష్టమైన సంకేతాన్నిచ్చింది.
'నా జీవితమే నా సందేశం' : గాంధి ఇచ్చిన ఈ సందేశం అలుపెరుగని ఆయన పోరాట పటిమను చాటి చెపుతుంది. అసహనాన్ని దరికి చేరయనీయని ఆయన సహనశీలత్వాన్ని తేటతెల్లంజేస్తుంది. దక్షిణాఫ్రికా నుంచి మాతృ దేశానికి తిరిగివచ్చిననాటినుంచి ఆయన అనుసరించిన మార్గం, స్వదేశంనుంచి విదేశీయులను తరిమికొట్టేందుకు ఆయన ఆచరించిన శైలి ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. తన జీవితమే తెరిచిన పుస్తకంలా భారతీయుల ముందు పరచి తన ఉద్దేశాలు, ప్రణాళికలను ప్రతి ఒక్కరికీ తెలియబరచిన ఆయన నిష్కల్మషత కోట్లాదిమందికి అనుసరణీయమైంది. ప్రజలు తన ఉద్దేశాలను గౌరవించి అనుసరించినందుకు ఎల్లవేళలా వారిపట్ల ప్రేమభావాలను కురిపించి తన జీవితాన్ని వారికోసమే త్యాగం చేసిన పుణ్యపురుషుడు ఆయన. ప్రజల కోసమే గాంధి, గాంధి వెంటే ప్రజలుగా ఒకరు నిజమై మరొకరు నీడై కలసిమెలసి, కలలో సైతం కలిసే పోరాటం చేసి స్వాతంత్ర్య ఫలాలను అందుకున్న చరిత్ర ఈ దేశానికే సొంతం. ఇదంతా ఆయన వ్యక్తిత్వం వల్ల మాత్రమే సాధ్యపడిందనడం వాస్తవం. ఆ వ్యక్తిత్వానికి తోడైన ఆత్మవిశ్వాసం ఆయనను విశ్వమంత నరుణ్ణి చేసింది. విశ్వం ఆయన్ను ఓ పూర్ణపురుషుడుగా కీర్తించింది. "నా జీవితమే నా సందేశం" అన్న ఆయన పలుకు అక్షర సత్యమై ఆయన జీవితం ప్రతి భారతీయ పౌరుడికీ అనుసరణీయమయ్యింది, ఆయన వ్యక్తిత్వం ఓ సందేశాత్మకమై విజయ శంఖం పూరించింది. ఆ సందేశం ఉక్కు కవచమై స్వతంత్ర భరతావనిని రక్షిస్తోంది.
'నా జీవితమే నా సందేశం' : మరో కోణంలో ఇది మరో సందేశాన్ని ఇస్తుంది. ఐతే ఈ సందేశం బ్రిటిష్ పాలకులలాంటి దురాక్రమణదారులకు హెచ్చరికలాంటిది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య వైభవం ఆయన సృష్టించిన కళ్ళకు కనిపించని ఆయుధమైన సత్యాగ్రహం వల్ల మరో ఉదయానికి అవకాశం లేకుండా అస్తమించింది. బ్రిటిష్ ప్రభుత్వానికి జరిగిన శాస్తి భారతదేశంపై కన్నెత్తి చూస్తే ఏ దేశానికైనా పడుతుందనే హెచ్చరిక ఆ సందేశంలో ఉంది. పోరాడీ, పోరాడీ పోరాటాలకు అలవాటుపడిన గుండెలతో తెగింపును ఆయుధాలుగా చేసుకునే స్థైర్యంతో గాంధి అడుగుజాడలలో నడిచీ, నడిచీ ఆత్మవిశ్వాసమే ఆలంబనగా స్థిరచిత్తాన్ని అలవరచుకున్న భారతీయుల మనో నిగ్రహాన్ని ఆ సందేశం చాటుతుంది. అప్పటివరకు దిశా నిర్దేశం లేని స్వాతంత్ర సంగ్రామం గాంధి రాకతో ఒక రూపును సంతరించుకుంది. ఒక మార్గాన్ని ఏర్పరచుకుంది. ఒక నాదాన్ని అలవరచుకుంది. ఒక క్రమశిక్షణతో అడుగులేసింది. క్రమక్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరి మెట్టు చేరుకునే మార్గంలో అనేక ఉద్యమాలకు ఊపిరి పోసి, ఆ ఉద్యమాలలో విజయం సాధిస్తూ బ్రిటిష్ జండాను ఎట్టకేలకు తల వంచేట్లు చేసింది. ఆవిధంగా ప్రపంచంలోనే అత్యంత శక్తిసంపన్నమైన దేశమైన బ్రిటన్ అహింసే ఆయుధంగా మలచుకున్న భారత్ ముందు తన ఆయుధ సంపత్తికి తిలోదకాలివ్వవలసివచ్చింది. అటువంటి ఆయుధ సంపత్తి ఏ దేశానికి ఎంతున్నా అహింస ముందు దిగదుడుపే అని అఖండ భారతావని ఋజువు చేసింది. భారత ప్రజలకు అటువంటి శక్తిని ప్రసాదించిన గాంధి వ్యక్తిత్వం ప్రతి భారతీయుడి మదిలోనూ పదిలంగా నిక్షిప్తమై ఉంది. ప్రపంచ దేశాలకు అహింస యొక్క శక్తిని తెలియజేయడం ద్వారా గాంధి తన సందేశాన్ని పరోక్షంగానే చెప్పినట్లయ్యింది. అందుకే మహాత్మా గాంధి పుట్టిన రోజైన అక్టోబర్ 2ను "అంతర్జాతీయ అహింసా దినోత్సవం"గా యునైటెడ్ నేషన్స్‌లోని 114 సభ్య దేశాలు తీర్మానించాయి. అహింసవైపు అడుగేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పాయి.
గాంధి జయంతిని మనం జరుపుకుంటున్నామంటే అహింసా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లే. ఆర్ధికంగా అభివృద్ధి చెందిన దేశాలు, హింసోన్మాదమే ప్రధాన అజెండాగా అలజడిని సృష్టించే రాజ్యాలూ హింస తాత్కాలిక ప్రయోగం మాత్రమేనని ఈ రోజైనా గుర్తించాల్సిన అవసరం ఉంది. అహింసతో సాధించలేనిది ఏదీ లేదని ఋజువు చేసిన గాంధీజీ బాటే ఏనాటికైన ప్రపంచపు బాట అవుతుందని వారు గుర్తెరిగి ప్రవర్తించాలి. ఇప్పటికే 114 సభ్య దేశాలు ఈమేరగా దృష్టి సారించాయి. హింసను, అణ్వాయుధాలను నమ్ముకున్న ఇతర దేశాలు కొంతకాలానికైనా ఈ వాస్తవాన్ని గ్రహించక తప్పదు. చేతులు కాలకముందే వారు తగిన చర్యలు తీసుకోవడం అవసరం. లేకుంటే హింసను నమ్ముకున్నవారు ఆ హింసకే బలికాక తప్పదు. ఇది చరిత్ర నేర్పిన పాఠం. ఆ పాఠాలను అనుసరించిననాడే "గ్లోబల్ విలేజ్" అను పదానికి నిజమైన అర్ధం చేకూరుతుంది. ప్రపంచంలో నేడు ఎక్కడ హింస జరిగినా బాపూజీ అహింసా విధానం చర్చకు రాక మానదు. మానవాళి మనుగడకోసం విశాల దృష్టితో అహింసను ప్రబోధించిన మహాత్ముడికి ఈ 147 వ  జయంతి సందర్భంగా   " మా గల్ఫ్.కామ్ "  మహా నివాళి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com