వీజీఎఫ్‌ పథకాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..

- October 27, 2016 , by Maagulf
వీజీఎఫ్‌ పథకాన్ని ప్రకటించిన  రాష్ట్ర ప్రభుత్వం..

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానాల్లో తిరుగుతుండడమే కాకుండా ప్రయాణికులు లేకపోయినా సరే విమాన సర్వీసులు నడపాల్సిందే అంటున్నారు. ఒకవేళ నష్టం వస్తే ప్రభుత్వమే భరిస్తుందని చెబుతున్నారు. ఈ విధంగా విజయవాడ-కడప, విజయవాడ-తిరుపతి మధ్య విమాన సర్వీసులు నడిపినందుకు గాను కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తనయుడు, టాలీవుడ్‌ నటుడు రామ్‌చరణ్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌గా ఉన్న ట్రూ జెట్‌కు చెందిన టర్బో మెఘా ఎయిర్‌వేస్‌కు రూ.4.90 కోట్లు మంజూరు చేశారు. డిమాండ్‌ లేని చోట విమాన సర్వీసులు నడిపితే వచ్చే నష్టాన్ని భరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌(వీజీఎఫ్‌) పథకాన్ని ప్రకటించింది.ఈ పథకం కింద విజయవాడ-తిరుపతి, విజయవాడ-కడపలకు విమాన సర్వీసులు నడపడానికి ట్రూ జెట్‌ టెండర్లు దక్కించుకుంది. విజయవాడ నుంచి ఈ రెండు నగరాల మధ్య వారానికి నాలుగు రోజులు ప్రయాణీకులు ఉన్నా, లేకపోయినా రానుపోను సర్వీసులు తప్పనిసరిగా నడపాల్సి ఉంటుంది. 72 సీట్ల సామర్థ్యం ఉన్న ఏటీఆర్‌-72 విమానాలను ఈ మార్గాల్లో ట్రూ జెట్‌ నడుపుతోంది. దీనివల్ల జరిగే నష్టాన్ని భరిస్తున్నందుకు ప్రతి సర్వీసులో 5 సీట్లను ట్రూ జెట్‌ సంస్థ ప్రభుత్వానికి కేటాయించాల్సి ఉంటుంది. ఇలా ఏడాది కాలానికి 672 సర్వీసులు నడిపినందుకు గాను ట్రూ జెట్‌కు రూ.9.76 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో భాగంగా ఆరు నెలలకు రూ.4.90 కోట్లు చెల్లిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com