మోసుల్ నుంచి ఉగ్రవాద శిబిరాలను సిరియాకు మార్పు
- October 29, 2016
ఇరాక్‌లోని మోసుల్ నగరం రణరంగంగా మారింది. రెండేండ్లుగా ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఇరాక్ భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌కు అమెరికా సంకీర్ణదళాలు మద్దతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుతున్నాయి. ఇప్పటికే కీలక ఐఎస్ నేతలు హతమయ్యారు. దీంతో, ఐఎస్ ఆత్మరక్షణలో పడింది.మోసుల్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను సిరియాకు తరలించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ తరలింపునకు అమెరికా సహకరిస్తోందని సిరియా అధ్యక్షుడు అస్సద్ వ్యక్తిగత సలహాదారు డాక్టర్ బౌథైనా షాబాన్ తెలిపారు. శనివారం రష్యా టుడే మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. ' ఉగ్రవాదుల చొరబాటుతో దేశ సార్వభౌమత్వం దెబ్బతినే ప్రమాదముంది.
అమెరికా ఇలాంటి చౌకబారు నిర్ణయాలు తీసుకుంటే సహించే ప్రసక్తి లేదు. ఐఎస్ మోసుల్‌లో మారణహోమాన్ని సృష్టిస్తోంది. ఈ నరమేధంలో వేలాది మంది పౌరులు మృతి చెందారు. ఇలాంటి ఘాతుకాలు సిరియాలోనూ పునరావృతం కావాలని అమెరికా కుట్రపన్నింది. ఇది ముమ్మాటికి అనైతిక చర్య.' అని అన్నారు. ఉగ్రవాదంపై పోరాడుతున్నట్టు పాశ్చాత్య దేశాలు ప్రకటించుకోవడం తనను విస్మయానికి గురిచేస్తోందని చెప్పారు. ఐఎస్ ఏరివేత సమయం ఆసన్నమైనప్పుడల్లా మాట మారుస్తు న్నాయన్నారు. ఉగ్రవాదులను తిరుగుబాటుదారులుగా గుర్తిస్తూ వారందరినీ ప్రత్యేక ఆపరేషన్ నుంచి మినహాయిస్తు న్నాయని అన్నారు. దీంతో, ఉగ్రవాదం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరిస్తోందన్నారు. ప్రపంచ దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగాలన్నదే అమెరికా ధ్యేయమని ఉద్ఘాటించారు.
ఉగ్రవాద సంస్థలకు ఆయుధాల సరఫరా
పాశ్చాత్య దేశాలు ఉగ్రవాద సంస్థలకు ఆయుధాల సరఫరాతో పాటు ఆర్థికంగా సహకరిస్తున్నాయని డాక్టర్ బౌథైనా షాబాన్ తెలిపారు. తిరుగుబాటుదారులందరూ తమ దృష్టిలో ఉగ్రవాదులతో సమానమేనని అన్నారు. సిరియాలో తిరుగుబాటుదారు సంస్థలనేవి లేవని వెల్లడించారు. పాశ్చాత్య దేశాలు తిరుగుబాటుదారు సంస్థలుగా గుర్తించిన సంస్థలన్నీ సిరియాలో మారణహోమం సృష్టిస్తున్న సంస్థలేనని చెప్పారు. అయితే, తిరుగుబాటుదారు సంస్థలకు మాత్రమే ఆయుధాలు సరఫరా చేసినట్టు పాశ్చాత్య దేశాలు బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. పాశ్చాత్య దేశాలు తయారుచేస్తున్న అత్యాధునిక ఆయుధాలను ఐఎస్ ఉపయోగిస్తోందన్నారు. వాటిని సిరియాలో ప్రయోగించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మానవాళి మనుగడకు ప్రమాదకరమన్నారు.
ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న పాశ్చాత్య మీడియా సంస్థలు
సిరియాలో పెట్రేగిపోయిన ఉగ్రవాదాన్ని నిర్మూలిం చేందుకు సిరియా, రష్యా బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని డాక్టర్ బౌథైనా షాబాన్ తెలిపారు. అయితే, తాము నిర్వహిస్తున్న ఈ బృహత్కార్యాన్ని పాశ్చాత్య మీడియా సంస్థలు వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. సిరియాలో 2011లో అంత ర్యుద్ధం ప్రారంభమైంది. పౌర యుద్ధం కారణంగా నాలుగు లక్షల మంది మృతిచెందారు. అయితే, అధ్యక్ష పీఠం నుంచి అస్సద్‌ను తప్పించేందుకు అమెరికా కుట్ర పన్నింది. దీనికి పాశ్చాత్య మీడియా సంస్థలు సహకరించడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మీడియా సంస్థలు నిజానిజాలను తెలుసుకుని వార్తలు ప్రచురించాలని కోరారు. సిరియాలో చోటుచేసుకున్న పరిస్థితులపై పరిశోధనాత్మక కథనాలు రాస్తున్న పాశ్చాత్య జర్నలిస్టులు ఎంత మంది అని ప్రశ్నించారు. కార్పోరేట్ మీడియా సంస్థలు ఇన్‌వెస్టిగేటివ్ జర్నలిజంపై దృష్టి సారించాలని సూచించారు. అమెరికా సంకీర్ణదళాలు యుద్ధనేరాలకు పాల్పడుతున్నాయని అన్నారు. ఈనెల 26న ఇద్లిబ్‌లోని ఓ పాఠశాలపై వైమానిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 22 మంది చిన్నారులు, ఆరుగురు ఉపాధ్యాయులు మృతి చెందారు. రష్యా, సిరియా భద్రతా బలగాలే ఈ దాడికి పాల్పడ్డాయని అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించేందుకు అమెరికా సంకీర్ణదళాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఈ దాడితో రష్యా, సిరియా బలగాలకు సంబంధం లేదన్నారు. ఉగ్రవాద నిర్మూలనలో అమెరికా సంకీర్ణదళాలు విఫలమయ్యాయని అన్నారు.
ఉగ్రవాదంపై పోరు కొనసాగిస్తాం
ఉగ్రవాదంపై పోరు కొనసాగిస్తామని డాక్టర్ బౌథైనా షాబాన్ చెప్పారు. సిరియా, ఇరాన్, రష్యా దేశాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో ఇతర దేశాలను కూడా పాల్గొనమని కోరుతున్నామని అన్నారు. భారత్, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా, అల్జీరియా, తునీసియా దేశాలు కూడా మున్ముందు ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించడం ఖాయమన్నారు. అయితే, ఉగ్రవాద నిర్మూలనలో చైనా అనుసరి స్తున్న విధానాలు భేష్ అని కితాబిచ్చారు. సిరియాలో శాంతి స్థాపన కోసం రష్యా, అమెరికా దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలు కావడం లేదన్నారు. దీనికి అమెరికా అనుసరిస్తున్న విధానాలే ప్రధాన కారణమన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









