గోవాలో సరికొత్త అంతర్జాతీయ విమానాశ్రయం....
- November 08, 2016
గోవాలో సరికొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించి, నిర్వహించే కాంట్రాక్టును జిఎంఆర్ ఇన్ఫ్రా అనుబంధ సంస్థ జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ దక్కించుకుంది. దేశంలో ఇప్పటికే ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాలు జిఎంఆర్ నిర్వహణలోనే ఉన్న విషయం తెలిసిందే.
నార్త్ గోవాలోని మోపాలో కొత్త విమానాశ్రయం నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన ఒప్పందంపై గోవా ప్రభుత్వం, జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం కింద కొత్త ఎయిర్పోర్ట్ డిజైన్, నిర్మాణం, ఆర్థిక వనరుల సమీకరణ బాధ్యత జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్పై ఉంటుంది. నిర్మాణ పనులన్నీ పూర్తయిన తర్వా త 40 ఏళ్ల పాటు ఈ ఎయిర్‌పోర్ట్‌ను జిఎంఆర్ నిర్వహిస్తుంది. ఈ కన్సెషన్ పీరియడ్‌ను మరో 20 ఏళ్లు పొడిగించే వెసులుబాటు కూడా కాంట్రాక్టులో ఉంది. గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత పర్సేకర్ సమక్షంలో జిఎంఆర్ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సిఇఒ ఆర్వి శేషన్, గోవా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్కె శ్రీవాస్తవ సంతకాలు చేశారు. నిధుల సమీకరణ పూర్తయిన నాటి నుంచి మూడేళ్లలో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తిచేస్తారు. 2019-20 నాటికి తొలి దశ అందుబాటులోకి వస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ''నార్త్ గోవాలో చేపట్టిన కొత్త ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును దక్కించుకోవడం జిఎంఆర్ గర్వకారణంగా భావిస్తోంది. ఈ కొత్త ఎయిర్‌పోర్టు ప్రారంభమైన తర్వాత అనేక రికార్డులు సృష్టిస్తుందన్న విశ్వాసం ఉంది. '' అని జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ బొమ్మిడాల శ్రీనివాస్ అన్నారు. దేశ, విదేశాల్లో పలు ప్రతిష్ఠాత్మకమైన ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులను చేపట్టి దిగ్విజయంగా నిర్మించి, నిర్వహిస్తున్న ఘనత తమ సంస్థకు ఉందని ఆయన చెప్పారు. గడువు ప్రకారం ప్రాజెక్టు పనులను పూర్తిచేయడంలోనూ తమకు ట్రాక్ రికార్డు ఉందని ఆయన అన్నారు. మోపా ఎయిర్‌పోర్టు కూడా గడువులోగా పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌ను 18 నెలల్లో, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రతిష్టాత్మకమైన టెర్మినల్ 3ని 37 నెలల్లో జిఎంఆర్ పూర్తి చేసిన విషయం ఆయన గుర్తుచేశారు. గోవాలో ఇది రెండో విమానాశ్రయం. ఇప్పటికే దబోలిమ్ ఎయిర్పోర్ట్ గోవాలో ఉంది. కొత్త ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు లాభదాయకతపై సందేహాలు అనవసరమని శ్రీనివాస్ అన్నారు. ఎయిర్‌ట్రాఫిక్ పెరిగితే విమానాశ్రయం లాభాల్లోకి వెళ్తుందని పేర్కొన్నారు. గోవాలో ఇప్పటికే ఉన్న విమానాశ్రయం సామర్ధ్యాన్ని మించి ఎయిర్‌ట్రాఫిక్ పెరుగుతోంది. దేశంలో ఎయిర్ట్రాఫిక్లో 16-18 శాతం వృద్ధి ఉన్నట్టు శ్రీనివాస్ వెల్లడించారు. మోపా ప్రాజెక్టును కొద్దిమంది వ్యతిరేకించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయనీ, వాణిజ్యం విస్తరిస్తుందని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వేగవంతం కావడానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. కొత్త ఎయిర్‌పోర్టును జిఎంఆర్ హైబ్రిడ్ టిల్ మోడల్లో నిర్వహించనుంది.
అంతర్జాతీయ బిడ్డింగ్‌లో పాల్గొని గతేడాది ఆగస్టులో మోపా ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును జిఎంఆర్ గెల్చుకుంది. ఈ బిడ్డింగ్‌లో జిఎంఆర్ తర్వాత ఎయిర్‌పోర్ట్స్ అథార్టీ ఆఫ్ ఇండియా, ఎస్సెల్ ఇన్ఫ్రా గ్రూప్ ఉన్నాయి. ప్రస్తుత ప్రాజెక్టులో భాగంగా కమర్షియల్‌గా డెవలప్ చేసుకునేందుకు 232 ఎకరాలను ప్రభుత్వం జిఎంఆర్‌కు కేటాయిస్తుంది. ఎయిర్‌పోర్ట్‌లో నగరం దిశగా ఉండే ఈ స్థలాన్ని 60 ఏళ్లపాటు జిఎంఆర్ నియంత్రణలోనే ఉంటుంది. హైదరాబాద్‌లో సరికొత్త ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించి నిర్వహిస్తోన్న జిఎంఆర్ గ్రూప్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌తో పాటు విదేశాల్లో కూడా ఎయిర్‌పోర్ట్‌ల నిర్వహణ వ్యాపారంలో ఉంది. మెగావైడ్ కన్స్ట్రక్షన్ భాగస్వామ్యంలో ఫిలిఫ్పీన్స్‌లో మక్టన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను డెవల్‌ప చేస్తోంది. ఇటీవలనే గ్రీస్‌లోనూ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును చేజిక్కించుకునేందుకు బిడ్స్ దాఖలు చేసింది.
విశేషాలు...
డిబిఎఫ్ఒటి మోడల్లో మోపా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టును నిర్మిస్తారు. 40 ఏళ్ల కన్సెషన్ పీరియడ్‌తో పాటు మరో 20 ఏళ్ల పొడిగింపు వెసులుబాటు ఉంది. ఈ విమానాశ్రయం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 3,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా2017-18 ఆరంభంలోనే ప్రాజెక్టు ఫైనాన్షియల్ క్లోజర్ అంటే నిధుల సమీకరణ ఏర్పాట్ల పూర్తి ఉంటుంది.నిధుల సమీకరణ ఏర్పాట్ల పూర్తి తర్వాత మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తారు.30 శాతం క్రాస్ సబ్సిడీతో హైబ్రిడ్ టిల్ మోడల్లో ఈ విమానాశ్రయాన్ని జిఎంఆర్ నిర్వహిస్తుంది. ఈ మోడల్లో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్స్ (ఐఆర్ఆర్)ను లెక్కించేందుకు, విమానాల ల్యాండింగ్, పార్కింగ్, గ్రౌండ్ హ్యాండ్లింగ్‌తో సహా అన్ని రకాల ఏరోనాటికల్ రెవెన్యూను 100 శాతం పరిగణనలోకి తీసుకుంటారు. నాన్ ఏరోనాటికల్ రెవెన్యూ.. అంటే హోటల్స్, రెస్టారెంట్స్, దుకాణాలు, కార్ల పార్కింగ్, ప్రకటనలు.. వగైరా వ్యాపారాల నుంచి వచ్చే రాబడుల్లో మాత్రం కేవలం 30 శాతాన్ని మాత్రమే ఐఆర్ఆర్ లెక్కింపు కోసం తీసుకుంటారు. ఇది ఎయిర్‌పోర్ట్‌ను మేనేజ్ చేసే సంస్థలకు లాభదాయకం.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







