మూడు సినిమాలు విజయపథంలో దూసుకెళ్తున్నాయి...

- December 03, 2016 , by Maagulf
మూడు సినిమాలు  విజయపథంలో దూసుకెళ్తున్నాయి...

ఏక కాలంలో పలు సినిమాలు విడుదలవ్వడం ఓ విశేషమైతే, ఆ సినిమాలన్నింటికీ విశేష ప్రేక్షకాదరణ లభించడం ఓ విశేషం. ఇటీవల 'రెమో', 'భేతాళుడు', 'మన్యంపులి' చిత్రాలు విడుదలయ్యాయి. ఈ మూడు సినిమాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవ్వడంతో విజయపథంలో దూసుకెళ్తున్నాయి. యాదృచ్ఛికమైనప్పటికీ ఈ మూడు చిత్రాలకు సంబంధించి సక్సెస్‌మీట్‌లు జరిగాయి. వాటి వివరాలు.. 
రెమో 
శివకార్తీకేయన్‌, కీర్తి సురేష్‌ జంటగా తమిళంలో రూపొందిన 'రెమో' చిత్రాన్ని ఆర్‌.డి.రాజా సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు అదే పేరుతో తెలుగులో విడుదల చేశారు.

ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ, 'శివకార్తీకేయన్‌ వేసిన లేడీ గెటప్‌ చాలా బాగుందని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్‌ అవుతుందని ముందే చెప్పాను. ఇప్పుడదే జరిగింది. గతంలో తమిళంలో రూపొందిన 'వైశాలి' సినిమాను తెలుగులో రిలీజ్‌ చేశాను. అది హిట్‌ అయ్యింది. మణిరత్నం 'ఓకే బంగారం' సినిమాను తెలుగులో విడుదల చేస్తే అది కూడా పెద్ద హిట్‌ అయ్యింది. అదే నమ్మకంతో తాజాగా ఈ చిత్రాన్ని విడుదల చేశా. ఈ చిత్ర ఫలితం నా నమ్మకాన్ని నిలబెట్టింది. శివకార్తీకేయన్‌ నటనకు తమిళంలో ఎంత మంచి స్పందన వచ్చిందో తెలుగులో కూడా అంతే రెస్పాన్స్‌ రావడం ఆనందంగా ఉంది. ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని అన్నారు. 'టీజర్‌, పాటలు బాగున్నాయని మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసించారు. సినిమా కూడా చూస్తానని చెప్పారు. ఆయనకు కృతజ్ఞతలు. థియేటర్‌లో ఆడియెన్స్‌ మధ్య సినిమా చూశా. ప్రేక్షకులు సినిమాను చాలా బాగా ఎంజారు చేస్తున్నారు. తెలుగులో నాకిది మంచి డెబ్యూ చిత్రమవుతుంది. సినిమాను, నన్ను తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్‌ చేశారు. సినిమా ఇంత పెద్ద హిట్‌ అయినందుకు థ్యాంక్స్‌. దిల్‌రాజు నాకు మంచి ప్లాట్‌ఫామ్‌ ఇచ్చారు. ఈ చిత్ర సక్సెస్‌తో ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నా. తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించే ప్రయత్నం చేస్తాను' అని శివకార్తీకేయన్‌ తెలిపారు. పి.సి.శ్రీరాం చెబుతూ, 'మంచి సినిమాలను ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారు. మంచి కాన్సెప్ట్‌ ఉండటం వల్లే ఈచిత్రం కూడా పెద్ద హిట్‌ అయ్యింది. వచ్చే ఏడాది మూడు తెలుగు సినిమాలకు పనిచేయబోతున్నాను. అందులో దిల్‌రాజు సినిమా ఒకటి ఉంది' అని చెప్పారు. 'సక్సెస్‌ఫుల్‌ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. పి.సి.శ్రీరాం వంటి లెజెండ్రీ సినిమాటోగ్రాఫర్‌తో కలిసి ఈ సినిమాకి పనిచేయడం చాలా గొప్ప విషయం. దర్శకుడు భాగ్యరాజ్‌ కన్నన్‌ చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా డీల్‌ చేశారు. శివకార్తీకేయన్‌తో నటించడం చాలా హ్యాపీగా ఉంది' అని కీర్తి సురేష్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగ్యరాజ్‌ కన్నన్‌, అనిరుథ్‌, రాజేష్‌, శ్రీమణి, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. 
భేతాళుడు 
విజరు ఆంటోని, అరుంధతి నాయర్‌ జంటగా ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రాన్ని నిర్మాతలు కె.రోహిత్‌, ఎస్‌.వేణుగోపాల్‌ సంయుక్తంగా తెలుగులో 'భేతాళుడు' పేరుతో విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోందని చెబుతున్నారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విజరు ఆంటోని మాట్లాడుతూ, 'తెలుగు, తమిళంలో ఏకకాలంలో 1300 థియేటర్లలో విడుదల చేశాం. రెండు చోట్లా స్పందన బాగుంది. ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్‌ వస్తోంది. ఓపెనింగ్స్‌ నా గత చిత్రాలకంటే ఎక్కువగా రావడం ఆనందంగా ఉంది. నేను నటించిన దినేష్‌ పాత్రకు అందరు బాగా కనెక్ట్‌ అవుతున్నారు. ఇకపై నేను చేసే సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా చిత్రీకరిస్తాను. ప్రస్తుతం నటిస్తున్న 'యముడు' చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. దీంతోపాటు భవిష్యత్‌లో 'సలీమ్‌', 'బిచ్చగాడు'కి సీక్వెల్స్‌ ఉంటాయి. ఈ చిత్ర నిర్మాత వేణుగోపాల్‌ నాతో తెలుగు స్ట్రెయిట్‌ సినిమా చేస్తాననటం ఆనందంగా ఉంది. కచ్చితంగా మున్ముందు ఆయనతో కలిసి పనిచేస్తాం. తెలుగు దర్శకులు కూడా నన్ను అప్రోచ్‌ అవుతున్నారు' అని అన్నారు. 'ఈ చిత్రానికి మేం ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తోంది. ఓపెనింగ్స్‌ బాగున్నాయి. తెలుగులో విడుదల రైట్స్‌ నాకు రావడానికి సహకరించిన విజరు ఆంటోనికి కృతజ్ఞతలు. విజరు ఆంటోని తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేస్తానంటే నేను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నా' అని నిర్మాత వేణుగోపాల్‌ తెలిపారు. దర్శకుడు ప్రదీప్‌ చెబుతూ, 'సినిమా ఫస్టాఫ్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా, ద్వితీయార్థం యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో సాగుతుంది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని తెలిపారు. భాషాశ్రీ మాట్లాడుతూ, 'తెలుగు, తమిళంలో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయి. తమిళంలో రెండు రోజుల్లోనే 6కోట్లు కలెక్ట్‌ చేసింది' అని చెప్పారు. 'ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది' అని అరుంధతి నాయర్‌ చెప్పారు.
మన్యంపులి 
మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రాన్ని శ్రీసరస్వతి ఫిల్మ్స్‌ పతాకంపై సింధూరపువ్వు కృష్ణారెడ్డి తెలుగులో 'మన్యంపులి'గా విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్‌ స్పందన వస్తోన్న నేపథ్యంలో శనివారం సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. 
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'మలయాళంలో ఇటీవల విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించింది. తాజాగా శుక్రవారం తెలుగులో విడుదలై మంచి ఓపెనింగ్స్‌ రాబట్టింది. మాస్‌ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్‌ అవుతోంది. 'బాహుబలి' తర్వాత మంచి సినిమా చూశామని అందరూ చెప్పడం ఆనందంగా ఉంది. మాస్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో మోహన్‌లాల్‌ అదరగొట్టారు. ఈ వయసులో కూడా ఆయన పోరాట సన్నివేశాల్లో నటించిన తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలుగకా మానదు. ఇందులో ప్రేమ, కోపం, కామెడీ.. ఇలా అన్ని రకాల అంశాలున్నాయి. తండ్రిగా, భర్తగా, మన్యంలో ప్రజలకు అండగా నిలిచే పెద్దగా, పులితోనే పోరాడే మరో పులిలా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరో వెంకటేష్‌, సురేష్‌బాబు సినిమా చూసి ప్రశంసించారు. హాలీవుడ్‌ తరహా చిత్రాలు మనం కూడా తీయగలమని ఈ చిత్రం నిరూపించిందని సురేష్‌బాబు చెప్పటం గొప్ప విషయం. గోపీసుందర్‌ మ్యూజిక్‌ సినిమాకు మరో అస్సెట్‌. షాజీ కుమార్‌ కెమెరా పనితనం అద్భుతం. ప్రతి సీన్‌ విజువల్‌ వండర్‌గా చూపించారు. మోహన్‌లాల్‌ రెండు నెలలకు ఓ సినిమా విడుదల చేస్తుంటారు. ఆయన ఎప్పుడూ షూటింగ్‌ల్లో బిజీగా ఉంటారు. ప్రమోషనల్‌లో పాల్గొనరు. కానీ ఈచిత్ర రిజల్ట్‌ గురించి ప్రతి నిమిషం అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడి రెస్పాన్స్‌ చూసి చాలా హ్యాపీగా ఉన్నారు' అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com