'మీలో ఎవరు కోటీశ్వరుడు' సినిమా రివ్యూ

- December 16, 2016 , by Maagulf
'మీలో ఎవరు కోటీశ్వరుడు' సినిమా రివ్యూ

రివ్యూ: 
చిత్రం పేరు: మీలో ఎవరు కోటీశ్వరుడు 
నటీనటులు: నవీన్‌చంద్ర.. శ్రుతి సోథి.. థర్టీ ఇయర్స్‌ పృథ్వీ.. సలోనీ.. మురళీశర్మ.. పోసాని కృష్ణమురళి.. రఘుబాబు.. జయప్రకాష్‌రెడ్డి.. ధన్‌రాజ్‌ తదితరులు 
ఛాయాగ్రహణం: పి.బాల్‌రెడ్డి 
సంగీతం: డి.జె.వసంత్‌ 
నిర్మాత: రాధామోహన్‌ 
దర్శకత్వం: ఇ.సత్తిబాబు 
సంస్థ: శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ 
విడుదల: 16-12-2016
కా మెడీ చిత్రాల్ని బాగా తీయగల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు ఇ.సత్తిబాబు.

ఈవీవీ స్కూల్‌ నుంచి వచ్చిన ఆయనకి కామెడీలో మంచి ట్రాక్‌ రికార్డే ఉంది. దానికి తోడు పోస్టరుపై 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అంటూ జనాల నోళ్లలో బాగా నానిన పేరు.. పృథ్వీ -సలోనీ జంట నేపథ్యంలో ప్రచారం. థియేటర్‌ వైపు దారి పట్టడానికి ఇంతకంటే ఇంకేం కావాలి? మరి ఆ ఆసక్తి.. అంచనాల స్థాయిలో సినిమా వినోదాన్ని పంచుతుందో లేదో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే?: ప్రశాంత్‌ (నవీన్‌చంద్ర) మంచి మనసున్న కుర్రాడు. అనుకోకుండా ఒక రోజు రాత్రి రోడ్డుపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఏబీర్‌ (మురళీశర్మ) కుమార్తె ప్రియ (శ్రుతి సోథి) ఎదురవుతుంది. మతిస్థిమితం లేని పరిస్థితుల్లో ఉన్న ప్రియని వాళ్ల ఇంటికి తీసుకెళ్లి క్షేమంగా వదిలిపెడతాడు. ఆ తర్వాత ప్రశాంత్‌ గురించి.. అతని మంచి మనసుని గురించి తెలుసుకొన్న ప్రియ ప్రేమలో పడుతుంది. అయితే వాళ్లిద్దరి ప్రేమకి ఏబీఆర్‌ అడ్డు చెబుతాడు. ఒకసారి నష్టపోతే ఆనందం విలువ తెలుస్తుందని.. అది తెలిసినప్పుడు మీరే మా ప్రేమని ఒప్పుకొంటారని ఏబీఆర్‌తో ప్రశాంత్‌ చెబుతాడు. ఆ మాటని సవాల్‌గా తీసుకొన్న ఏబీఆర్‌.. నష్టపోవడం కోసమే ఓ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటాడు.
కచ్చితంగా నష్టాన్ని తెప్పించే వ్యాపారం గురించి ఐడియా ఇస్తే కోటి రూపాయలు అని ప్రకటన కూడా ఇస్తాడు. మరా ఐడియా ఎవరిచ్చారు? వ్యాపారంలో ఆరితేరిన ఏబీఆర్‌కి నష్టం వచ్చిందా? ప్రశాంత్‌.. ప్రియల ప్రేమ కోసం వేరియేషన్‌ స్టార్‌ వీరబాబు (పృథ్వీ).. సమంత (సలోనీ)లు ఏం చేశారు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?: నవ్వించడమే లక్ష్యంగా తెరకెక్కించిన చిత్రమిది. ఒక సాదాసీదా కథకి తెలివిగా వినోదపు పూత పూశారు. ఒక సినిమా చూడ్డానికి వెళితే తెరపై రెండు సినిమాలు కనిపిస్తాయి. కాకపోతే అసలు సినిమా కంటే కొసరు సినిమా ఎక్కువసేపు సాగడమే కాస్త ఇబ్బంది. కానీ.. ఆ సన్నివేశాల్లోనూ థర్టీ ఇయర్స్‌ పృథ్వీలాంటి హాస్యనటుడు కనిపించడంతో సినిమా బండి సరదాగానే సాగిపోతుంది. ప్రశాంత్‌.. ప్రియల ప్రేమకి అవాంతరం ఎదురైన క్రమంలోనే కథ వూపందుకొంటుంది. అప్పటిదాకా సినిమా అంతా చప్పగానే అనిపిస్తుంది.
ప్రేమకథలో మలుపు చోటు చేసుకోవడం.. నష్టం వచ్చే వ్యాపారం అంటూ ఐడియా కోరిన ఏబీఆర్‌కి దివాళా తీసిన నిర్మాత (పోసాని).. దర్శకుడు రోల్డ్‌గోల్డ్‌ రమేష్‌ (రఘుబాబు) తోడు కావటంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. అదే సమయంలో నవ్వులూ పండుతాయి. ఆ దర్శకనిర్మాతలిద్దరికీ జూనియర్‌ ఆర్టిస్ట్‌ వేరియేషన్‌ వీరబాబు (థర్టీ ఇయర్స్‌ పృథ్వీ) తోడయ్యాక కథ మరింత వేగం అందుకొంటుంది. కానీ మలి సగభాగంలో మొదలయ్యే వేరియషన్‌ స్టార్‌ వీరబాబు సినిమా అసలు కథని మరుగున పడేస్తుంది.
విరామానికి ముందు సన్నివేశాలు సినిమాకి కీలకం. వీరబాబు తనలోని వేరియేషన్లని చూపించే సన్నివేశాలు 'దూకుడు' సినిమాలోని ఎమ్మెస్‌ నారాయణని గుర్తు చేస్తాయి. అదే వూపుతో ద్వితీయార్థం సినిమా సాగుంటే బాగుండేది. కానీ పృథ్వీ.. సలోనీల మధ్య ఓ సీరియస్‌ ప్రేమకథని తెరకెక్కించి.. దాన్ని మలిభాగం మొత్తం చూపించారు. దాంతో అసలు నాయికానాయకులు పతాక సన్నివేశాల్లోనే కనిపించాల్సిన పరిస్థితి. తెరపై చూపించిన రెండో సినిమా అసలు సినిమాని పక్కదారి పట్టేలా చేసింది. ముక్కలు ముక్కలుగా అక్కడక్కడ పండే కామెడీ కాసిన్ని నవ్వులు తెప్పిస్తుంది.
 
ఎవరెలా చేశారంటే?: ఈ సినిమాకి కథానాయకుడు నవీన్‌చంద్రే అయినా, తెరపై మాత్రం పృథ్వీదే సందడంతా. ఇంటర్‌ చదివే మహేష్‌గా.. వేరియేషన్‌ స్టార్‌ వీరబాబుగా పృథ్వీ రెండు కోణాల్ని చూపించాడు. ఆయన నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి.
నవీన్‌ చంద్రతో పాటు.. కథానాయిక శ్రుతిసోథి పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. అయితే.. కనిపించిన కొన్ని సన్నివేశాల్లోనైనా శ్రుతి అందంతో ఆకట్టుకొంది. పోసాని కృష్ణమురళి.. ప్రభాస్‌ శ్రీను.. రఘుబాబు.. జయప్రకాష్‌రెడ్డి తదితరులు నవ్వులు పండించే ప్రయత్నం చేశారు. బాల్‌రెడ్డి కెమెరా పనితనం.. వసంత్‌ సంగీతం పర్లేదు. రఘు బాబు.. సలోనీలపై వచ్చే 'నువ్వు నేను ఇంటరూ..' పాట.. చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఇ.సత్తిబాబు కొన్ని సన్నివేశాల్లో తన మార్క్‌ని చూపించారు.
బలాలు 
+ కామెడీ 
+ పృథ్వీ.. పోసాని గ్యాంగ్‌ నటన 
+ విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు 
+ మాటలు
బలహీనతలు 
- నాయికానాయకుల పాత్రలు 
ద్వితీయార్థం 
చివరిగా.. కాలక్షేపం కోసం 'మీలో ఎవరు కోటీశ్వరుడు' 
ఈ సినిమా కి మాగల్ఫ్ వారి రేటింగ్: 2.75/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com