కొత్త క్షమాభిక్ష పథకం అమల్లోకి

- December 16, 2016 , by Maagulf
కొత్త క్షమాభిక్ష పథకం అమల్లోకి

నల్లధనం వివరాల వెల్లడికి ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చింది. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేవై) కింద మార్చి 31 వరకు వీటి సమాచారాన్ని బహిర్గతపరచవచ్చు. ఇప్పటికే బ్యాంకులో జమ చేసిన రద్దయిన నోట్ల సమాచారాన్ని తెలిపి, 50 శాతం పన్ను చెల్లిస్తే సచ్ఛీలురుగా బయటపడవచ్చు. అలాంటి వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. విచారణలు ఎదుర్కోకుండా రక్షణ కూడా ఉంటుంది. పీఎంజీకేవై కింద అమలు చేయనున్న ఈ కొత్త పన్ను ఎగవేత క్షమాభిక్ష పథకం శనివారం నుంచి అమల్లోకి రానుంది.
 కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్‌ అధియా శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ పథకం వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ సొమ్ము వివరాలను బహిర్గత పరచకుండా ఆదాయపన్ను రిటర్నుల్లో చూపిస్తే 77.25 శాతం పన్నుతో పాటు, జరిమానా కూడా విధిస్తారని తెలిపారు. ఇప్పుడు బహిర్గత పరచకుండా, ఆదాయపన్ను రిటర్నుల్లో కూడా చూపించకుండా ఉంటే మరో 10 శాతం పన్నుతో పాటు, విచారణను ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. బ్యాంకులో జమ చేసినంత మాత్రాన నల్లధనం చట్టబద్ధం కాబోదని, పన్నులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

పథకం అమలు ఇలా..
* పీఎంజీకేవై కింద ఆదాయం వెల్లడించేందుకు శనివారం నుంచి బ్యాంకుల్లో చలాన్లు అందుబాటులో ఉంటాయి.
* ముందుగా 50 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. (ఇందులో పన్ను 30 శాతం, పన్నుపై సర్‌ఛార్జి 33 శాతం, జరిమానా 10 శాతం ఉంటుంది.)
* మరో 25 శాతాన్ని వడ్డీ లేకుండా బ్యాంకులో నిల్వ చేయాల్సి ఉంటుంది.
* పన్ను చెల్లించినట్టు రసీదు చూపిస్తేనే ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హత సాధిస్తారు.
* ఈ వివరాలన్నీ రహస్యంగా ఉంటాయి. ఆదాయ పన్ను రిటర్నుల్లోనూ ఈ నగదు వివరాలను పేర్కొనవలసిన అవసరం లేదు.
* దీనిని సంబంధిత వ్యక్తి ఏ సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయంలోనూ భాగంగా చూపబోరు.
* సెంట్రల్‌ ఎక్సయిజ్‌, సంపద, కంపెనీల చట్టాల కింద సాక్ష్యంగా పరిగణించబోరు.
* ఒక వేళ క్రిమినల్‌ కేసులను ఎదుర్కోవాల్సి వస్తే దాన్ని తప్పించలేరు.
* తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆదాయ పన్ను చట్టంలోని 270ఏ నిబంధన కింద 200 శాతం పన్ను చెల్లించాల్సిన పరిస్థితి వస్తే దాన్ని వర్తింపజేస్తారు.
* రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ డిపాజిట్‌ పథకాని(పీఎంజీకేడీఎస్‌)కి శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) పేర్కొనడం తప్పనిసరి.
* ఒక వేళ పాన్‌ లేకుంటే అందుకోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అక్నాలెడ్జ్‌మెంటు నెంబరును దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది.
* దరఖాస్తుతో పాటు లెక్కలు చూపని ధనంలో 25 శాతానికి తక్కువ కాకుండా నగదు/చెక్కు/డ్రాఫ్టు/ఎలక్ట్రానిక్‌ బదిలీ ద్వారా చెల్లించే రసీదును జత చేయాల్సి ఉంటుంది.
* ఈ లావాదేవీలు నిర్వహించినందుకు బ్యాంకులకు ఎటువంటి కమీషన్‌ చెల్లించరు.

అక్రమార్కుల వివరాలు ఇవ్వండి
అక్రమంగా నగదు చలామణి చేసే వారి వివరాలు తమకు ఇవ్వాలని అధియా కోరారు. వివరాలను [email protected] ద్వారా పంపించాలని కోరారు.

ఇదే చివరి అవకాశం
పన్ను ఎగవేతదార్లకు ఇదే చివరి అవకాశమని టాక్స్‌మాన్‌ డైరెక్టర్‌ రాకేష్‌ భార్గవ తెలిపారు. అక్రమ ధనం ఉన్నట్టు సోదాల్లో తేలితే 83.25 శాతం నుంచి 137.25 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్మన్‌ సుశీల్‌ చంద్ర మాట్లాడుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్లమెంటు గతంలో ఆమోదించిన పన్ను శాసనాల (రెండో సవరణ) చట్టం-2016కు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం రాత్రి ఆమోదించారు. దానికి అనుగుణంగా నూతన ఆదాయ వెల్లడి పథకాన్ని అమలు చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com