మెట్రోపై ఈ ఏడాది వ్యయం రూ.2.902 కోట్లు..

- December 27, 2016 , by Maagulf
మెట్రోపై ఈ ఏడాది వ్యయం రూ.2.902 కోట్లు..

మెట్రోరైలు ఈ ఏడాది ప్రయాణికులకు అందుబాటులోకి రాకపోయినప్పటికీ.. దీర్ఘకాలంలో అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలు పరిష్కారం కావడం చెప్పుకోదగ్గ పరిణామం. చాలా వరకు అడ్డంకులన్నీ తొలగడంతో 2017లో మెట్రో ప్రారంభానికి 2016 సంవత్సరంలో కీలక పనుల్లో ముందడుగు పడింది. మెట్రో ప్రాజెక్ట్‌పై ఈ ఏడాది రూ.2,902 కోట్ల వ్యయం చేశారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌పై నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ మెట్రో రూ.2,742 కోట్లు ఖర్చుచేయగా..

హెచ్‌ఎంఆర్‌ రూ.160 కోట్లు వ్యయం చేసింది. 2012లో ప్రాజెక్ట్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మెట్రో ప్రాజెక్ట్‌పై రూ.14,172 కోట్లు వ్యయంచేశారు. ఇందులో మెట్రో, మాల్స్‌ అభివృద్ధిపై ఎల్‌ అండ్‌ టీ సంస్థ రూ.12,143 కోట్లు ఖర్చు చేయగా.. హెచ్‌ఎంఆర్‌ ఆస్తుల సేకరణ, పరిహారం, ఇతరత్రా వాటికి రూ.2,029 కోట్లు ఖర్చుచేసింది. ఇప్పటివరకు 75 శాతం పనులు పూర్తయ్యాయి.
57 మెట్రో రైళ్ల రాక 
మూడు మార్గాల్లో నడిపే 57 మెట్రోరైళ్లు కొరియా నుంచి నగరానికి చేరుకున్నాయి. ఒక్కో రైల్లో మూడు కోచ్‌లు ఉంటాయి. మొత్తం 171 కోచ్‌లు డిపోలకు చేరుకున్నాయి.
మియాపూర్‌ నుంచి ఎస్‌ఆర్‌నగర్‌ 12 కి.మీ. పూర్తయిన మార్గానికి కమిషనర్‌ ఆఫ్‌ మెట్రోరైలు సెఫ్టీ(సీఎంఆర్‌ఎస్‌) అనుమతి లభించింది.
2016లో కీలక పురోగతి 
ఎన్వీఎస్‌రెడ్డి, ఎండీ, హెచ్‌ఎంఆర్‌ 
మెట్రోకి సంబంధించి ఈ ఏడాది చాలా పనులు పూర్తిచేశాం. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న పలు ఆస్తులను సేకరించడం, క్లిష్టమైన ప్రాంతాల్లో ఎదురైన సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాం. 2017లో మెట్రోరైలు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సీఎం సమీక్ష అనంతరం పనుల్లో వేగం పెంచాం.
కారిడార్‌-1 
మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ మార్గంలో.. 
శ్రీనగర్‌కాలనీ, నాంపల్లి, చాదర్‌ఘాట్‌ వద్ద ఇరుకు మార్గాన్ని విస్తరించి పునాదుల పనులు పూర్తి.
కీలక పనుల్లో.. 
జేబీఎస్‌, పరేడ్‌గ్రౌండ్స్‌, బేగంపేట, ఎంజీబీఎస్‌ వద్ద ఆక్రమణలు తొలగించి ఇంటర్‌ఛేంజ్‌ పనుల్లో వేగం పెంచారు. ్ద చిలకలగూడ పూర్తికాగా.. ఆలుగడ్డబావి, ఓలిఫెంటా, బేగంపేట, లక్డీకాపూల్‌, మలక్‌పేట రైల్‌ ఓవర్‌ బ్రిడ్జీ పనులు ప్రారంభించేందుకు రైల్వే అనుమతి లభించింది.
కారిడార్‌-2 
జేబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా మార్గంలో.. 
బోయిగూడ, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, నారాయణగూడ మార్గంలో స్తంభాల పనులు.
ముషీరాబాద్‌ నుంచి నారాయణగూడ మార్గంలో 1000 ఎంఎం డయా మంచినీటి లైను, 400/600 ఎంఎం డయా మురుగునీటి లైను తరలింపు.
ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, చిక్కడపల్లి, నారాయణగూడ మార్గంలో 150 వరకు స్తంభాలు పూర్తి.
బడీచౌడి, సుల్తాన్‌బజార్‌ ప్రాంతాల్లో పునాదులు, స్తంభాలు.
కారిడార్‌-3 
నాగోల్‌ నుంచి రాయదుర్గం మార్గంలో.. 
సికింద్రాబాద్‌ తూర్పు మెట్రో స్టేషన్‌ కోసం పాండురంగ స్వామి గుడి ముందున్న గుత్తికొండ లాడ్జీ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ద్వారా స్టేషన్‌ పనులు పురోగతి.
200 మీటర్ల పనులు మాత్రమే మిగిలిపోయిన సికింద్రాబాద్‌లోని ఇస్కాన్‌ ఆలయం ఇరువైపులా ఉన్న పద్మహంస సముదాయం, నందకుమార్‌ ఆస్తుల స్వాధీనం.
బేగంపేటలోని కంట్రీక్లబ్‌ ముందున్న ఖాళీ స్థలం, నవాబ్‌ యార్‌ జంగ్‌ ఆస్తులు, లైఫ్‌స్లైల్‌, మేబాజ్‌, వైట్‌హౌజ్‌ ముందున్న ఖాళీ స్థలం, తపాలా కార్యాలయంపై అంతస్తు స్వాధీనంతో ఆర్వోబీ నిర్మాణానికి దారి.
గ్రీన్‌ల్యాండ్స్‌, అమీర్‌పేట మార్గంలో చౌరస్తా వద్ద రహమత్‌ సముదాయం స్వాధీనం.
జూబ్లీహిల్స్‌లోని రోడ్‌నెంబరు5లోని ట్రాన్స్‌ట్రాయ్‌ భవనం, చెక్‌పోస్టు వద్ద రాంరెడ్డి ఆస్తులతో పాటూ పెద్దమ్మగుడి, మాదాపూర్‌, దుర్గం చెరువు స్టేషన్‌ ప్రాంతాల్లో ఆస్తులు.
గ్రీన్‌ల్యాండ్స్‌, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, మధురానగర్‌, కృష్ణానగర్‌ ప్రాంతాల్లో విద్యుత్తు, మురుగునీరు, మంచినీటి పైపులైన్ల తరలింపు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com