హైదరాబాద్‌లో ఎనిమిది కొత్త మాల్స్.....
- January 05, 2017
, by Maagulf
- రిటైల్ స్పేస్‌కు పెరుగుతున్న గిరాకీ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) :కొత్త సంవత్సరం రియల్టీకి ముఖ్యంగా రిటైల్ స్పేస్‌కు గిరాకీ పెరిగే అవకాశం ఉంది. 2017లో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో కొత్తగా 1.1 కోట్ల చదరపు అడుగుల రిటైల్ స్పేస్ అందుబాటులోకి రానుంది. సంస్థాగత ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆసక్తి, ప్రజల్లో ఖర్చు పెట్టే స్తోమత పెరుగుతుండటం వల్ల రియల్ ఎస్టేట్ డెవలపర్స్ భారీ ఎత్తున మాల్స్ నిర్మాణాలను చేపడుతున్నారు. గతేడాది కూడా రిటైల్ స్పేస్‌కు డిమాండ్ చెప్పుకోదగిన స్థాయిలోనే ఉంది. ఎనిమిది ప్రధాన నగరాల్లో కొత్తగా 53 లక్షల చదరపుటడుగుల స్థలం అందుబాటులోకి వచ్చింది.
ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ప్రచురించిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. వాస్తవానికి పెద్ద నోట్ల రద్దు వల్ల వినియోగం తగ్గడం వ్యాపార సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అయితే త్వరలోనే పరిస్థితి మళ్లీ సాధారణ స్థాయికి చేరే అవకాశం ఉందని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ఇండియా ఎండి అన్షుల్ జైన్ తెలిపారు. ప్రధాన నగరాల్లో విరివిగా ఖర్చు చేసేందుకు అనువుగా రాబడులు పెరుగుతుండటంతో రిటైల్ సంస్థలు ఈ నగరాలపై దృష్టిపెట్టాయని ఆయన అన్నారు.
జిఎస్‌టి కూడా అమల్లోకి రానున్నందున అంతర్జాతీయ రిటైల్ దిగ్గజాలు కూడా భారతలో వ్యాపార విస్తరణపై ఆసక్తితో ఉన్నట్టు ఆయన చెప్పారు. రిటైల్ బిజినెస్ విస్తరణలో కనిష్ఠ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఈ ఏడాది కొత్త మాల్స్‌లో అదరగొట్టే అవకాశం ఉంది. 26 లక్షల చదరపు అడుగుల వైశాల్యం ఉన్న మొత్తం ఎనిమిది కొత్త మాల్స్ హైదరాబాద్‌లో ఈ ఏడాది ప్రారంభం కానున్నాయి. ఈ ఎనిమిది మాల్స్‌లో చందానగర్, గచ్చిబౌలి, కొండాపూర్‌తో కూడిన వాయువ్య హైదరాబాద్‌లో మెజార్టీ మాల్స్ రానున్నాయి.
హైదరాబాద్ తర్వాత కొత్త మాల్స్ విస్తరణలో చెన్నై ద్వితీయ స్థానంలో ఉంది. 25 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో కూడిన ఐదు కొత్త మాల్స్ ఈ ఏడాది చెన్నైలో ప్రారంభం కానున్నాయి.