మందులంటూ మాదక ద్రవ్యాలు..

- January 27, 2017 , by Maagulf
మందులంటూ మాదక ద్రవ్యాలు..

దుబాయ్‌ పోలీసుల నిర్బంధంలో పాతబస్తీ యువకుడు హైదరాబాద్‌: పరోపకారం చేయబోయి పాతబస్తీకి చెందిన ఓ యువకుడు హబీబ్‌ మహ్మద్‌ దుబాయ్‌లో జైలు పాలయ్యాడు. కీళ్లనొప్పుల మందులు బంధువులకు తీసుకెళ్లాలంటూ ఇంటికి సమీపంలోఉ న్న వ్యక్తి మందులపెట్టెను ఇచ్చాడు. దుబాయ్‌లో దిగగానే విమానాశ్రయం
అధికారులు మందుల పెట్టెను పరిశీలించగా.. అందులో నిషేధిత మందులు గుర్తించారు. తనకేపాపం తెలీదని సదరు యువకుడు ఎంత ఏడ్చినా పోలీసులు అరెస్ట్‌ చేశారు. మూడునెలల క్రితం జరిగిన ఈఘటన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను బాధిత కుటుంబం అభ్యర్థించడంతో వెలుగులోకి వచ్చింది.
ఉద్యోగంలో చేరకుండానే... పాతబస్తీలోని నర్కీ పూల్‌బాగ్‌లో హబీబ్‌ నివాసముంటున్నాడు. దుబాయ్‌లోని ఓ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దీంతో అక్కడికి వెళ్లేందుకు గత ఏడాది అక్టోబరు 28న శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వీడ్కోలు తెలిపే సమయంలో అల్‌ ఇద్రుస్‌ అనే వ్యక్తి అక్కడి వచ్చాడు. దుబాయ్‌లో ఉంటున్న తన బంధువుకు కీళ్లనొప్పులున్నాయని, లైరికా 150ఎంజీ అనే మాత్రలున్న పెట్టెను తీసుకెళ్లాని కోరగా.. హబీబ్‌ సరేనన్నాడు. దుబాయ్‌ విమానాశ్రయంలో దిగగానే మహ్మద్‌ సామగ్రిని విమానాశ్రయ అధికారులు తనిఖీ చేశారు. దుబాయ్‌లో లైరికా మాత్రలు మాదకద్రవ్యాలతో సమానం . అందుకే వారు వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించగా.. వారు జైల్లో ఉంచారు. సమాచారాన్ని తండ్రి హబీబ్‌ తాహెర్‌, సోదరుడు ఖదీర్‌కు తెలిపారు.
మానవతా దృక్పథంతో సాయం చేయాలంటూ.. హబీబ్‌ జైల్లో ఉన్నాడని తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చాంద్రాయణగుట్ట పోలీసులను సంప్రదించారు.తామేం చేయలేం అంటూ వారు నిస్సహాయత వ్యక్తంచేశారు. మూడునెలలపాటు వివిధ మార్గాల్లో ప్రయత్నించిన వారు అన్నీ విఫలం కావడంతో డీసీపీ సత్యనారాయణ, ఎంబీటీ నేత అమ్జదుల్లాఖాన్‌ను సంప్రదించారు. అమ్జదుల్లాఖాన్‌ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు ట్విట్టర్‌ ద్వారా వివరాలను పంపారు. నిషేధిత మందులను ఎవరు తీసుకెళ్లినా విమానాశ్రయంలోనే అరెస్ట్‌ చేస్తారంటూ ఆమె సమాధానం ఇచ్చారు. హబీబ్‌ వ్యక్తిగత వివరాలను మరోసారి ఆమెకు పంపి అభ్యర్థిస్తానని అమ్జదుల్లాఖాన్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com