ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్‌ టోర్నీలో టీమిండియా...

- February 07, 2017 , by Maagulf
ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్‌ టోర్నీలో టీమిండియా...

హైదరాబాద్: ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్వాలిఫయింగ్‌ టోర్నీలో టీమిండియా శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన గ్రూప్‌ 'ఎ' తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకపై 114 పరుగుల తేడాతో మిథాలీసేన ఘనవిజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 259 పరుగులు చేసింది.
తొమ్మిది పరుగుల వద్ద మోనా మేష్రమ్‌ (6) పెవిలియన్‌కు చేరుకున్నా... రెండో వికెట్‌కు దీప్తి శర్మ, దేవిక వైద్య 123 పరుగులు జోడించి భారత్‌కు చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత దీప్తి అవుటయ్యాక మిథాలీతో కలిసి దేవిక 49 పరుగులు జతచేసింది. సెంచరీ దిశగా సాగుతున్న దశలో ప్రబోధిని బౌలింగ్‌లో దేవిక అవుటైంది.
ఈ దశలో క్రీజులో వచ్చిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. మిథాలీతో కలిసి 3 ఫోర్లతో 20 పరుగులు సాధించి భారత స్కోరును 250 పరుగులు దాటించారు. దేవిక వైద్య(103 బంతుల్లో 89), కెప్టెన్ మిథాలీరాజ్(62 బంతుల్లో 70 నాటౌట్), దీప్తి శర్మ(96 బంతుల్లో 54) అర్ధసెంచరీలు సాధించారు.
అనంతరం భారత్ నిర్దేశించిన 260 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంక 8 వికెట్లకు 145 పరుగులు చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో ఏక్తా బిష్త్, రాజేశ్వరి గైక్వాడ్‌ రెండేసి వికెట్లు తీశారు. శ్రీలంక జట్టులో హాసిని పెరెరా(34), ఓపెనర్ చమరీ ఆటపట్టు(30) మినహా మిగతా అందరూ విఫలమయ్యారు.
కెరీర్‌లో రెండో వన్డే ఆడుతున్న దేవిక తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లతో ఆకట్టుకుని ఉమన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది. శ్రీలంక బౌలర్ ప్రభోధినికి 2 వికెట్లు తీసుకుంది. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో బుధవారం థాయ్‌లాండ్‌తో తలపడుతుంది. ఇతర లీగ్‌ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 63 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై, బంగ్లాదేశ్‌ 118 పరుగుల తేడాతో పాపువా న్యూ గినియాపై, ఐర్లాండ్‌ 119 పరుగుల తేడాతో జింబాబ్వేపై గెలిచాయి.

మ్యాచ్ అనంతరం కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ మాట్లాడుతూ 'విజయంతో టోర్నీని ఆరంభించినందుకు ఆనందంగా ఉంది. మొదట్లో నెమ్మదిగా ఆడినా... దేవిక, దీప్తి భాగస్వామ్యంతో తేరుకున్నాం. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో వేగంగా స్కోరు చేశాం' అని వ్యాఖ్యానించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com