శ్రీనివాస్‌ హత్యను ఖండించిన ట్రంప్‌

- March 01, 2017 , by Maagulf
శ్రీనివాస్‌ హత్యను ఖండించిన ట్రంప్‌

అమెరికన్‌ కాంగ్రెస్‌లో అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం తొలిసారిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా కూచిభొట్ల శ్రీనివాస్‌ హత్యను ట్రంప్‌ ఖండించారు. శ్రీనివాస్‌ మృతిపై అమెరికన్‌ కాంగ్రెస్‌ నిమిషంపాటు మౌనం పాటించి సంతాపం తెలిపింది. విద్వేష దాడులకు అమెరికాలో చోటు లేదని..విద్వేషాలను అందరూ ఖండించాలని ట్రంప్‌ పిలుపునిచ్చారు. ఒబామా హయాంలోనే ఉగ్రవాద దాడులు పెరిగాయని విమర్శించారు. యూదులపై జరుగుతున్న దాడులనూ ట్రంప్‌ ఖండించారు. మాదకద్రవ్య వ్యాపారులను, రౌడీలను నిర్మూలించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

తమ పాలనలో అవినీతికి తావు లేదని, లాబీయింగ్‌పై ఐదేళ్లు నిషేధం విధిస్తామని ట్రంప్‌ తెలిపారు. 'అమెరికా పౌరులకు రక్షణ, ఉద్యోగాల కల్పనే నాకు తొలి ప్రాధాన్యం. నేను ప్రపంచానికి అధ్యక్షుడిని కాదు. అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. అమెరికా శక్తిమంతమైన, స్వేచ్ఛాయుత దేశం' అని ట్రంప్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అమెరికా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఈ నెల రోజుల్లో తన పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్టాక్‌ మార్కెట్లు పుంజుకుంటున్నాయని తెలిపారు. మెక్సికో సరిహద్దులో గోడను నిర్మించి సరిహద్దులను బలోపేతం చేస్తామని, ఇస్లామిక్‌ తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని తెలిపిన ట్రంప్‌.. ప్రపంచాన్ని ముందుండి నడిపేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు.

నిషేధిత జాబితా నుంచి ఇరాక్‌ తొలగింపు 
ట్రంప్‌ ప్రభుత్వం ఇరాక్‌కు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కొత్త వలస విధాన చట్టంలో నిషేధిత దేశాల జాబితా నుంచి ఇరాక్‌ను తొలగించారు. అమెరికా అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. అమెరికా కాంగ్రెస్‌లో వలస విధానం గురించి ప్రసంగించారు. దేశ భద్రతను పెంచడంపై దృష్టిసారిస్తున్నామని, కొత్తవలస విధాన చట్టం సానుకూలంగా ఉంటుందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇస్లామిక్‌ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్‌ , సూడాన్‌ , లిబియా, సోమాలియా, యెమెన్‌ పౌరులు అమెరికాలోకి రాకుండా ట్రంప్‌ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా ట్రంప్‌ ఉత్తర్వులు చెల్లబోవంటూ అమెరికా ఫెడరల్‌ కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. దీంతో ఆయా దేశాలకు చెందినవారికి తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లయింది. ఈ నేపథ్యంలో కొత్త వలస విధాన చట్టం తీసుకురావాలని ట్రంప్‌ నిర్ణయించారు. ఈసారి ఎలాంటి లోపాలూ లేకుండా కొత్త ఇమ్మిగ్రేషన్‌ కార్యనిర్వాహక ఉత్తర్వు తీసుకురానున్నారు. ట్రంప్‌ దీనిపై సంతకం చేయనున్నారు.

మానసిక రోగులకూ తుపాకులు 
అమెరికాలో విదేశీయులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూనే.. మానసిక రోగులు కూడా ఆయుధాలను కొనుక్కొవచ్చనే కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చినట్టు చెప్పారు. బరాక్‌ ఒబామా హయాంలో మానసిక రోగులకు ఆయుధాల అమ్మకాన్ని నిషేధించారు. ఒబామా నిర్ణయాన్ని మార్చాలని హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్, సెనేట్‌లు నిర్ణయం తీసుకున్నాయి. ఇందుకు సంబంధించిన బిల్లు రెండు వారాల క్రితమే ఆమోదం పొందిందని ట్రంప్‌ వెల్లడించారు. ట్రంప్‌ నిర్ణయంతో దాదాపు 75 వేల మంది మానసిక రోగులకు ఆయుధాలు కొనుక్కునే అర్హత కలుగుతుంది. గతంలో వీరి లైసెన్సులను ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా ఒక మానసిక రోగే శ్రీనివాస్‌ను కాల్చి చంపాడు. ఈ ఘటన జరిగి కొద్ది రోజులు కూడా గడవకముందే మానసిక రోగులకు ఆయుధాల కొనుగోలుకు అనుమతి ఇవ్వడం గమనార్హం.

కూచిభొట్ల కుటుంబాన్ని పిలవలేదేం? 
కాంగ్రెస్‌ను ఉద్దేశించి తొలిసారి చేసిన ప్రసంగానికి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శ్రీనివాస్‌ కుటుంబాన్ని ఆహ్వానించకపోవడాన్ని డెమోక్రటిక్‌ పార్టీ సెనేటర్‌ బెర్నీ శాండర్స్‌ తప్పుబట్టారు. 'ఎవరిని హత్యచేసినా అది విషాదమే. హింసలో చనిపోయినవారి చుట్టూ మాత్రమే మన హృదయాలు తిరుగుతుంటాయి' అని శాండర్స్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, తనకు లక్షలాది భారతీయులు స్నేహితులయ్యారని కాల్పుల ఘటనలో గాయపడిన అమెరికావాసి ఇయాన్‌ గ్రిల్లట్‌ చెప్పారు. ఆ సమయంలో నిందితుడిని అడ్డుకోవడం తప్ప తనకు మరో మార్గం కనిపించలేదని చెప్పారు.

ప్రతిభ ఉంటేనే ఆహ్వానం 
కొత్త ఇమిగ్రేషన్‌ విధానంపై ట్రంప్‌ స్పష్టత ఇచ్చారు. ప్రతిభ ఆధారిత ఇమిగ్రేషన్‌ విధానాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే జరిగితే ఇండియాలాంటి ప్రతిభావంతులున్న దేశాలకు లబ్ధి చేకూరనుంది. 'కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ప్రతిభ ఆధారిత ఇమిగ్రేషన్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థ వల్ల ఎన్నో డాలర్ల వ్యయం ఆదా అవుతుంది. ఉద్యోగుల జీతాలూ పెరుగుతాయి' అని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న తక్కువ నైపుణ్యం గల ఇమిగ్రేషన్‌ విధానం నుంచి ప్రతిభ ఆధారిత విధానానికి మారడం తప్పనిసరన్నారు. వలస కుటుంబాలు మధ్యతరగతి వర్గంలోకి వస్తాయని ట్రంప్‌ అన్నారు. అమెరికాకు దక్కాల్సిన లక్షలాది ఉద్యోగాలను తిరిగి తీసుకొస్తానని స్పష్టం చేశారు. అమెరికన్లకు ఉద్యోగాలు, జీతాలు పెంచడమే లక్ష్యంగా ముందుకువెళ్తే ఇమిగ్రేషన్‌ విధానంలో సానుకూల సంస్కరణలు సాధ్యమేనని తాను నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com