భారతీయులకు వీసా కష్టాలు అమెరికాలో
- March 08, 2017
అమెరికాలో భారతీయులకు షాక్ మీద షాక్ తగలుతోంది. ట్రంప్ జమానా మొదలైన తర్వాత వీసా కష్టాలు ఎక్కువయ్యాయి. H1B వీసాలపై ఆంక్షలు మాత్రమే కాదు, ఇప్పుడు H4 వీసాపై ఉద్యోగాలు చేసే వారికీ కష్టాలు తప్పేలా లేవు. సాధారణంగా ఈ వీసా పొందిన వారంతా H1B వీసా పొందిన వారి భార్యలే. వీరు ఉద్యోగం చేయడంపైనా 60 రోజుల పాటు నిషేధం విధించాలంటూ వాషింగ్టన్ డీసీ అప్పీల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ వాదనను కోర్టు అంగీకరిస్తే ఇక భారతీయ మహిళలకూ కష్టాలు తప్పవు.
అమెరికాలో H1B వీసాతో పనిచేస్తున్న వారి భార్యలు H4 వీసాపై అక్కడికి వెళ్లారు. అర్హత గల ఇలాంటి వారికి పనిచేసే హక్కును కల్పించాలనే చిరకాల డిమాండ్ ను గతంలో ఒబామా ప్రభుత్వం ఆమోదించింది. 2015 ఫిబ్రవరిలో ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. అర్హత గలవారు ఉద్యోగాలు చేయవచ్చంటూ హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ద్వారా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో వేలాది మంది భారతీయ మహిళలు పనిచేసే అవకాశం వచ్చింది. సేవ్ జాబ్స్ USA అనే సంస్థ ఈ ఉత్తర్వులను వ్యతిరేకించింది. జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ సంస్థ అభ్యంతరాన్ని కోర్టు తిరస్కరించింది.
ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అదే సంస్థ తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. ఈసారి మాత్రం ఆ సంస్థ వాదనకు అనుకూలంగా తీర్పు రావచ్చని అమెరికాలోని ప్రవాసులు భయపడుతున్నారు. దీనికి ఓ కారణం ఉంది. అమెరికా ప్రస్తుత అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ గతంలో సెనేటర్ గా పనిచేశారు. H4 వీసా ఉన్నవారు ఉద్యోగాలు చేయవచ్చనే ఉత్తర్వుల వల్ల అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతారని గతంలో వ్యాఖ్యానించారు. అయితే గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన రూలింగ్ కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితులు లేవని ఇమ్మిగ్రేషన్ వాయిస్ అనే సంస్థ అధ్యక్షుడు అమన్ కపూర్ అన్నారు. అత్యున్నత అర్హతలు గల మహిళలు అమెరికాలో పనిచేయడం ద్వారా ఆ దేశానికి అదనపు ఆదాయాన్ని, కొత్త ఉద్యోగాలను సృష్టించారనేది ఈ సంస్థ వాదన.
ఒకవేళ H4 వీసా గల వారికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే వేలాది ఉద్యోగాలను కోల్పోవాల్సి ఉంటుంది. అంతేకాదు, స్టార్టప్ కంపెనీలను స్థాపించే ప్రయత్నంలో ఉన్న చాలా మంది కలలు కల్లలవుతాయి. సుదర్శనా సేన్ గుప్తా చాలా కాలంగా అక్కడ రీసెర్చ్ చేస్తున్నారు. క్యాన్సర్ ఇమ్యునో థెరపీ స్ట్రాటజీస్ పై ఓ స్టార్టప్ కంపెనీని ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక తాను ఈ పనిచేయలేనా అని ఆమె ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వాళ్లు చాలా మందికి ఇప్పుడు కంటిమీద కునుకు లేదు. ట్రంప్ రాజ్యంలో ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ వారి జీవితంలో భాగమైంది.
తాజా వార్తలు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్