తగ్గుతున్న బంగారం, వెండి ధరలు పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో
- March 15, 2017
బంగారంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. అమ్మకాలు అంతకంతకు తగ్గుతున్నాయి. డిమాండ్ అమాంతంగా పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా గోల్డ్ దిగుమతులు నలబై శాతం పడిపోయాయి.
ప్రపంచంలో అధిక డిమాండు ఉన్న మెటల్ బంగారం. భారత్‌లో దాని మీద మోజు మరీ ఎక్కువ. గోల్డ్ ధరలు పెరగటమే కాని తగ్గటమన్నది లేదు. అందుకే ఇన్నాళ్లూ గోల్డ్‌ని సురక్షిత పెట్టుబడిగా భావించారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పెద్ద నోట్ల రద్దు దెబ్బకు బంగారం అతలాకుతలమైంది. డిమాండ్ అమాంతంగా పడిపోయింది. దిగుమతులు భారీగా తగ్గాయి. గత డిసెంబర్‌లో 54.1 టన్నుల బంగారం దిగుమతి అయింది. ఐతే జనవరిలో అది 53.2 టన్నులుగా నమోదైంది. అంతకు ముందు పెద్ద నోట్లను రద్దు చేసిన నవంబర్లో ఏకంగా 119.2 టన్నుల బంగారం దిగుమతైంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొన్ని రోజులు బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. చాలా మంది తమ నల్లధనాన్ని గోల్డ్ రూపంలోకి మార్చుకునేందుకు ప్రయత్నించారు. రద్దు చేసిన నోట్లతో భారీ ప్రీమియం చెల్లించి బంగారాన్ని కొనుగోలు చేయడంతోపాటు పెండ్లిళ్ల సీజన్ కావడంతో నవంబర్‌లో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఇక తరువాత బంగారం కొనేవారే లేరు. అమ్మకాలు భారీగా తగ్గాయి. ఫలితంగా గోల్డ్ ఇంపోర్ట్స్ ఘోరంగా పడిపోయాయి. ఏప్రిల్ 2016- జనవరి 2017 కాలానికి 546 టన్నుల గోల్డ్ దిగుమతయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇది 892.9 టన్నులుగా ఉంది. అంటే నలబై శాతం దిగుమతులు పడిపోయాయి.
మరోవైపు, బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. గతవారం బంగారం ధర రెండు నెలల కనిష్టానికి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్ అనూహ్యంగా డిమాండ్ పడిపోవటమే దీనికి ప్రధాన కారణం. అలాగే దేశంలో బంగారం కొనుగోళ్లు బాగా తగ్గటంతో పసిడి ధర 29 వేల కిందకు పడిపోయింది. వెండి ధర కూడా బాగా తగ్గింది. పసిడి ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. వడ్డీరేట్లను పెంచనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వు ఇప్పటికే సంకేతాలిచ్చింది. అదే జరిగితే అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖంపట్టే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం US FEDERAL ReSERVE సమీక్షా సమావేశం మంగళ, బుధవారాల్లో జరగనుంది. వడ్డీరేట్లు పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయిస్తే డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ వస్తుంది. కొంతకాలం పసిడి తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు, చైనాలో గోల్డ్ డిమాండ్ పడిపోవడం కూడా ధరలు పతనానికి కారణమంటున్నారు.
గ్రాఫిక్స్‌ప్రపంచంలో అధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశం భారత్. ఐతే ప్రస్తుతం బంగారం డిమాండ్ తగ్గటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది తాత్కాలికమేనా? ఏడాదికాలంగా పసిడి డిమాండ్ తగ్గుతూ వస్తున్నా భవిష్యత్‌లో తిరిగి రికవరీ అవుతుందా?
భారత్‌లో బంగారం డిమాండ్ పెరగటమే కాని తగ్గటమన్నది ఉండదు. ఐతే ఇప్పుడు పరిస్థితి దానికి భిన్నం. త్వరలోనే అంతా సర్దుకుంటుందంటున్నారు నిపుణులు. ఈ ఏడాది బంగారం దిగుమతులు 650 టన్నుల నుంచి 750 టన్నుల వరకు ఉండొచ్చు. మరో మూడేళ్లలో దేశంలో బంగారం డిమాండ్ 950 టన్నులకు చేరుతుందని అంచనా. ఆర్థికవృద్ధి, బులియన్‌మార్కెట్లో పారదర్శకతతో గోల్డ్‌కు డిమాండ్ పెరుగుతుందంటున్నారు. అంతేకాదు.. భారతీయ సమాజంలో బంగారం పట్ల ఉన్న ఆకర్షణ కూడా దానికి కలిసొస్తోంది. మనదేశంలో కరెన్సీ నోట్ల కన్నా పసిడి మీదే ప్రజలకు నమ్మకం ఎక్కువ. దగ్గర ఏమాత్రం డబ్బులున్నా వారి ఫస్ట్ చాయిస్ బంగారం కొనిపెట్టుకోవటం. మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించక ముందు జనం దగ్గర ఉన్న సేవింగ్ ఆప్షన్ కూడా బంగారం కొనుగోలే. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. గత 50 ఏళ్లలో పసిడి ధర భారత్‌లో 350 రెట్లు పెరిగింది. మనదేశంలో గోల్డ్ డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తిలేదు. వినియోగం 750 నుంచి వెయ్యి టన్నులు. ఉత్పత్తి మాత్రం ఐదారు టన్నులు మించదు. అందుకే భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. బంగారం సరఫరాలో ఏ మాత్రం అడ్డంకులు ఏర్పడినా పసిడి ధర పైపైకి పోతుంది.
పసిడి ధర నిర్ణయంలో డాలర్, రూపాయి మారకం రేటు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. బంగారం దిగుమతులకు అవసరమైన నగదును డాలర్ల రూపంలో చెల్లించాలి. ఒక డాలర్‌కు 67గా ఉన్న రూపాయి మారకం విలువ 68కి క్షీణిస్తే మనం దిగుమతి చేసుకునే బంగారం ధర మరింత పెరుగుతుంది. అంతేకాదు ద్రవ్యోల్బణానికి - బంగారం ధరకు కూడా సంబంధం ఉంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గుతుంది. మదుపరులు తమ పెట్టుబడుల విలువ కాపాడుకునేందుకు పసిడిని కొనుగోలు చేస్తుంటారు. ఈ కొనుగోళ్లు కూడా పసడి ధరను పెంచుతుంటాయి. ఏదేమైనా ఒక్కటి మాత్రం ..బంగారం డిమాండ్ భారత్‌లో ఎవర్‌గ్రీన్ అన్నది మాత్రం సత్యం!
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్‌లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







