ఆడవాళ్లకు సువర్ణ అవకాశం పెళ్లైనా పాత ఇంటి పేరే

- April 13, 2017 , by Maagulf
ఆడవాళ్లకు సువర్ణ అవకాశం పెళ్లైనా పాత ఇంటి పేరే

పాస్‌పోర్ట్‌లో మార్చుకోవాల్సిన అవసరం లేదు: మోదీ
పెళ్లైన అనంతరం మహిళలు పాస్‌పోర్టుల్లో తమ ఇంటి పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని, ప్రయాణ పత్రాలు పొందేందుకు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి పేరును వాడుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నిబంధనలు మారాయని... ఇక నుంచి పాస్‌పోర్టు పొందేందుకు మహిళలు వివాహ ధ్రువీకరణ లేక విడాకుల పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ‘ఇండియన్‌ మర్చంట్స్‌ చాంబర్స్‌(ఐఎంసీ)’ మహిళా విభాగాన్ని ఉద్దేశించి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగిస్తూ... మహిళలే లక్ష్యంగా అభివృద్ధి పథకాలు కొనసాగాలన్నదే తన అభిమతమన్నారు. 
ఈ సందర్భంగా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రశంసించిన మోదీ ‘అవకాశమిస్తే పురుషుల కంటే రెండడుగులు ముందే ఉంటామని మహిళలకు రుజువు చేశారు. డెయిరీ, పశు పరిశ్రమ రంగాల్లో మహిళల వాటానే అత్యధికం. మహిళా సాధికారతకు లిజ్జత్‌ పాపడ్, అమూల్‌లే చక్కని ఉదాహరణలు’ అని పేర్కొన్నారు. ముద్రా రుణాల్లో 70 శాతం మహిళలే తీసుకుంటున్నారని, మహిళల్లో ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తికి అది అద్దంపడుతుందని చెప్పారు. కాగా, బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నేడు మోదీ నాగ్‌పూర్‌లో ఆయనకు నివాళులర్పించడంతో దీక్షా భూమి వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభిస్తారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com