అసలు సిసలు కవిత్వం
April 19, 2017
అసలు సిసలు కవిత్వం:
అసలు సిసలు కవితకెపుడు
స్వానుభవమె పుట్టినిల్లు;
గుండెకొలిమిలోన మరిగి,
కంటికొనలలోన కరిగి,
పంటిబిగువులోన నలిగి,
ఒంటినరములోన ఉరికె-
అసలు సిసలు కవితకెపుడు
స్వానుభవమె పుట్టినిల్లు.
వాల్మీకీ శ్లోకములకు
స్వానుభవమె పుట్టినిల్లు;
జాషువా పద్యగతికి
స్వానుభవమె పుట్టినిల్లు;
శ్రీ శ్రీ కవితాగ్నికి
స్వానుభవమె పుట్టినిల్లు;
అహర్నిశం అణగద్రొక్కి
అనుక్షణం అదిమిపెట్టి
అనుభవాలు చెక్కినట్టి
కవితాక్షర శిల్పం;
ఎర్రగానె మంటపెట్టి
కాల్చికాల్చి కరగగొట్టి
సమ్మెటతో వంచినట్టి
లోహాక్షర ఖడ్గం;
అదే అదే మహత్వం
అదే అదే పటుత్వం
చచ్చినట్టి జడత్వం
అసలు సిసలు కవిత్వం.
-సిరాశ్రీ
(పొద్దున్నే కాసేపు జాషువాగారి పద్యాలు చదివిన స్వానుభవంతో )