శివమ్: రివ్యూ

- October 02, 2015 , by Maagulf
శివమ్: రివ్యూ

బ్యానర్ : శ్రీ స్రవంతి మూవీస్ నటీనటులు : రామ్, రాశి ఖన్నా, అభిమన్యు సింగ్, శ్రీనివాసరెడ్డి, పోసాని, బ్రహ్మానందం సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ సమర్పణ : కృష్ణ చైతన్య నిర్మాత : 'స్రవంతి' రవికిషోర్ దర్శకత్వం : శ్రీనివాస రెడ్డి విడుదల తేదీ : 02 అక్టోబర్ 2015 రామ్, రాశి ఖన్నా జంటగా నటించిన చిత్రం 'శివమ్'. శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని రామ్ పెదనాన్న 'స్రవంతి' రవికిషోర్ నిర్మించారు. 'కందిరీగ' తర్వాత రామ్ ఖాతాలో సరైన కమర్షియల్ విజయం లేదు. 'స్రవంతి మూవీస్' సంస్థ ముప్పై ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ యేడాదిలో వస్తున్న ఈ సినిమాపై రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. శుక్రవారం విడుదలయిన ఈ చిత్రం ఎలా ఉందో.. సమీక్ష చదివి తెలుసుకోండి. కధ :: శివ(రామ్) థియరీ ఒక్కటే.. నచ్చిన అమ్మాయి తగిలేంత వరకు వెయిట్ చేయాలి, తగిలకా ఫైట్ చేయాలి. మనోడి హాబీ ప్రేమ జంటలను ఒక్కటి చేయడం. కుటుంబ సభ్యుల కోసం ప్రేమను త్యాగం చేసి ఇష్టం లేని పెళ్లి చేసుకోవద్దని చెప్తాడు. ఎటువంటి పరిచయం, సంబంధం లేని ఇద్దరి ప్రేమ విజయవంతం కావడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. బుద్ధిబలంతో సమస్యకు పరిష్కారం వెతుకుతాడు. పని కాకుంటే, కండ బలం చూపుతాడు. అలంటి మనోడికి 'ఐ లవ్ యు' అంటూ ఓ అందమైన అమ్మాయి తనూజ(రాశి ఖన్నా) కనిపిస్తుంది. అమ్మాయి ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్దపదతాడు. అదే అమ్మాయిను విలన్( అభిమన్యు సింగ్) కూడా ప్రేమిస్తాడు. నిజంగా తనూజ శివను ప్రేమించిందా..? తనూ ప్రేమ కోసం శివ ఎం చేశాడు..? మధ్యలో శివ దొరికితే చంపేయాలనుకుంటున్న భోజి రెడ్డి(వినీత్ కుమార్).. బ్రహ్మం(బ్రహ్మానందం)లు ఎవరు..? వాళ్ళతో శివకున్న వైరం ఏంటి..? కన్నతండ్రి(పోసాని కృష్ణ మురళి) ఎందుకు కొడుకును చంపాలనుకుంటున్నాడు..? పరిచయం లేని ప్రేమికుల కోసం శివ ఎందుకు ఫైట్ చేస్తున్నాడు..? ఇలా తదితర ప్రశ్నలకు సమాధానమే చిత్రం. నటీనటుల పనితీరు :: ఎప్పటిలా హుషారైన నృత్యాలు, నటన, మాట తీరుతో రామ్ కనిపించాడు. పాత్రకు న్యాయం చేశాడు. కొత్తగా ఎం చేశాడు..? ప్రతి చిత్రంలో ఒకే తరహాలో నటిస్తున్నాడుగా.. అనే భావన ప్రేక్షకులలో కలుగుతుంది. రాశి ఖన్నా ఎంత అందంగా ఉందో అంతకంటే రెట్టింపు మందంగా ఉంది. ముఖంలో హావభావాలు పలికించిన తీరు బాగుంది. కానీ, పాటల్లో అందాల ఆరబోత నప్పలేదు. పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్ రెడ్డి, అభిమన్యు సింగ్, బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, వినీత్ కుమార్, అమిత్.. ఇలా చిత్రంలో ప్రతిభావంతులైన నటీనటులు ఎక్కువున్నారు. ఒక్కరికి కూడా సరైన పాత్ర లభించలేదు. అన్నీ రొటీన్.. రొటీన్.. రొటీన్.. పాత్రలే. ఉన్నంతలో ఫిష్ వెంకట్, సప్తగిరి కాస్తలో కాస్త పర్వాలేదు. సాంకేతికవర్గం సంగీతం :: స్పెయిన్, నార్వేలలో అందమైన ప్రదేశాలను చూపడంలో రసూల్ ఎల్లోర్ పనితనం కనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటల్లో 'అందమైన లోకం..', 'ఐ లవ్ యు టూ.. ' బాగున్నాయి. మిగతావి పర్వాలేదు. కానీ, ఒక్క పాటకు కూడా సరైన సందర్భం రాలేదు. నేపథ్య సంగీతంలో వాయిద్యాల హోరు, శబ్ద కాలుష్యం మినహా మరొకటి లేదు. పీటర్ హెయిన్స్ యాక్షన్ సన్నివేశాలకు రూపకల్పన నమ్మడం కష్టం. అంతా రొటీన్ బాడుడే. ఎడిటర్ 'కేరింత' మధు కత్తెరలో పదును లేదు. మూడు గంటల కంటే తక్కువ నిడివి కల ఈ చిత్రం ఆరు గంటలున్న ఫీలింగ్ కలిగింది. కిషోర్ తిరుమల మాటల్లో పంచ్ ఎక్కువైంది. రామ్ వయసు, హీరోఇజంకు అంత భారీ డైలాగులు అవసరం లేదనుకుంట. దర్శకత్వం :: తొలి చిత్రంతో పక్కా కమర్షియల్ దర్శకుడు అనిపించుకోవాలనే తపన శ్రీనివాసరెడ్డిలో కనిపించింది. సినిమా ప్రారంభంలో తన పంథా ఏంటో చెప్పేశాడు. కథలో మొదటి అరగంటలో చిక్కుముడులు వేస్తూ వెళ్లాడు. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ రివీల్ చేస్తూ మరో చిక్కుముడి వేశాడు. క్లైమాక్స్ వరకూ దాని మీద కథ నడిపాడు. కమర్షియల్ పద్ధతిలో కథ బాగా రాసుకున్నాడు. కానీ, ట్రీట్మెంట్ పరంగా కొంచం కూడా కొత్తదనం లేదు. ప్రేక్షకులు హర్షించేలా సినిమా తీయడంలో, దర్శకుడిగా మార్క్ చూపడంలో విఫలమయ్యాడు. విశ్లేషణ :: ఓ అమ్మాయిపై హీరో, విలన్ మనసు పడడం కొత్త కాదు. పంజరంలో చిలకను గాయపడకుండా తీసినట్టు, విలన్ నుండి హీరో ఎలా తప్పించాడు..? అనే అంశంపై చిత్రం విజయం ఆధారపడి ఉంటుంది. 'శివమ్' చూస్తుంటే.. ప్రతి సన్నివేశంలో ఏదోక పాత చిత్రం గుర్తొస్తుంది. హీరో ఫైట్ చేస్తుంటే నమ్మశక్యంగా ఉండదు. పాటలు సందర్భంలో సంబంధం లేకుండా వస్తాయి. పంచ్ డైలాగులు శృతి మించినట్టు అనిపిస్తాయి. సినిమా ప్రారంభం నుంచి భారంగా సాగుతుంది. ప్రేక్షకులను సినిమాతో ప్రయాణం చేయించడంలో దర్శకుడు, హీరో అందరూ విఫలమయ్యారు. ముఖంగా కామెడీ వర్కౌట్ కాలేదు. రామ్ నటన రొటీన్. దాంతో అతని గత చిత్రాలు గుర్తొస్తాయి. ఇంటర్వెల్ వరకు పర్వాలేదు. తర్వాత ఎం జరుగుతుందో? ప్రేక్షకుడు ఊహించడం పెద్ద కష్టం కాదు. ఇక, పతాక సన్నివేశాలు.. హీరో ఫ్లాష్ బ్యాక్.. సినిమా ఎప్పుడు ముగుస్తుందా..? అంటూ దిగాలుగా ఎదురుచూసేలా చేస్తాయి. మధ్యలో రెండు పాటలు, అక్కడక్కడా వర్కౌట్ అయిన కామెడీ కాస్త పర్వాలేదు.  : ప్రేక్షకులపై రామ్ శివోహం(ప్రతాపం)

 

--మాగల్ఫ్.కామ్ రేటింగ్ : 2.75/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com