‘ది మహాభారత’ సినిమాని విడుదల కానివ్వం

- May 23, 2017 , by Maagulf
‘ది మహాభారత’ సినిమాని విడుదల కానివ్వం

రూ.1000 కోట్ల సినిమాకి అప్పుడే చిక్కులు 
 భారతీయ చిత్రపరిశ్రమలో తొలిసారి రూ.1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించనున్న ‘ది మహాభారత’ సినిమాకి చిత్రీకరణ మొదలవకుండానే అడ్డంకులు వస్తున్నాయి. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎం.టి వాసుదేవన్ నాయర్ రచించిన ‘రాందమూళం’ నవల ఆధారంగా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి మహాభారత అని పేరుపెడితే వూరుకోం అంటూ కేరళకు చెందిన హిందు ఐక్యవేది సంఘం హెచ్చరించింది.
మహాభారత పేరు పెడితే సినిమాను విడుదల కానివ్వమంటూ సంఘం అధ్యక్షురాలు కె.పి శశికళ ప్రకటించారు. ‘నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమా ‘రాందమూళం’ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నప్పుడు చిత్రానికి ఆ పేరే పెట్టాలి. అంతేకానీ వేద వ్యాసుడు రాసిన మహాభారతం పేరు ఎలా పెడతారు? మా మాటలుపట్టించుకోకుండా అదే పేరు పెడితే సినిమా థియేటర్లలో ఆడనివ్వం.’ అని హెచ్చరించారు.
‘రాందమూళం’ నవల పాండవుల్లో రెండోవాడైన భీముడి గురించే ఉంటుంది. యూఏఈకి చెందిన భారతీయ వ్యాపారవేత్త బి.ఆర్ శెట్టి ఈ సినిమాని రూ.1000 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.ఎ. శ్రీకుమార్ మేనన్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో భీముడి పాత్రలో మోహల్లాల్ నటించనున్నారు. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తారు. 2018 సెప్టెంబర్లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. 2020లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com