మూత పడ్డ నేషనల్ హెరాల్డ్ ను తెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం

- June 17, 2017 , by Maagulf
మూత పడ్డ నేషనల్ హెరాల్డ్ ను తెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం

సొంత మీడియాపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక‌ను ప్రాంతీయ భాష‌ల్లో తీసుకువ‌చ్చేందుకు రెఢీ అవుతుంది. ద‌క్షిణాదిలో పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెట్టిన హ‌స్తం పెద్దలు.. రంగం సిద్దం చేస్తున్నారు.
2008లో మూతపడ్డ నేషనల్‌ హెరాల్డ్‌ను మళ్లీ జీవం పోసి పార్టీ విధానాలను జనాల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇంగ్లీష్‌లో నేషనల్‌ హెరాల్డ్‌.. హిందీతో నవ్‌జీవన్‌ పత్రికలు రానున్నాయి. వీటితో పాటు.. ఇంటర్‌నెట్‌ ఎడిషన్లు కూడా సిద్దమవుతున్నాయి. ఇప్పటికే సీనియర్‌ జర్నలిస్టు, కాలమిస్టు, సామాజిక ఉద్యమరకారుడు నీలబ్‌ మిశ్రాను ఎడిటర్‌గా నియమించారు. నిజాలు చెప్పే నేషనల్‌ హెరాల్డ్‌ మళ్లీ వస్తుందని రాహుల్‌ ఇటీవల బెంగళూరులో ప్రకటించారు. ఎటువంటి రాజకీయ బంధనాలు లేకుండా... స్వేఛ్చగా పత్రిక నడుస్తుందన్నారు. అవసరమైతే కాంగ్రెస్‌ విధానాలను కూడా ప్రశ్నించవచ్చంటున్నారు.
గత ఎన్నికల్లో మీడియా మద్దతు లేకపోవడంతో చాలా రాష్ట్రాల్లో నష్టం జరిగినట్టు గుర్తించారు. అందుకే జాతీయస్థాయిలో పార్టీకి ప్రచారం అవసరం అని భావించారు. సొంత మీడియా అవసరాన్ని అర్ధం చేసుకున్నారు. రాష్ట్రాల్లో కూడా సొంత మీడియా ఉండాలని నాయకులు రాహుల్‌ ముందు ప్రతిపాదన ఉంచారు. దీంతో నిపుణులతో చర్చించిన పార్టీ ఉపాధ్యక్షుడు ప్రాంతీయ పార్టీల్లో కూడా పత్రికలు, డిజిటల్‌ మీడియా రంగంలో రావాలని నిర్ణయించారు. రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి పార్టీ విధానాలు, సిద్దాంతాలు జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలంటే సొంత మీడియా అవసరముందని పార్టీ భావిస్తోంది. రాష్ట్ర నాయకత్వాలకు ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. ఏర్పాట్లలో బిజీ అయ్యారు.
రాష్ట్రాల్లో ప్రధానంగా కన్నడ, తమిళ, తెలుగు భాషాల్లో మీడియాకు ఉన్న ప్రాధాన్యం నేపథ్యంలో త్వరగా రావాలని నిర్ణయించారు. కర్నాటకలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఆతర్వాత ఏడాది పార్లమెంట్‌తో పాటు.. ఏపీ, తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ దక్షణాది లక్ష్యంగా పావులు కదుపుతోంది. అధికారంలో ఉన్న ప్రత్యర్ధిని ఢీకొట్టడానికి సొంత మీడియా ఉపయోగపడుతుందని రాహుల్‌ ఆలోచనగా చెబుతున్నారు. 1938లో నెహ్రూ స్థాపించిన నేషనల్‌ హెరాల్డ్‌ మూడుసార్లు మూతపడింది. క్విట్‌ ఇండియా మూవ్‌మెంట్‌ టైంలో ఒకసారి... 1970లలో మరోసారి. ఆతర్వాత 2008లో మూతపడి వివాదాల్లో చిక్కుకుంది. ఎట్టికేలకు ఇన్నాళ్లకు మళ్లీ ప్రాంతీయ భాషల్లో కూడా పలకరించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com