జీఎస్టీ ఎఫెక్ట్: 3 రోజుల పాటు దుకాణాల బంద్‌

- July 01, 2017 , by Maagulf
జీఎస్టీ ఎఫెక్ట్: 3 రోజుల పాటు దుకాణాల బంద్‌

దేశమంతా ఒకే పన్ను వ్యవస్థలోకి వచ్చేస్తూ జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ జీఎస్టీలోకి అప్‌గ్రేడ్‌ అవడానికి చాలామంది వ్యాపారస్తులు తమ దుకాణాలను మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు. మొబైల్‌ ఫోన్‌ సర్వీసు సెంటర్ల నుంచి ఫార్మా కంపెనీలు, బిస్కెట్ల తయారీదారులు, ఆటోమొబైల్‌ షోరూంల వరకు అన్నీ కనీసం 72 గంటల పాటు తమ దుకాణాలు మూసివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంతేకాక కొందరైతే, ఏకంగా జూలై 7న లేదా జూలై 10నే మళ్లీ విక్రయాలు ప్రారంభిస్తామని చెబుతున్నారు. తమ అంతర్గత సిస్టమ్స్‌ స్థిరత్వానికి వచ్చాకే కార్యకలాపాలు ప్రారంభిస్తామంటున్నారు.  ''ఇదే మా చివరి డెలివరీ'' అని ఢిల్లీలోని ఓ సూపర్‌బైక్‌ షోరూం జనరల్‌ మేనేజర్‌ ఓ కస్టమర్‌కు చెప్పినట్టు తెలిసింది. కొత్త పన్ను విధానంలోకి తమ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉందని చెప్పినట్టు ఆ కస్టమర్‌ పేర్కొన్నారు.
 
శుక్రవారం రోజు సర్వీసు సెంటర్లకు వెళ్లిన కొంతమంది కస్టమర్లకు కూడా నిరాశే ఎదురైందట. టాప్‌ కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల సర్వీసు సెంటర్లు తమను తిరిగి మంగళవారం రావాలని చెబుతున్నట్టు ఢిల్లీ నివాసులు తెలిపారు. ఫార్మా దిగ్గజం జీఎస్‌కే కూడా తన కార్యకలాపాలను రెండు రోజుల పాటు మూసివేస్తోంది. దీన్ని ఆ కంపెనీ అధికార ప్రతినిధే ధృవీకరించారు. గోద్రెజ్‌ అప్లయెన్స్‌ కూడా తాజా ప్రైమరీ ఆర్డర్లను  ఏడు నుంచి పది రోజుల పాటు తీసుకోవద్దని నిర్ణయించిందని ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ పేర్కొన్నారు. కొన్ని బెవరేజ్‌, స్నాక్స్‌ కంపెనీలు కూడా ఈ మేరకే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ''మేము జూన్‌ 29 నుంచి విక్రయాలు ఆపివేస్తున్నాం.  మళ్లీ జూలై 4న ప్రారంభిస్తాం'' అని డాబర్‌ ఇండియా సీఎఫ్‌ఓ లలిత్‌మాలిక్‌ చెప్పారు. తమ మొత్తం ప్రక్రియను ఇన్‌వాయిస్‌ నుంచి ఇతర అంశాల్లోకి మార్చుతున్నామని తెలిపారు. 
 
ఈ ప్రక్రియతో డాబర్‌ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి మందగించనున్నట్టు కూడా చెప్పారు. కంపెనీ పరిమాణాలు బట్టి జీఎస్టీలోకి మారడానికి రెండు నుంచి ఏడు రోజుల వరకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ముందస్తు ఉన్న వ్యాట్‌ ఇతర పన్ను విధానం కంటే ప్రస్తుతం అమల్లోకి వచ్చిన జీఎస్టీకి భిన్నమైన ఇన్‌వాయిసింగ్‌ సిస్టమ్‌ అవసరమవుతుందన్నారు. తాత్కాలికంగా మూసివేస్తున్న వ్యాపారాల వల్ల కొన్ని రోజుల వరకు మార్కెట్లో కొంత ప్రభావం పడనుందని ఇండస్ట్రి నిపుణులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com