ఆధార్ కు ఇంటి నెంబర్ లింక్

- July 01, 2017 , by Maagulf
ఆధార్ కు ఇంటి నెంబర్ లింక్

నగర పంచాయతీల్లో చోటు చేసుకుంటున్న పలు రకాల అక్రమాలకు తెర పడనుంది. ఒకరి ఇంటిని యజమానికి తెలియకుండానే ఇతరులు అక్రమంగా తమ పేరుకు మార్చుకుంటున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే ఆస్తి పన్నులు చెల్లించినా చెల్లించలేదంటూ మళ్లీ రావడం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితుల్లో వినూత్న పథకానికి రూపకల్పన చేశారు. ఇక నుంచి ఏ మార్పులు చేర్పులు జరిగినా ఎప్పటికప్పుడు సదరు ఇంటి యజమానికే సమాచారం వెళ్తుంది.

అందుకోసం యజమానుల ఇంటి నంబర్‌కు ఆధార్‌ కార్డు, సెల్‌ఫోన్‌ నంబర్లను నగర పంచాయతీకి చెందిన వెబ్‌సైట్‌లో అనుసంధానం చేయాలని రాష్ట్ర కమిషనర్‌ ఆఫ్‌ మునిసిపల్‌ అడ్మిస్ట్రేషన్‌ వారు సంకల్పించారు. ఇటీవల హైదారాబాద్‌లో జరిగిన మున్సిపల్‌ అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రక్రియను జూలై 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

నర్సంపేట, పరకాలలో 17943 గృహాలు నర్సంపేట నగర పంచాయతీ పరిధిలో 10,100 గృహాలు, పరకాల నగర పంచాయతీలో 7,843 గృహాలు ఉన్నాయి. నర్సంపేట పరిధిలో ఇప్పటి వరకు 3,200, పరకాల పరిధిలో 1,050 గృహాలకు ఆధార్‌ లింక్‌ చేశారు. వాటి ఆధారంగా సిబ్బంది ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే మిగతా వారి ఇళ్లకు సంబంధించి నగర పంచాయతీ కార్యాలయాల్లో వివరాలు నమోదై ఉన్నా ఆధార్‌ కార్డు, సెల్‌ నంబర్లు అందుబాటులో లేవు.

ఉపయోగాలు
ఇంటి నంబర్‌కు యజమాని ఆధార్‌ కార్డు, సెల్‌ఫోన్‌ నంబర్‌ను అనుసంధానం చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇటీవల కొంత మంది సదరు ఇంటి యజమానికి సమాచారం లేకుండానే ఓనర్‌షిప్‌ సర్టిఫికెట్‌ పొందుతున్నారు. అలాగే ఇంటి పన్ను ఎంత.. ఎంత చెల్లించాలో సిబ్బంది చెబితేనే తెలిసేది. ఇక ముందు ఆ వివరాలన్నీ మెస్సేజ్‌ రూపంలో యజమానికి అందుతాయి. నగర పంచాయతీ కార్యాలయాల్లో సదరు ఇంటి నంబర్‌ పై ఎలాంటి కదలికలు జరిగినా వెంటనే సమాచారం వస్తుంది. తప్పుడు రిజిస్ట్రేషన్లు నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఇంటి పన్నుల చెల్లింపుల్లో అక్రమాలకు చోటుండదు. ఇంటి యజమాని ప్రమేయం లేకుండా పేరు మార్పిడి జరగదు. బ్యాంక్‌ ఖాతాకు ఆధార్‌ కార్డు అనుసంధానం ఇదివరకే అయింది కాబట్టి ఫింగర్‌ ప్రింట్‌ ద్వారా బ్యాంక్‌లో ఉన్న డబ్బులను నేరుగా పన్నులకు చెల్లించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com