పాక్ విదేశాంగ మంత్రిపై సుష్మాస్వరాజ్ ఘాటు వ్యాఖ్యలు
- July 10, 2017
పాక్ విదేశాంగ మంత్రిపై సుష్మాస్వరాజ్ విమర్శల వర్షం
కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతీయులు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు.. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే ఆమె నుంచి వారికి సాయం అందుతుందని ఏకంగా ప్రధాని మోదీనే కితాబిచ్చారు. భారతీయులనే కాదు.. ఇటీవల పాకిస్థాన్కు చెందిన ఓ చిన్నారి సర్జరీ కోసం మెడికల్ వీసా ఇప్పించి సుష్మా మానవత్వాన్ని చాటుకున్నారు. తాజాగా పాక్కు చెందిన మరో యువతి కూడా మెడికల్ వీసా నిమిత్తం సుష్మాజీ సాయం కోరింది. అయితే ఈ విషయంలో పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు సుష్మాస్వరాజ్. వీసాలు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని, కానీ దీని గురించి అజీజ్ నుంచి ఎలాంటి సిఫార్సులు రావట్లేదన్నారు. వరుస ట్వీట్లతో ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. అసలేం జరిగిందంటే..
పాకిస్థాన్కు చెందిన ఫైజా తన్వీర్ అనే 25 ఏళ్ల యువతి కొంత కాలంగా ఓరల్ క్యాన్సర్తో బాధపడుతోంది. చికిత్స నిమిత్తం భారత్ వెళ్లేందుకు మెడికల్ వీసాకు దరఖాస్తు చేసుకోగా.. దాన్ని పాక్లోని భారత దౌత్యాధికారులు తిరస్కరించారు. దీంతో ఆమె సాయం కోసం సుష్మాస్వరాజ్కు ట్వీట్ చేసింది. తన ఫొటోని సోషల్మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'నాకు సాయం చేయండి సుష్మాజీ. నన్ను బతికించండి ప్లీజ్' అని ట్వీట్ చేసింది. దీనిపై సుష్మాస్వరాజ్ స్పందించి అక్కడి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే వీసా ఇచ్చేందుకు పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ నుంచి సిఫార్సు లేఖ రాలేదని సంబంధిత అధికారులు సుష్మాస్వరాజ్కు చెప్పారు. దీంతో అజీజ్పై విమర్శల వర్షం కురిపించారు సుష్మాజీ.
'భారత్లో చికిత్స నిమిత్తం మెడికల్ వీసాకు దరఖాస్తు చేసుకునే పాక్ వాసులపై సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ కూడా తమ దేశ ప్రజల గురించి కచ్చితంగా ఆలోచిస్తుంటారు. కాగా.. పాక్ దేశస్థులకు భారత అధికారులు వీసాలు ఇచ్చేందుకు ఆయన సిఫార్సు చేయడం అవసరం. అయితే తమ సొంత దేశ ప్రజలకు సిఫార్సు చేసేందుకు ఆయన ఎందుకు సంకోచిస్తున్నారో తెలియడం లేదు' అని సుష్మాస్వరాజ్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
అంతేగాక, పాక్లో ఉరిశిక్ష పడిన కులభూషణ్ జాదవ్ను కలుసుకునేందుకు అతడి తల్లి వీసాకు దరఖాస్తు చేసుకోగా ఆమెకు ఇంకా వీసా రాలేదు. దీనిపై సుష్మా స్పందిస్తూ.. 'కుల్భూషణ్ తల్లి అవంతిక జాదవ్ వీసా దరఖాస్తు పెండింగ్లో ఉంది. దీనిపై అజీజ్కు నేను వ్యక్తిగతంగా లేఖ రాశాను. అయితే నా లేఖపై ఆయన కనీస మర్యాద కూడా చూపించలేదు' అని సుష్మాస్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







