పబ్బులకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సిట్

- July 22, 2017 , by Maagulf
పబ్బులకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సిట్

గ్రేటర్‌ పరిధిలో ఉన్న పబ్బులు డ్రగ్స్‌కు అడ్డాగా మారుతున్నాయని ఎక్సైజ్ శాఖ గుర్తించింది. పబ్బులు.. క్లబ్బుల ఓనర్లకు ఆబ్కారీ భవన్‌లో కౌన్సిలింగ్‌ ఇచ్చింది. ఇకపై ఇలాంటి ఆటలు సాగవని ఆయా పబ్బుల ఓనర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అటు... నిబంధనలు ఉల్లంఘించిన F క్లబ్ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేసి.. గట్టి హెచ్చరికలు పంపింది. డ్రగ్స్ కేసులో దూకుడు పెంచిన ఎక్సైజ్ శాఖ.. గ్రేటర్ పరిధిలో ఉన్న పబ్బులు.. క్లబ్బుల భరతం పడుతోంది. పబ్బులే డ్రగ్స్‌ లభ్యతకు.. వినియోగానికి వేదికలవుతున్నాయని గుర్తించిన సిట్‌... ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. టాలీవుడ్ ప్రముఖుల్ని లోతుగా ప్రశ్నిస్తున్న సిట్.. ఇండస్ట్రీలో డ్రగ్స్‌ సరఫరాపై కీలక వివరాలను ఇప్పటికే తెలుసుకుంది. పూరీ, శ్యామ్‌ కె నాయుడు, సుబ్బరాజులు చెప్పిన వివరాలతో.. పబ్‌ల్లోనే ఎక్కువగా డ్రగ్స్‌ అమ్మకాలు సాగుతున్నట్లు గుర్తించారు. వీటిలో కొన్ని చోట్ల యాజమాన్యాలే ఈ దందా నిర్వహిస్తున్నట్లు తేల్చింది. దీంతో.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పబ్బులు, బార్ల యజమానులు, మేనేజర్లతో  సిట్‌ అధికారులు సమావేశమయ్యారు. పబ్బు యజమానులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘంచిన F క్లబ్‌ లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది ఎక్సైజ్ శాఖ. మరో 14 పబ్‌లకు వార్నింగ్ నోటీసులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో దాదాపు 30 వరకూ పబ్బులున్నాయి. వీటిలో 17 పబ్బులు డ్రగ్స్‌ సరఫరా కేంద్రాలుగా మారాయని ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. డ్రగ్స్‌ అక్కడే విక్రయిస్తున్నారని, సరుకు, డబ్బులు అక్కడే చేతులు మారుతున్నాయని సీసీటీవీ ఫూటేజీలు, ఇతర ప్రైవేటు వీడియోలను తనిఖీ చేసి, అధికారులు నిర్ధారణకు వచ్చారు. డ్రగ్స్‌ దందా నడుస్తున్న పబ్బుల్లో కొన్ని సినిమా నటులకు చెందినవి కూడా ఉన్నాయి. సినీ నటుడు తరుణ్‌కు చెందిన ఆన్‌ పబ్‌, నవదీప్ కు చెందిన బీపీఎం పబ్‌తో పాటు 10 డౌన్‌ స్ట్రీట్‌, వాటర్స్‌, లిక్విడ్‌, బీర్స్‌, డూప్లిన్‌, క్లౌడ్‌ డౌన్‌, ఇటీవల నకిలీ LSD తయారీ కేసులో అరెస్టయిన పియూష్‌కు చెందిన పబ్బులు ఉన్నట్లు తేల్చారు. సినీ ప్రముఖులతో కెల్విన్‌, జీషన్‌ అలీ ఇలాంటి పబ్బుల్లోనే కలుసుకునేవారని నిర్ధారణకు వచ్చారు. వీకెండ్స్‌ తో పాటు ఇతర సెలవు రోజుల్లో పబ్బులు జాతరలను తలపించేవని అధికారులు గుర్తించారు. డ్రగ్స్‌ను విక్రయించడానికి నైజీరియన్‌ ముఠాలు, సరఫరాదారులు పబ్బులకు వచ్చేవారని, వారిని సినీ ముఖ్యులు కలిసేవారని తెలుసుకున్నారు. కొంతమంది డ్రగ్స్‌ను కొనుక్కుని ఇళ్లకు, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేవారని, మరి కొంతమంది అక్కడే మజా చేసేవారని విచారణలో తేలింది. మరోవైపు.. జూబ్లిహిల్స్‌లోని హై లైఫ్‌ పబ్‌ దగ్గర యుూత్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నాకు దిగారు. పబ్బుల్లో డ్రగ్స్‌ కల్చర్‌ను నిర్మూలించాలని డిమాండ్ చేశారు. వీరిని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com