నేడే మహిళల ప్రపంచకప్‌ ఫైనల్

- July 22, 2017 , by Maagulf
నేడే మహిళల ప్రపంచకప్‌ ఫైనల్

మహిళల ప్రపంచకప్‌ టైటిల్ పోరుకు కౌంట్‌డౌన్ మొదలైంది. అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరిన మిథాలీసేన లార్డ్స్‌లో చరిత్ర సృష్టిస్తుందా... ఆతిథ్య ఇంగ్లాండ్‌పై గెలిచి ప్రపంచకప్‌ను ముద్దాడుతుందా... క్రికెట్ మక్కాలో చివరి పంచ్ ఎవరిదో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. ప్రపంచకప్ ఆరంభానికి ముందు భారత మహిళల జట్టుపై ఎటువంటి అంచనాలు లేవు. సెమీఫైనల్ చేరితే గొప్పేనన్న విశ్లేషణలు వినిపించాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మిథాలీసేన అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరింది. 12 ఏళ్ళ తర్వాత ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకొచ్చిన భారత్ చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో నిలిచింది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ నుంచే భారత జట్టు అద్భుతంగా ఆడింది. ఆతిథ్య ఇంగ్లండ్‌పై సంచలన విజయంతో ఆరంభమైన మిథాలీసేన జైత్రయాత్ర వరుసగా నాలుగు మ్యాచ్‌ల వరకూ కొనసాగింది. తర్వాత సౌతాఫ్రికా,ఆసీస్ చేతిలో ఓడినప్పటకీ... కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై చెలరేగిపోయింది. ఇక సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాకిచ్చి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ జైత్రయాత్రలో కెప్టెన్ మిథాలీరాజ్‌తో పాటు హర్మన్‌ప్రీత్‌కౌర్‌ ఇన్నింగ్స్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అటు బౌలింగ్‌లో సమిష్టిగా రాణించిన భారత్ టైటిల్ పోరులో కాన్ఫిడెంట్‌గా బరిలోకి దిగుతోంది. దీనికి తోడు లీగ్ స్టేజ్‌లో ఇంగ్లాండ్‌పై గెలుపు ఖచ్చితంగా భారత్‌కు ఉత్సాహాన్నిచ్చేదే. మరోవైపు ఆతిథ్య ఇంగ్లాండ్‌ను తేలిగ్గా తీసుకోలేం. భారత్‌పై ఓడినప్పటకీ... తర్వాత అన్ని మ్యాచ్‌లూ గెలిచి ఫైనల్‌కు దూసుకొచ్చింది. అయితే ఇంగ్లీష్ టీమ్‌కు బ్యాటింగే ప్రధాన బలం. ఫామ్‌లో ఉన్న భారత బౌలర్లను ఆ జట్టు ఎంతవరకూ ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.రికార్డుల పరంగా ఇంగ్లీష్ టీమ్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లూ 62 వన్డేల్లో తలపడగా.. ఇంగ్లాండ్ 34 మ్యాచ్‌లలో గెలిస్తే... భారత్ 26 వన్డేల్లో నెగ్గింది. ఇక ఆరుసార్లు ప్రపంచకప్ ఫైనల్ చేరిన ఇంగ్లాండ్ మూడుసార్ల ఛాంపియన్‌గా నిలిచింది. స్వదేశంలో జరిగిన రెండుసార్లూ ఆ జట్టు ట్రోఫీ గెలవడం మరో రికార్డ్‌. అయితే టాప్ టీమ్స్‌పై విజయాలతో ఫైనల్‌కు చేరిన మిథాలీసేన అంచనాలకు తగ్గట్టు రాణిస్తే భారత్ తొలిసారి ప్రపంచకప్ కైవసం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఫైనల్లో ఒత్తిడిని అధిగమించిన జట్టునే విజయం వరిస్తుందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి సొంతగడ్డపై బలంగా ఉన్న ఇంగ్లాండ్‌ను ఓడించి వరల్డ్‌కప్‌తో స్వదేశానికి తిరిగి రావాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com