గల్ఫ్ గుబులు

- July 26, 2017 , by Maagulf

గల్ఫ్ కార్మికుల సమస్య ఏ ఒక్క ప్రాంతానికో, రాష్ర్టానికో సంబంధించింది ఎంతమాత్రం కాదు. అలాగే వ్యక్తిగతంగా కార్మికుని సమస్య కూడా కాదు. ఇది సామాజిక, ఆర్థిక సమస్యగా చూడాలి. దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో, ప్రాంతాల్లో గల్ఫ్ బాధితులున్నారు. కాబట్టి గల్ఫ్ బాధితులను పదివేల మందిని ఆదుకుని దేశానికి తిరిగి రప్పించే పనితోనే అయిపోయిందన్నట్లుగా కేంద్రం వ్యవహరించటం సబబు కాదు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని వ్యవహరించాలి. వారి జీవనోపాధికోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాలి. 

సౌదీ అరేబియాలో పనిచేస్తున్న 76 మంది నర్సులను ఉన్నపళంగా వెనక్కిపోవాలని అక్కడి ప్రభుత్వం హుకుం జారీచేసింది. దీంతో గల్ఫ్ వలసకార్మికుల సమస్య తీవ్రరూపం దాల్చింది. గల్ఫ్‌దేశాల్లోని ప్రవాస భారతీయ కార్మికుల స్థితిగతులు, జీవనోపాధి చర్చనీయాంశమవుతున్నది. అక్కడ నెలకొన్న ఆర్థిక మాంద్యం గుబులు పుట్టిస్తున్నది. లక్షలాదిమంది కార్మికులను పనుల నుంచి తొలిగించి అక్కడి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయి. ఆ ప్రభుత్వాల వైఖరి ఆందోళన కలిగిస్తున్నది. మన దేశం నుంచి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారిలో 70 శాతం మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారు. వీరంతా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్రెయిన్, ఒమన్, ఖతార్ లాంటి దేశాల్లో సాధారణ కార్మికులుగా, మధ్యతరగతి ఉద్యోగులుగా లక్షల సంఖ్యలో ఉన్నారు. ఒక్క సౌదీ అరేబియాలోనే 30 లక్షలమంది భారతీయులున్నారు.

అయితే గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూలేని విధంగా చమురు ధరలు పడిపోయాయి. దీంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామా లు, ఒపెక్ దేశాల మధ్య నెలకొన్న పోటీ ఫలితంగా పశ్చిమాసియా అంతటా చమురు ధరలు తగ్గాయి. 2014లో చమురు బ్యారెల్ ధర 120 డాలర్లు ఉంటే, అదిప్పుడు 20 డాలర్లకు పడిపోయింది. దీంతో చమురు ఎగుమతుల పైనే ఆధారపడిన గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఫలితంగా అభివృద్ధి ప్రాజెక్టులు, నిర్మాణ రంగ పనులు, అనుబంధ కంపెనీలు మూతపడ్డాయి. దీనికితోడు ఆ దేశాలు స్వయం రక్షణ విధానా లు చేపట్టి స్థానికులకే ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యమిస్తున్నాయి. దీనివల్ల చిన్న, మధ్యతరహా ఉద్యోగా లు చేస్తున్న ప్రవాస భారతీయులు ఇంటిముఖం పట్టాల్సి వస్తున్నది. సౌదీ అరేబి యా ఏకంగా స్థానికులకే ఉద్యోగాలని చట్టం చేసింది. ఈ క్రమంలోనే గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పడిపోయాయి. 2014లో గల్ఫ్ దేశాల్లో ఉన్న వల స కార్మికుల సంఖ్య 7,75, 845 ఉంటే, అదే 201 6 నాటికి 5,07,296కు పడిపోవటం గమనార్హం.

అయితే ఇప్పటి దాకా గల్ఫ్ సమస్యను వలసపోయిన కార్మికుని వ్యక్తిగత సమస్యగా చూస్తున్న తీరే ఎక్కువగా కనిపిస్తున్నది. బతుకు దెరువు కోసం గల్ఫ్ దేశాలకు వలసబాట పట్టిన వారు తెలంగాణ పల్లెల నుంచే కాదు, దేశవ్యాప్తంగా అనేకప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా కేరళ, తెలంగాణ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్ రాష్ర్టా ల నుంచి అధికసంఖ్యలో ఉన్నారు. వీరంతా అకస్మాత్తుగా ఉద్యోగాలు కోల్పోయి సొంత ఊళ్లకు తిరిగొస్తే, వారి జీవనోపాధి సమస్యతో పాటు, అనేక సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఇక్కడి సామాజిక జీవనంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా తారుమారవుతుంది. ఈ నేపథ్యంలో తలెత్తబోయే పరిణామా లు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి మన దేశీయ బ్యాం కుల్లో జమలు 2014-15లో 69,819 మిలియన్ డాలర్లు ఉంటే, 2015-16లో 65,592 మిలియన్ డాలర్లకు పడిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మన బ్యాంకుల్లో జమ అవుతున్న నగదులో 50 శాతం గల్ఫ్ దేశాల నుంచేననేది ప్రపంచబ్యాం కు అంచనా వేసింది. జీడీపీలో 3.2శాతంగా ఉన్న ఆర్థిక నిల్వలు ఒక్కసారిగా నిలిచిపోతే అటు సామాజిక జీవనంతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో కేరళ ఆర్థికమంత్రి అన్న మాటలు గమనార్హమైనవి. గల్ఫ్‌లో ఏర్పడ్డ పరిణామాల ఫలితంగా కేరళ ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్థమైందని, ఇది తమకు కోలుకోలేని దెబ్బ అని వాపోయారు. కేరళ వాసులు నలభై లక్షల మంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తుంటే అందులో 80శాతం మంది గల్ఫ్‌లో ఉన్నారు. కేరళలో 33శాతం బ్యాంకు ఖాతాలు గల్ఫ్ కార్మికులవే. ఇలాంటి పరిస్థితే తెలంగాణ జిల్లాల్లోనూ అటు ఇటుగా ఉంటుందన్నది వాస్తవం. అయి తే కేరళ ప్రభుత్వం గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక పునరావాస, ఉపాధి కార్యక్రమాలను చేపట్టింది. వారి కోసం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని కూడా రూపొందించింది. గల్ఫ్ కార్మికుల సమస్య ఏ ఒక్క ప్రాంతానికో, రాష్ర్టానికో సంబంధించింది ఎంతమాత్రం కాదు. అలాగే వ్యక్తిగతంగా కార్మికుని సమస్య కూడా కాదు. ఇది సామాజిక, ఆర్థిక సమస్యగా చూడాలి. దేశవ్యాప్తంగా అనే క రాష్ర్టాల్లో, ప్రాంతాల్లో గల్ఫ్ బాధితులున్నారు. 

కాబట్టి గల్ఫ్ బాధితులను పదివేల మంది ని ఆదుకుని దేశానికి తిరిగి రప్పించే పనితోనే అయిపోయిందన్నట్లుగా కేంద్రం వ్యవహరించటం సబబు కాదు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని వ్యవహరించాలి. వారి జీవనోపాధికోసం ప్రత్యేక పథకాలను ప్రవేశ పెట్టాలి. తెలంగాణ పల్లెల నుంచి కూడా గణనీయ సంఖ్యలో గల్ఫ్ వలస కార్మికులున్నారు. ఏండ్లకేండ్లు ఎడారి దేశాల్లో అష్టకష్టాలు పడి చివరికి ఉట్టి చేతులతో బతుకు జీవుడా అంటూ స్వదేశానికి తిరిగొచ్చిన వారిని రాష్ట్రప్రభుత్వం మానవీయంగా ఆదుకున్నది. అలాంటి వారి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రశంసలందుకున్నవి. ఆ దిశగా దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం కలిసికట్టుగా కృషిచేయాలి. 


--సాయికృష్ణ యాదవ్( ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com