అల్లు రామలింగయ్య జయంతి నేడు

- July 31, 2017 , by Maagulf
అల్లు రామలింగయ్య జయంతి నేడు

డాక్టరు నుంచి యాక్టరుగా మారిన అల్లు

అల్లు రామలింగయ్యగారు డాక్టరూ.. యాక్టరూ. మానసిక బాధలకు హాస్యాన్ని మందుగా ఇస్తాడు. శారీరక రుగ్మతలకు మందును మాత్రం హాస్యంగా ఇవ్వడు' అని ఓ సందర్భంలో పద్మశ్రీ అల్లు రామలింగయ్య గురించి ఆచార్య ఆత్రేయ చెప్పిన మాటలు అక్షరసత్యాలు. ఎందుకంటే దాదాపు 50 ఏళ్ల పాటు తన నటనతో కితకితలు పెట్టించి కడుపుబ్బ నవ్వించి తెలుగు వారి జీవితాల్లో హాస్యమై అల్లుకున్న అల్లు రామలింగయ్య జయంతి నేడు.. ఈ సందర్భంగా ఆయన నటించిన కొన్ని హాస్య గుళికలు  వేసుకుందాం.. 

నాటక రంగం నుంచి నటుడిగా ఎదిగిన తీరు

రామలింగయ్య నటనకు పునాది నాటకరంగం. ప్రజానాట్యమండలి కళాకారుడైన రామలింగయ్య 'కూడు గుడ్డ', 'ఆడది', 'పల్లెపడుచు', 'పశ్చాత్తాపం' వంటి నాటకాలు ప్రదర్శిస్తూ ఊరూరు, వాడవాడ తిరిగేవారు. వీటిల్లో 'పశ్చాత్తాపం' నాటకంలోని పేరయ్య శాస్త్రి పాత్ర ఆయనకు పేరు తేవడమే కాదు ఎన్నో బహుమతులను సంపాదించి పెట్టింది. అంతేకాదు రామలింగయ్య సినీరంగ ప్రవేశానికి ఈ పాత్రే దారి చూపించింది.
ప్రజానాట్యమండలి సభ్యుడైన డా.గరికపాటి రాజారావు ఆ నాటి మద్రాసు చేరి 'పుట్టిల్లు' పేరుతో చిత్రనిర్మాణం ప్రారంభిస్తూ , ఇతర సభ్యులకు కూడా ఇందులో అవకాశాలు కల్పించారు. 'పశ్చాత్తాపం' నాటకంలో పేరయ్య శాస్త్రి పాత్ర బాగా పేరు తేవడంతో 'పుట్టిల్లు' చిత్రంలో అదే పాత్రను 'శాస్త్రులు' పేరుతో అల్లు రామలింగయ్యతో పోషింపచేశారు రాజారావు. ఆ పాత్రను ఆయన పోషించిన వేళా విశేషం ఏమిటో కానీ ఆ తరువాతి కాలంలో శాస్త్రి పాత్ర అనగానే దర్శకనిర్మాతలకు రామలింగయ్యే గుర్తుకు వచ్చేవారు.
1957లో వచ్చిన 'మాయాబజార్' చిత్రంలో 'తానా శాస్త్రి.. తందానా శర్మ' పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండే పాత్రలు. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన 'దొంగరాముడు' సినిమాలో హాస్టల్ వార్డెన్ వేషం వేశారు రామలింగయ్య. ఆ పాత్రతో కె.వి. దృష్టిలో పడటంతో ఆయన 'మాయాబజార్' చిత్రంలో శర్మ వేషం రామలింగయ్యకు ఇచ్చారు. అంతే. ఈ చిత్రంలో ఆయన పోషించిన 'తందానా శర్మ' పాత్ర దాదాపు 20 ఏళ్ల సినీ జీవితాన్నిచ్చింది. 
ఇలా 'మాయాబజార్' చిత్రంలో శర్మ పాత్రతో రామలింగయ్య కెరీర్‌కు ఊతాన్నిచ్చిన కె.వి. రెడ్డి స్వీయదర్శకత్వంలో నిర్మించిన 'శ్రీకృష్ణార్జున యుద్ధం' సినిమాలో 'చిన ముని' పేరుతో మరోసారి బ్రాహ్మాణుని పాత్ర ఇచ్చారు. ఎన్టీఆర్, ఎఎన్నార్‌లాంటి అగ్రశ్రేణి కథానాయకులు నటించిన ఆ చిత్రంలో రామలింగయ్యకు ప్రత్యేకంగా ఓ పాట పెట్టడం ఓ విశేషం. 'అంచెలంచెలు లేని మోక్షం చాల కష్టమే భామినీ' అని సాగే ఆ పాట ప్రేక్షకుల్ని కావలసినంత వినోదాన్ని అందించి రామలింగయ్య స్థాయిని పెంచింది.  
నటుడు కావాలన్న కోరికతో సొంత డబ్బులతో స్టేజ్ ఆర్టిస్ట్ గా మారి, అటు పై సినిమా నటుడిగా మారిన అల్లు రామలింగయ్య తనకంటూ ఓ శైలిని అతి తక్కువ సమయంలో క్రియేట్ చేసుకున్నారు. తర్వాత ప్రతి పాత్రతోనూ ప్రేక్షకులకు ఏ మాత్రం మొనాటనీ లేకుండా చూసుకున్నారు. ఇక రాజబాబు తర్వాత అల్లు, రమాప్రభల కాంబినేషన్ కు ఉండే క్రేజ్ ఆ రోజుల్లో చాలానే ఉండేది. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకొనేందుకు ఈ జంట కోసం పాటలు పెట్టిన సందర్భాలూ.. అవి సూపర్ హిట్ అయిన సిట్యుయేషన్స్ ను ప్రేక్షకులెవరూ అంత ఈజీగా మర్చిపోలేరు.. 
అలాగే 'అర్థాంగి' సినిమాలో హీరోయిన్ జయసుధను ప్రేమించే వయసు మళ్లినవాడిగా అల్లు నటన హాస్యపు జల్లులు కురిపిస్తుంది. తరచి చూస్తే ఆ మధ్య తెలుగులో వచ్చిన 'పోకిరి' చిత్రంలో బ్రహ్మానందం, ఇలియానాల ట్రాక్ ను గుర్తు తెచ్చే ఈ సీన్స్ లో అప్పట్లోనే అల్లు పండించేశారు.
నటించడం ఇష్టం, నవ్వించడం ఇష్టం
ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో నిలద్రొక్కుకున్నాడు. అల్లు హాస్యపు జల్లునేకాదు కామెడీ విలనిజాన్ని కూడా బాగా రక్తికట్టించాడు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి మూగమనసులు, దొంగరాముడు, మాయా బజార్,ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం మొదలైనవి వున్నాయి. ముత్యాలముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు ఆయన కుమారుడు ఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్ లో పాల్గొన్న గొప్ప నటుడు అల్లు. 
కామెడీ ఆర్టిస్టుగానే కాకుండా కేరెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, సైడ్ విలన్‌గా రకరకాల పాత్రల్లో ఒదిగిపోయి ఆయా పాత్రల్లో తనకు తానే సాటి అనిపించుకున్నారు. స్వతహాగా హోమియో వైద్యుడైన రామలింగయ్య ప్రేక్షకుల నాడిని సరిగ్గా పట్టుకోవడంలో కూడా విజయం సాధించారు. ముఖ్యంగా కామెడీ ఆర్టిస్టుగా ఆయన టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఇతరులు అనుకరించాలన్నా వీలులేనవి. మెలికలు తిరిగిపోతూ ఆయన చెప్పే డైలాగులు అందర్నీ నవ్వించేవి.
ఇక అల్లు రామలింగయ్య అనగానే ఎవ్వరికైనా.. ఎన్ని తరాలకైనా వెంటనే గుర్తొచ్చే మరో పేరు రావుగోపాలరావు.. ఈ ఇద్దరూ కలిసి నటించడం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైనా ఇద్దరూ వేర్వేరు సినిమాల్లో నటించినా అదో వెలితిగా కనిపించేది ఆడియన్స్ కు. మామూలుగా విలన్స్ కు సంబంధించి హిట్ పెయిర్స్  చాలా అరుదుగా చూస్తుంటాం.. తమ నటనతో అలాంటి అరుదైన ఘటనను అందరికీ ఆమోదయోగ్యంగా మార్చేశారీ ఇద్దరూ.. అసలు ఓ దశలో రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు.. 
ఆ ఇద్దరిదీ తెలుగు సినిమా ఉన్నంత కాలం గుర్తుంచుకోదగ్గ జంట అనేది అందరికీ తెలిసిందే. అయితే చాలా సినిమాల్లో వీరివి దుష్టపాత్రలే. రావుగోపాలరావు గారు మెయిన్ విలన్ అయితే, ఆ పక్కనే అర విలన్ గా బాధ్యత తీసుకుని పూర్తి కామెడీని పంచే బాధ్యత అల్లుది. అలా అల్లుకున్న వీరి బంధం వందలాది సినిమాల్లో వేల నవ్వుల్ని పంచింది. 
ఇష్టమైన దర్శకులు విశ్వనాథ్, బాపు..
రొటీన్ పాత్రలకు భిన్నంగా ఎవరైనా తనకు కొత్త పాత్రలు ఆఫర్ చేస్తే బావుండని ఎప్పుడూ అనుకునేవారట. అలా ఆయనకు బాగా నచ్చిన దర్శకుల్లో కె. విశ్వనాథ్, బాపులిద్దరూ ఉన్నారు. వీరి చిత్రాల్లో తనకూ ఖచ్చితంగా పాత్ర ఉండాలని బాగా ఆశించేవారట. ఒకవేళ వాళ్లు పాత్ర ఇవ్వకపోతే చాలా బాధపడిపోయేవారట. అంటే ఆ ఇద్దరూ తనను ఖచ్చితంగా కొత్త పాత్రల్లో చూపిస్తారనే బలమైన నమ్మకం.. తద్వారా.. తనలోని నటుడిని సంతృప్తి పరుచుకోవచ్చనే ఆలోచన స్పష్టంగా కనిపించేంది. 
విశ్వనాథ్ సినిమాల్లో అల్లు చేసినవన్నీ వైవిధ్యమైన పాత్రలే. అలాగే అల్లుకోసమే రమణ కొన్ని పాత్రలు అల్లేవారు. బాపు చిత్రీకరణలో అవి కాస్తా ఆడియన్స్ కు గిలిగింతలు పెట్టేవి. వారి కోసం అని కాదు కానీ, అల్లుకు నటన పై ఎంత డెడికేషన్ అంటే, ఆయన చిన్న కొడుకు వెంకటేష్ ఓ ప్రమాదంలో మరణించారు. అయినా వారం రోజులు కూడా తిరక్కుండానే బాపు గారి 'అందాలరాముడు' చిత్ర షూటింగ్ లో పాల్గొన్నారు. తన వల్ల వేరెవరూ ఇబ్బంది పడకూడదనే ధోరణి ఓ కారణమైతే, ఆయనలోని మానసిక దృఢత్వానికీ ఈ సంఘటన ఓ ఉదాహరణగా చెబుతారు ఆయనకు కావల్సిన వాళ్లు. 
నటుడిగా వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు అల్లు. తొలి సినిమా 'పుట్టిల్లు' నుంచి చివరి సినిమా 'జై' వరకూ జైత్రయాత్ర కొనసాగించారు. అలాగే అల్లూ నుంచి అన్ని తరాల నటులూ నేర్చుకోవాల్సిన ప్రథమ లక్షణం.. ప్లానింగ్, డిసిప్లిన్. అది కెరీర్ పరంగా అయినా.. కుటుంబ పరంగా అయినా వర్తిస్తుంది. అందుకే అల్లు సృష్టించిన సామ్రాజ్యం ఇప్పుడు సినిమా పరిశ్రమలో అప్రతిహతంగా సాగుతోంది.. ఎంత డిసిప్లిన్ గా ప్లాన్ చేస్తే ఇలాంటి పరిశ్రమలో అలా సాధ్యమౌతుందో అల్లూని చూసి నేర్చుకోవలసిందే..
ముగిసిన 50 ఏళ్ల ప్రస్థానం
 50యేళ్ల పాటు నటుడిగా కొనసాగిన అల్లు 1990లో భారత ప్రభుత్వం నుంచి 'పద్మశ్రీ' అందుకున్నారు. తెలుగు సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఓ తపాలా బిళ్ల విడుదల చేశారు. తొలినాళ్లలో ఎన్ని కష్టాలు అనుభవించారో తెలియకపోయినా.. ఆయన అందరికీ తెలిసిన దగ్గర నుంచి చాలా వరకూ సంతృప్తి కరమైన జీవితాన్నే గడిపారని చెబుతారు. అల్లు నటించిన చివరి సినిమా 'జై' ఇక తెలుగువారికి కోట్ల నవ్వుల్ని పంచి.. అందరి హృదయకోటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అల్లు తన ఎనభైరెండో యేట 2004 జూలై 31న కన్నుమూశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com