ఇక.. కొవ్వెక్కదు

- August 02, 2017 , by Maagulf
ఇక.. కొవ్వెక్కదు

01-08-2017: ఎంత స్థూలకాయం ఉంటే మాత్రం... ఎవరి శరీరాన్ని వాళ్లే మోసుకుంటారు తప్ప.. ఎదుటి వాళ్లేమీ మోయరు. అయినా ‘‘ఏమిటి విత్రమా! అలా పెంచేస్తున్నావ్‌! శరీరాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేశామిటి?’’ ఇలా ఏదో అనేస్తారు. ఎవరికి మాత్రం స్లిమ్‌గా ఉండాలని ఉండదు. కాకపోతే కొంతమంది ఆ విషయంలో బాగా నిర్లక్ష్యంగా ఉండిపోతారు. కొన్నాళ్ళకు ఆ స్థూలకాయం కూడా అలవాటైపోతుంది! ఈ సమస్యను ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే, అధిక రక్తపోటు, మధుమేహం, మోకాళ్లనొప్పులే కాదు ఒక ద శలో అంతకన్నా తీవ్రమైన రుగ్మతలే తలెత్తుతాయి. అవలీలగా బరువు తగ్గిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే.. ఏ మార్గమైనా ఏదో చాక్లెట్‌ తినేసినంత సులువుగా మాత్రం ఉండదు. నియమిత ఆహారం, నిరంతర వ్యాయామం, అవసరమైన వైద్య చికిత్సలు- ఈ మూడు విషయాల్లో శ్రద్ధ వహించాల్సిందే!!
 
ఎందుకీ స్థూలకాయం?
అవసరానికి మించి తినేయడం, శరీర శ్రమ బొత్తిగా లేకపోవడం, హార్మోన్‌, థైరాయిడ్‌ గ్రంథి తాలూకు సమస్యలు- స్థూలకాయానికి దారితీసే ప్రధాన కారణాలు ఇవే! మాంసాహారమే అని కాదుశాకాహారమైనా అవసరానికి మించి తీసుకుంటే అది కొవ్వుగా మారి శరీరంలో నిలిచిపోతుంది. కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకుంటే స్థూలకాయం తప్పనిసరి. అందుకే బరువు పెరుగుతున్న వారిని పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆకు, కూరగాయలు తీసుకోవాలి. అయితే, అవసరానికి మించి తీసుకుంటే కూరగాయలైనా కొవ్వుగానే మారతాయి. పండ్లరసం కూడా ఇందుకు మినహాయింపు కాదు.
 
థైరాయిడ్‌ సమస్యలు
స్థూలకాయానికి అతిగా ఆహారం తీసుకోవడం ఒక్కటే కారణం కాదు. థైరాయిడ్‌ గ్రంథి తక్కువగా పనిచేసినప్పుడు కూడా శరీరం లావెక్కుతుంది. ఈ స్థితిలో థైరాయిడ్‌ సమస్యకు చికిత్స తీసుకోవాలి. కేవలం ఆహార నియమాలు పాటించడం వల్ల ప్రయోజనం ఉండదు. స్త్రీలలో రుతుక్రమం నియమిత కాలంలో లేకపోవడానికి కూడా థైరాయిడ్‌ గ్రంథి లోపాలే కారణం. ఈ రుతు సమస్యలను నిర్లక్ష్యం చేస్తే క్రమంగా అది కూడా స్థూలకాయానికి దారితీస్తుంది. అందువల్ల స్థూలకాయానికి హార్మోన్‌ లోపాలు కారణమో, లేక అధిక ఆహారం కారణమో ముందు తెలుసుకోవాలి. స్థూలకాయంతో వచ్చే సమస్యల్లో గుండె జబ్బులు ప్రధానం. వీటికి తోడు అధిక రక్తపోటు, మధుమేహ సమస్యలు కూడా వస్తాయి. దీనివల్ల కొలెస్ర్టాల్‌ పెరిగిపోయి, గుండె రక్తనాళాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అధిక బరువు కారణంగా కీళ్ల మీద భారం పెరిగి కీళ్లనొప్పులు మొదలవుతాయి. శారీరక సమస్యలే కాదు వీరు మానసిక ఒత్తిళ్లకూ లోనవుతారు.
 
అతి ఎప్పుడూ ముప్పే!
ఆహారం విషయంలో రెండు విపరీత ధోరణులు కనిపిస్తాయి. అతిగా తినేవారు ఒక వర్గమైతే, అతిగా తిండి తగ్గించేవారు మరో వర్గం. బరువును తగ్గించుకునే యత్నంలో కొందరు కనీస ఆహారం కూడా తీసుకోరు. తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేలా వ్యాయామం చేయాలే గానీ, ఆహారాన్ని అమితంగా తగ్గించడం సరికాదు. దీనివల్ల శరీరంలో మెగ్నీషియం, పొటాషియం, సోడియం ఫ్లోరైడ్లు, గ్లూకోజ్‌ తగ్గిపోతాయి. కాళ్లు లాగడం, ఒంటి నొప్పులు వస్తాయి.
 
కనీస స్థాయి తగ్గకుండా..
బరువు తగ్గడానికి కొందరు మరీ తక్కువగా ఆహారం తీసుకుంటూ, విపరీతంగా వ్యాయామం చేస్తారు. దీనివల్ల శరీరంలో గ్లూకోజ్‌ పరిమాణం పడిపోతుంది. రక్తహీనత ఏర్పడుతుంది. ఏ కాస్త జబ్బు చేసినా గ్లూకోజ్‌, రక్తం ఎక్కించవలసిన అవసరం ఏర్పడుతుంది. నరాలు బలహీనమవుతాయి. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గిపోతాయి. నిద్రలేమి ఏర్పడుతుంది. కాళ్లూ చేతుల్లో తిమ్మిర్లు, నొప్పులు తలెత్తుతాయి. మొత్తంగా జీవనసామర్థ్యమే తగ్గిపోతుంది. ఎవరైనా చాలా వేగంగా బరువు తగ్గిపోవాలనుకోవడం ప్రమాదకరం. 15 రోజులకు 500 గ్రాముల కన్నా బరువు తగ్గకూడదు. వ్యక్తి ఎత్తును అనుసరించి అతని బరువు ఉండాలి. ప్రతి అడుగు ఎత్తుకూ పదికిలోల బరువు ఉండడం ఆరోగ్యరీత్యా సరియైనది. ఉదాహరణకు 6 అడుగుల వ్యక్తి 60 కి లోల బరువు ఉండాల్సిందే.
 
ఆహారం... వ్యాయామం
స్థూలకాయం తగ్గడమన్నది దాదాపు 60 శాతం ఆహార, వ్యాయామాల మీదే ఆధారపడి ఉంటుంది. మందుల ప్రభావం మిగతా 40 శాతం మాత్రమే. ఇతర వైద్య విధానాల్లో కొందరు ఆకలి తగ్గిపోయే మందులు కూడా ఇస్తారు. తీసుకునే ఆహారం తగ్గిపోవడం వల్ల బరువు తగ్గిపోవచ్చు. కానీ ఈ విధానం వల్ల కొంతకాలం తరువాత కొత్త సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఆకలి తగ్గించడం కాకుండా, కొవ్వు శరీరంలో ఇమడకుండా చేసే మందులకు హోమియో ప్రాధాన్యమిస్తుంది. శరీరంలో నిలబడలేని కొవ్వు, విసర్జన ద్వారా బయటికి వెళ్లిపోతుంది. ఫైటోలక్కాబర్రి, ఫ్యూకస్‌ వంటి మందులు ఇలా పనిచేస్తాయి. స్థూలకాయ నియంత్రణలో ఆహారం, వ్యాయామం, వైద్యచికిత్స- ఈ మూడింటికీ సమాన ప్రాధాన్యం ఉంది. అందుకే వైద్య చికిత్స తీసుకుంటూనే అవసరమైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చె య్యాలి. అప్పుడే స్థూలకాయాన్ని విజయవంతంగా తగ్గించవచ్చు.
 
థైరాయిడ్‌ చికిత్సలు
థైరాయిడ్‌ గ్రంథి హార్మోన్లను సరిగా ఉత్పత్తి చేయలేనప్పుడు స్థూలకాయం వచ్చేస్తుంది. దీనికి వైద్య చికిత్సలే పరిష్కారం. హోమియోలో హార్మోన్‌ లోపాలను సవరించడానికి కృత్రిమంగా హార్మోన్‌ మాత్రలు ఇవ్వడం ఉండదు. హార్మోన్లను ఉత్పత్తి చేసేలా థైరాయిడ్‌ గ్రంథిని చైతన్యపరిచే మందులు ఇస్తాం. గర్భాశయం తొలగించిన కొంత మంది స్త్రీలలో కూడా హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది కూడా స్థూలకాయానికి దారితీస్తుంది. అందుకే తిరిగి ఆ సమతుల్యతను నిలబెట్టే వైద్య చికిత్సలు తీసుకోవాలి. సిబియా వంటి మందులు ఈ విషయంలో బాగా పనిచేస్తాయి. కాకపోతే ఈ మందులను హోమియో వైద్యుల పరిరక్షణలోనే తీసుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com