అమెరికాలోని వర్జీనియాలో తీవ్ర ఉద్రిక్తత

- August 13, 2017 , by Maagulf
అమెరికాలోని వర్జీనియాలో తీవ్ర ఉద్రిక్తత

అమెరికా శ్వేత జాతీయవాదుల నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 19 మంది గాయపడ్డారు. శ్వేతజాతీయవాదులతోపాటు వారిని వ్యతిరేకించే వారి మధ్య జరిగిన ఘర్షణలతో వర్జీనియా రాష్ట్రంలోని చార్లెట్స్‌ విల్‌ దద్దరిల్లింది. తీవ్ర దుమారానికి కారణమైన ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్‌తోపాటు ఆ దేశానికి చెందిన పలువురు ప్రముఖ నేతలు తీవ్రంగా ఖండించారు.

అమెరికా అంతర్‌యుద్ధం సమయంలో సమాఖ్య సైన్యంలో కమాండర్‌గా పనిచేసిన వ్యక్తి విగ్రహాన్ని తొలగించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వర్జీనియాలో చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. సమాఖ్య సైన్యానికి ఉత్తర వర్జీనియా కమాండర్‌గా పనిచేసిన రాబర్ట్‌ లీవ్‌ విగ్రహాన్ని చార్లెట్స్‌ వీల్‌ పార్కు నుంచి తొలగించాలని అక్కడి యంత్రాంగం ఇటీవల నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శ్వేతజాతీయవాదులు 'యునైట్‌ద రైట్‌ ' పేరిట భారీ ప్రదర్శన చేపట్టారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన వేలాది మంది వర్జీనియాకు 256 కిలోమీటర్ల దూరంలో ఉన్న చార్లెట్స్‌ వీల్‌ పట్టణానికి చేరుకున్నారు. అదే సమయంలో శ్వేతజాతీయుల నిరసనను వ్యతిరేకిస్తూ మరోవర్గం ఆందోళనకు దిగింది. ఫలితంగా రెండు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడగా అనేక మంది గాయపడ్డారు. శ్వేతజాతీయ వాదుల నిరసన హింసాత్మకంగా మారడంతో వర్జీనియా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శాంతి భద్రతల పునరుద్ధరణకు వీలుగా అత్యవసర పరిస్థితి ప్రకటించింది. చార్లెట్స్‌ వీల్‌లో పెద్దఎత్తున పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరించింది.

ఘర్షణలు తగ్గుముఖం పట్టే సమయానికి మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పట్టణం నడిబొడ్డున శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న ఆందోళనకారులపై ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయింది. కారు ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా.. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. చార్లెట్స్‌ వీల్‌ ఘర్షణలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ శాంతి భద్రతల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com