రేపటి స్వాతంత్రదినోత్సవ వేడుకలకు ముస్తాబవుతోన్న భారతావని

- August 14, 2017 , by Maagulf
రేపటి స్వాతంత్రదినోత్సవ వేడుకలకు ముస్తాబవుతోన్న భారతావని

స్వాతంత్రదినోత్సవ వేడుకలకు భారతావని ముస్తాబవుతోంది. వాడవాడలా మువ్వెన్నెల జెండాలు ఎగురవేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఎర్రకోటలో ఆర్మీ, పోలీస్ దళాల రిహార్సల్స్ అదరగొడుతున్నాయి. ఏపీ సర్కార్ తొలిసారిగా నిర్వహిస్తున్న పంద్రాగస్టు వేడుకలకు ఆధ్యాత్మిక నగరం తిరుపతి సిద్దమైంది.ఇటు హైదరాబాద్‌ గోల్కొండలోనూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వర్షాలతో వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
దేశరాజధాని ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ సంబరం మొదలైపోయింది. జెండా పండుగ ఏర్పాట్లు అదరహో అనిపించేలా ఉన్నాయి. ప్రధాని మోడీ జెండా ఎగరవేయనున్న ఎర్రకోట దగ్గర  ఆర్మీ, పోలీసు దళాలు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించాయి.స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో ట్రాఫిక్  ఆంక్షలు  విధించారు. 
ఆధ్యాత్మిక నగరం తిరుపతి స్వాతంత్ర వేడుకలకు అందంగా ముస్తాబైంది. ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది తిరుపతిలో వేడుకలు నిర్వహిస్తుండడంతో..అందుకు తారకరామ స్పోర్ట్స్ పెవిలియన్‌ను సిద్ధం చేశారు. మొత్తం 5850 మంది కూర్చునేలా గ్యాలరీలు రూపొందించారు. వేడుకల్లో ఈసారి వినూత్న కార్యక్రమాలు చేపట్టింది ఏపీ సర్కార్. పోలీసు బెటాలియన్  సిబ్బంది బైక్‌లతో విన్యాసం చేయనున్నారు. తొలిసారి కవాతులో మాజీ సైనికులు పాల్గొననున్నారు. ప్రదర్శన ఇచ్చే 12 శకటాలు నగర వీధుల్లో  కనువిందు చేయనున్నాయి. యావత్తు దేశ ప్రజలకు శ్రీవారి ఆశీర్వచనం ఉండేలా శకటాన్ని రూపొందించారు.వర్షం వస్తే తడవకుండా ఉండేందుకు షామియానాలను ఏర్పాటు చేశారు. తారకరామా స్టేడియానికి చుట్టూ భారీ భద్రత కల్పిస్తున్నారు. నగరానికి వచ్చే ఆరు ప్రాంతాల్లో సాయుధ బలగాలతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లతో గోల్కొండ కోట వెలిగిపోతోంది. జెండా ఆవిష్కరణకు ముందు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల రిహార్సల్ ఉత్సాహంగా జరుగుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు కోటలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com