నరాల్లో నిప్పు

- August 25, 2017 , by Maagulf

ఉసూరంటు కూర్చుంటే

వచ్చేదేముంటుంది
వృద్ధాప్యం తప్ప;

ఇంకొంచెం ఆగితే
ఒరిగేదేముంటుంది
మరణం తప్ప;

నివురుగప్పిన నిప్పుని
ఉఫ్ అని ఊది పలకరిస్తే
జ్వాలగా తల ఎత్తి
రవ్వలు విదిలిస్తుంది;

మనిషి నరాల్లోనూ నిప్పుంటుంది;
గుండె కొలిమిని మండించి
మనసు ఉఫ్ అని ఊదితే చాలు-
నిప్పు రాజుకుంటుంది;
తానే రాజునంటుంది.

ఇక అంతే- 
నిరాశ, నిట్టూర్పు
నిస్తేజం, నిర్వేదం
అన్నింటినీ 
ఖడ్గంతో ఖండిస్తుంది.

ఉత్సాహమనే కోట కట్టుకుని 
ఉల్లాసమనే సింహాసనం ఎక్కి
ఆనందమనే మీసాన్ని మెలేస్తూ
జీవనసామ్రాజ్యాన్ని ఏలేస్తుంది.

-సిరాశ్రీ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com