హైదరాబాద్ లో ఈ నెల 5న గణేష్‌ నిమజ్జనం.. జీహెచ్‌ఎంసీ విస్తృత ఏర్పాట్లు

- August 31, 2017 , by Maagulf
హైదరాబాద్ లో ఈ నెల 5న గణేష్‌ నిమజ్జనం.. జీహెచ్‌ఎంసీ విస్తృత ఏర్పాట్లు

హైద‌రాబాద్‌లో గణేష్‌ నిమ‌జ్జ‌నానికి జీహెచ్‌ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 5.. అనంత చతుర్ధశి రోజున నిమజ్జనం జరుగుతుందని జీహెచ్ఎంసీ , భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది. గత ఏడాదిలానే.. ఈసారి కూడా  ఖైరతాబాద్ మహా గణపతిని అదే రోజు మధ్యాహ్నం కల్లా  నిమజ్జనo పూర్తి చేస్తామని తెలిపింది.
హైదరాబాద్‌లో గ‌ణేష్ నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మాన్ని ప్ర‌శాంతంగా నిర్వ‌హించ‌డానికి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తోంది జీహెచ్ఎంసీ. అందులో భాగంగా గ్రేటర్ పరిధిలో కొలువై  ఉన్న గణేష్ మండప ఉత్సవ కమిటీలతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై భాగ్యనగర్  గణేష్ ఉత్సవ కమిటి పలు సూచనలు చేసింది. 
సెప్టెంబర్‌ 5న హుస్సేన్‌సాగ‌ర్ వ‌ద్ద గ‌ణేష్ విగ్ర‌హాల‌ నిమ‌జ్జ‌నం సాఫీగా జ‌ర‌గ‌డానికి  ట్యాంక్ బండ్  దగ్గర 38 భారీ  క్రేన్లను, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు ఉండేలా చర్యలు చేపట్టనుంది జీహెచ్ఎంసీ. వినాయక నిమజ్జన శోభా యాత్ర గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో దాదాపు 354 కిలోమీటర్ల మేర సాగనుంది. అందుకోసం బల్దియా  పరిదిలో 168 గణేష్ నిమజ్జనం యాక్షన్ టీం లు...10 వేల మంది శానిటేషన్ కార్మికులు.. 295మంది జవాన్లు... 688 SFA లు పనిచేస్తారని కమిషనర్ తెలిపారు. 
మరోవైపు ఎక్కడికక్కడ వినాయక నిమజ్జనం చేయడానికి గత ఏడాది మొదలు పెట్టిన బేబీ పాండ్స్ నిమజ్జన కొలనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై అనేక విమర్శలు వస్తున్నారు. పూర్తైన వాటిలో సాధ్యం అయినంత మేర నీటిని నింపాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలిచ్చారు మేయర్ బొంతు రామ్మోహన్.
అటు.. ఎల్బీ నగర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు మెట్రో రైలు పనుల వల్ల.. రోడ్లు పాడై పోయాయని.. చాల చోట్ల గుంతలు ఉండటంతో శోభా యాత్ర ఆలస్యం అవుతుందని  భాగ్యనగర్ ఉత్సవ సమితి..  మేయర్, కమిషనర్ దృష్టికి తెచ్చింది. దాదాపు 60 శాతం శోభాయాత్ర మెట్రో మార్గాల్లో ఉన్నందున తగు చర్యలు తీసుకోవాలని కోరింది. కీలకమైన ఈ సమీక్షా సమావేశంలో మెట్రో రైల్ అధికారులు హాజరుకు కాకపోవడంపై అటు భాగ్య నగర్  గణేష్ ఉత్సవ సమితితో పాటు.. మేయర్ అసంతృప్తి వ్యక్తం చేసారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com