హెచ్‌-1బీ వర్క్‌ వీసాల స్వీకరణ ప్రక్రియను పునరుద్ధరించినట్టు అమెరికా ప్రకటించింది

- September 20, 2017 , by Maagulf
హెచ్‌-1బీ వర్క్‌ వీసాల స్వీకరణ ప్రక్రియను పునరుద్ధరించినట్టు అమెరికా ప్రకటించింది

- అమెరికా నిర్ణయంతో ఆనందోత్సాహాల్లో ఐటీ ఉద్యోగులు 
 హెచ్‌-1బీ వర్క్‌ వీసాల స్వీకరణ ప్రక్రియను పునరుద్ధరించినట్టు అమెరికా ప్రకటించింది. భారత్‌ నుంచి వేలాది మంది ఐటీ ప్రొఫెషనల్స్‌ హెచ్‌-1బీ వర్క్‌ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, దరఖాస్తులు అధిక సంఖ్యలో రావడంతో ఏప్రిల్‌లో ఈ ప్రక్రియను నిలిపివేసిన అధికారులు మంగళవారం నుంచి మళ్లీ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పునరుద్ధరించారు. హెచ్‌-1బీ వీసా హోల్డర్లు అమెరికా కంపెనీల్లో పనిచేసుకోవచ్చు. పిటిషనర్ల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు హెచ్‌-1బీ వీసాలు మంజూరు చేస్తారు. 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్‌ వరకు వచ్చిన హెచ్‌-1బీ వీసాలను పున్ణ పరిశీలిస్తున్నామని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌ (యూఎస్‌సీఐఎస్‌) అధికారులు ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 65వేల వీసాలను మంజూరు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో, పాటు యూఎస్‌లో ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న 20వేల దరఖాస్తులను కూడా పరిశీలించనున్నట్టు తెలిపారు. 
యూఎస్‌సీఐఎస్‌ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం... హెచ్‌-1బీ వర్క్‌ వీసా కోసం తత్కాల్‌ స్కీమ్‌ కింద దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు ప్రాసెసింగ్‌ ఫీజు కింద 1,225 డాలర్లు (రూ.78,804) చెల్లించాల్సి ఉంటుంది. యూఎస్‌సీఐఎస్‌ అధికారులు సదరు దరఖాస్తులను 15రోజుల్లో పరిశీలిస్తారు. మూడు నుంచి ఆరు నెలల్లో ప్రాసెసింగ్‌ ప్రక్రియను పూర్తి చేస్తారు. వీసాల మంజూరు ప్రక్రియను 15రోజుల్లోగా పూర్తి చేయలేకపోయినట్టయితే దరఖాస్తుదారుడు చెల్లించిన ప్రాసెసింగ్‌ ఫీజును తిరిగి చెల్లిస్తామని యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించింది. కొత్త దరఖాస్తులను ఇప్పట్లో స్వీకరించబోమని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com