మితిమీరిన అభిమానంతో హీరో శ్రీకాంత్ పై దాడి

- September 23, 2017 , by Maagulf
మితిమీరిన అభిమానంతో హీరో శ్రీకాంత్ పై దాడి

హైదరాబాద్‌: హీరో శ్రీకాంత్ ఇంట్లోకి చొరబడిన ఓ సైకో, తనలో మరో వ్యక్తి ఉన్నాడంటూ వీరంగం చేశాడు. శ్రీకాంత్ పై దాడికి దిగి కలకలం సృష్టించాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తెలిపిన మరిన్ని వివరాల ప్రకారం, కర్నూలు జిల్లాకు చెందిన బీ వెంకటేశ్ (29) పలువురు ప్రముఖుల ఇళ్లలో వంట మనిషిగా పనిచేశాడు. వెంకటేశ్ కు శ్రీకాంత్ అంటే చాలా అభిమానం. మూడేళ్ల క్రితం ఆయన ఇంట్లో కూడా కొంతకాలం పనిచేశాడు. అయితే, పనితీరు బాగోలేకపోవడం, సైకోలా ఉండటంతో తొలగించారు. ఇక శ్రీకాంత్ తనకు తరచూ కలలోకి వస్తున్నాడని, ఎన్నిమార్లు కలిసేందుకు వెళ్లినా అనుమతించడం లేదని చెబుతూ, నిన్న శ్రీకాంత్ ఇంట్లోకి ప్రవేశించాడు. వాచ్ మెన్ అడ్డుకోవడంతో అతన్ని కొట్టి, అక్కడున్న ఏపీ 10 ఏఎస్ 0789, ఏపీ 09 సీఎల్ 9414 కార్లను ధ్వంసం చేశాడు. 


కారు డ్రైవర్ పై దాడి చేసి, శ్రీకాంత్ బెడ్ రూమ్ వైపు పరుగు తీశాడు. ఆ సమయంలో మేడ దిగి వస్తున్న శ్రీకాంత్ ను మెడపట్టి మెట్లపై నుంచి తోశాడు. తృటిలో శ్రీకాంత్ కు ప్రమాదం తప్పింది. ఈ సమయంలో శ్రీకాంత్ భార్య ఊహ, వారి పిల్లలు ఇంట్లో లేరు. ఆపై సమాచారం అందుకున్న పోలీసులు, అరెస్ట్ చేసేందుకు వెళ్లగా వారిపైనా దాడికి ప్రయత్నించాడు. కష్టం మీద అతన్ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. పోలీసులు విచారించగా, తనలోని మరో వ్యక్తిని శ్రీకాంత్ స్వయంగా పిలిచాడని, అసలు వెంకటేశ్ ఈ పని చేయలేదని చెప్పడంతో పోలీసులు తలపట్టుకున్నారు. మితిమీరిన అభిమానంతో అతను సైకోలా మారి ఈ పని చేశాడని చెప్పిన పోలీసులు, అతనిపై క్రిమినల్ కేసులు పెట్టినట్టు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com