పరస్పర అంగీకారంతోనే వేరు బాట

- October 02, 2017 , by Maagulf
పరస్పర అంగీకారంతోనే వేరు బాట

పరస్పర అంగీకారంతోనే వేరు బాట. న్యాయపరమైన చిక్కులు, నియంత్రణ సంస్థల ఇబ్బందులే కారణం.


దిల్లీ..దేశీయ టెలికాం రంగంలో అతి పెద్ద ఒప్పందానికి బ్రేక్‌ పడింది. మొబైల్‌ వ్యాపార విలీన ఒప్పందాన్ని టెలికాం సంస్థలు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, ఎయిర్‌సెల్‌లు రద్దు చేసుకున్నాయి. ఎయిర్‌సెల్‌తో విలీన ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ (ఆర్‌కామ్‌) ప్రకటించింది. ఎయిర్‌సెల్‌ను ఆర్‌కామ్‌ విలీనం చేసుకోవడం ద్వారా రూ.65,000 కోట్లకు పైగా విలువ కలిగిన సంస్థను ఏర్పాటు చేయడానికి ఇరు సంస్థలు గతేడాది సెప్టెంబరులో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే న్యాయపరమైన చిక్కులకు తోడు నియంత్రణ సంస్థలు విధాన పరమైన అనిశ్చితితో వ్యవహరించడం, తమ ఒప్పందం రద్దుకు కారణాలుగా పేర్కొంది. ప్రతిపాదిత లావాదేవీకి అనుమతులు లభించడంలో జాప్యం కూడా ఒక కారణమేనని ఆర్‌కామ్‌ స్పష్టం చేసింది. 'భారత టెలికాం రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది. ప్రభుత్వ విధానాల వల్ల ఈ రంగ సంస్థలకు బ్యాంకులు ఇచ్చే రుణాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అంతే కాకుండా పరిశ్రమ రూపురేఖలు గణనీయంగా మారిపోయాయి. ముందు చెప్పిన కారణాలతో పాటు ఈ అంశాల వల్లా, విలీన ఒప్పందం రద్దు చేసుకున్నాం. కంపెనీ బోర్డు కూడా ఇందుకు ఆమోదం తెలిపింది' అని ఆర్‌కామ్‌ వెల్లడించింది.


ఏం చేయనుందంటే.. ఎయిర్‌సెల్‌తో విలీనం పూర్తి చేయడం, బ్రూక్‌ఫీల్డ్‌కు టవర్ల వ్యాపారాన్ని విక్రయించడం ద్వారా సంస్థ రుణాన్ని భారీగా తగ్గించుకోవాలని ఆర్‌కామ్‌ భావించింది. అయితే ఎయిర్‌సెల్‌తో ఒప్పందం రద్దు నేపథ్యంలో, ఆదివారం సమావేశమైన ఆర్‌కామ్‌ డైరెక్టర్ల బోర్డు తాజా దిద్దుబాటు చర్యలను సమీక్షించడంతో పాటు రుణాన్ని తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలపై దృష్టి పెట్టింది. స్పెక్ట్రమ్‌ పోర్ట్‌ఫోలియో, 4జీపై అధికంగా దృష్టి పెట్టడం వంటి వాటి ద్వారా తమ మొబైల్‌ వ్యాపార వృద్ధికి ప్రత్యామ్నాయ ప్రణాళికను పరిశీలిస్తామని వెల్లడించింది. టవర్లు, ఫైబర్‌ ఆస్తులతో పాటు స్థిరాస్తి వ్యాపార విక్రయం ద్వారా రూ.25,000 కోట్ల వరకు రుణాన్ని తగ్గించుకోగలమని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కంపెనీ చేతిలో 800/900/1800/2100 మెగాహెర్ట్జ్‌ల బ్యాండ్‌లలో ఉన్న స్పెక్ట్రమ్‌ విలువ దాదాపు రూ.19,000 కోట్లకు పైగా ఉంటుంది. అదనంగా స్థిరాస్తి ఆస్తుల విక్రయంలో కంపెనీ మంచి పురోగతి సాధించింది. ధీరుభాయ్‌ అంబానీ నాలెడ్జ్‌ సిటీ (అంచనా విలువ రూ.10,000 కోట్లు), నవీ ముంబయి సమీపంలో 125 ఎకరాలు, దిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ సమీపంలో విలువైన స్థలాలను విక్రయానికి పెట్టింది. వీటి విలువను సైతం లెక్కగట్టే ప్రక్రియ మొదలుపెట్టింది. గత నెలలో ఆర్‌కామ్‌పై ఎరిక్‌సన్‌ ఇండియా దివాలా స్మృతి కింద రూ.491.41 కోట్లు రాబట్టడానికి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వ్యూహాత్మక రుణ పునర్‌వ్యవస్థీకరణ (ఎస్‌డీఆర్‌) ప్రణాళిక ప్రకారం.. ఆర్‌కామ్‌ రుణాల చెల్లింపునకు ఈ ఏడాది డిసెంబరు వరకు గడువు ఉంది. కంపెనీ రుణభారం ప్రస్తుతం దాదాపు రూ.46,000 కోట్ల వరకు ఉంది.


ఆది నుంచి ఇబ్బందులే: ఎయిర్‌సెల్‌, ఆర్‌కామ్‌ విలీనానికి ఆది నుంచి ఇబ్బందులే ఎదురయ్యాయి. ఆర్‌కామ్‌ మూడు ప్రధాన రుణదాతలైన చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీ ఈ విలీనాన్ని తొలుత వ్యతిరేకించినా, తరవాత ఆమోదం తెలిపాయి. అయితే ఇండస్‌ టవర్స్‌, ఎరిక్‌సన్‌, డాట్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, జీటీఎల్‌ ఇన్‌ఫ్రాకు చెందిన చెన్నై నెట్‌వర్క్‌లు తమ బకాయిలను ముందుగా చెల్లించాలని పట్టుబట్టాయి. ఇదే సమయంలో ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ 2జీ స్పెక్ట్రం కేసులో ఆర్‌కామ్‌కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. మలేషియాకు చెందిన మాక్సిస్‌ నుంచి 2జీ లైసెన్సును మరో టెలికాం కంపెనీకి బదిలీ చేయడాన్ని తప్పుబట్టింది. ఈ క్రమంలోనే ఎయిర్‌సెల్‌, ఆర్‌కామ్‌ విలీన ఒప్పందం రద్దైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com