మొబైల్ నేలకేసి కొట్టాడని ఆగ్రహించి భారతీయ వడ్రంగిని హత్య చేసిన ఓ వ్యక్తి

- October 20, 2017 , by Maagulf
మొబైల్ నేలకేసి కొట్టాడని ఆగ్రహించి భారతీయ వడ్రంగిని  హత్య చేసిన ఓ వ్యక్తి

దుబాయ్: ' అనవసరమైన పట్టుదలలు పంతాలు కొన్ని సందర్భాలలో ప్రాణాలు సైతం పోతాయని తెలియచెప్పే వార్త ఇది '  బతుకుతెరువు కోసం వడ్రంగి కార్మికుడిగా పనిచేసేందుకు దుబాయ్ కు  వెళ్లిన ఓ భారతీయుడు విషాదకరమైన రీతిలో హత్య చేయబడ్డాడు . యూఏఈలోని దుబాయ్ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి సంబంధించిన వివరాల ప్రకారం  దుబాయ్ నగరంలోని దుబాయ్ ఇన్వెస్ట్‌మెంట్ పార్క్ సమీపంలో ఓ వ్యక్తి తన గుర్తింపుకార్డును పొగొట్టుకున్నాడు. రాత్రి సమయం కావడంతో తన సెల్‌ఫోన్ టార్చిలైట్ వేసి స్నేహితుల సహాయంతో గుర్తింపు కార్డును వెతకడం మొదలుపెట్టాడు. కార్డు కోసం వెతుకుతుండగా వారిపక్కనే 28 ఏళ్ల వయసున్న భారతీయ యువకుడు నిద్రిస్తున్నాడు. నీ మొబైల్ టార్చిలైట్ కాంతి నా కళ్లపై పడుతోందని, నిద్రచెడగొట్టొద్దని, లైట్‌ను ఆపివేయాలని  కోరాడు. లైట్ ఆపివేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో భారతీయ యువకుడు ఆ వ్యక్తి  సెల్‌ఫోన్‌ను లాక్కొని నేలకేసి కొట్టాడు. సెల్‌ఫోన్ పగిలిపోయింది. ఈ విషయంపై ఇరువురు మధ్య తీవ్ర వివాదం జరిగింది. సెల్‌ఫోన్‌ను కొనిస్తానని హామీ ఇవ్వడంతో అందరూ అక్కడి నుంచి వెనుదిరిగారు. కొంతదూరం నడిచిన తర్వాత ఓ ఇనుప రాడ్‌ను తీసుకొని వచ్చిన ఆ  వ్యక్తి.. తన సెల్‌ఫోన్‌ను పగులగొట్టిన భారతీయ యువకుడిన విచక్షిణా రహితంగా కొట్టాడు. తల, గొంతుపై గాయాల కారణంగా తీవ్రరక్తస్రావమవ్వడంతో అక్కడిక్కడే భారతీయ యువకుడు మృతిచెందాడు. తెల్లవారుజామున  సమచారం అందుకున్న పోలీసులు హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమేరాలను పరిశీలించగా విషయం తేలిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. జూన్ 27న జరిగిన ఈ ఘటనపై కోర్టు తుదితీర్పు వెల్లడించాల్సి ఉంది. నిందితుడి వాదన మాత్రం మరోలా ఉంది. తాను ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేయలేదని అనుకోకుండా అలా జరిగిపోయిందని  కోర్టులో నిందితుడు చెప్పాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com