ఇజ్రాయిల్‌ కేంద్రంగా అక్రమ ఆయుధ వ్యాపారం

- October 23, 2017 , by Maagulf
ఇజ్రాయిల్‌ కేంద్రంగా అక్రమ ఆయుధ వ్యాపారం

 ప్రజలను ఊచకోత కోస్తూ, మారణకాండకు పాల్పడుతున్న దుష్ట దేశాలకు ఆయుధాలను, ఆయుధ శిక్షణను అందచేసే చరిత్ర వున్న ఇజ్రాయిల్‌ను ఎండగట్టేందుకు మానవహక్కుల ఉద్యమ కార్యకర్తలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అమెరికా, ఐరోపాలు విధించిన నిషేధాన్ని ధిక్కరిస్తూ ఇజ్రాయిల్‌ మయన్మార్‌కు ఆయుధాలను సరఫరా చేస్తున్న తీరు టీవీ ఛానళ్ల ద్వారా వెలుగులోకి రావటం వీరి ప్రయత్నాలకు మరింత ఊతమిస్తోంది. రోహింగ్యాల ఊచకోతలను ' ఒక జాతి నిర్మూలనకు చేపట్టే దురాగతాలకు ఇది సాక్ష్యం' వంటిదని ఐరాస విమర్శించింది. మయన్మార్‌ సైన్యం తమ సరిహద్దుల్లోని రఖినే రాష్ట్రంలో రోహింగ్యా ముస్లింలపై కొనసాగిస్తున్న అత్యాచారాలు, దౌర్జన్యాలు నేపథ్యంలో వందల, వేల మంది రోహింగ్యాలు ఇటీవలి కాలంలో పొరుగునే వున్న బంగ్లాదేశ్‌కు వలస బాట పట్టిన విషయం తెలిసిందే. మయన్మార్‌ సైనిక ప్రభుత్వంతో కొనసాగిస్తున్న సంబంధాలను ఇజ్రాయిల్‌ బయటపెట్టనప్పటికీ అది ఆ దేశానికి సాయుధ పెట్రోలింగ్‌ బోట్లు, గన్‌లు, నిఘా పరికరాలను విక్రయిస్తున్నదన్న విషయాన్ని ప్రభుత్వ రికార్డులు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు మయన్మార్‌ ప్రత్యేక దళాలకు ఇజ్రాయిల్‌ సాయుధ శిక్షణను కూడా అందిస్తోంది. మయన్మార్‌కు ఆయుధ శిక్షణను తక్షణమే నిలిపివేయాలంటూ మానవ హక్కుల సంస్థలు ఈ నెల 30న ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌ ముందు నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. 2013లో దక్షిణ సూడాన్‌లో అంతర్యుద్ధం ప్రారంభమైన నాటినుండి అక్కడి ఉగ్రవాద ముఠాలకు ఇజ్రాయిలీ సంస్థలు ఆయుధాలు, నిఘా పరికరాలను విక్రయిస్తున్న విషయాన్ని అమెరికా, ఐరోపాలు బయటపెట్టటంతో ఆ సంస్థలు ఈ దేశాలతో సంబంధాలను తెగతెంపులు చేసుకున్నాయి.

మయన్మార్‌, ద.సూడాన్‌ వంటి దేశాలతో ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న ఆయుధ వ్యాపార గుట్టును రట్టు చేసేందుకు ఈటె మాక్‌ అనే మానవ హక్కుల న్యాయవాది ఇజ్రాయిలీ కోర్టులలో అనేక పిటిషన్లు వేశారు. జనహననానికి ఉపయోగించే ఈ ఆయుధాల వ్యాపారంతో ప్రమేయం వున్న అధికారులు, కాంట్రాక్టర్లపై యుద్ధ నేరాభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. పశ్చిమ దేశాలకు చెందిన అనేక సంస్థలు ఆయుధాలు విక్రయిస్తుంటాయని, అయితే ఇజ్రాయిల్‌ మాత్రం మానవాళికి వ్యతిరేకంగా నేరాలు, యుద్ధ నేరాలు జరిగే దేశాలకు మాత్రమే విక్రయిస్తూ విశిష్టతను సంపాదించుకుందని, ప్రస్తుతం అదే మనం చూస్తున్న పరిస్థితి అని ఆయన ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఆయుధాలు విక్రయించే సంస్థలు, దీనితో సంబంధం వున్న అధికారులను ఇందుకు బాధ్యులను చేయాలని లేకుంటే ఈ యుద్ధ నేరాలకు అంతూ, అదుపూ వుండదని ఆయన అన్నారు.

ప్రస్తుతం మయన్మార్‌, ద.సూడాన్‌లలో హింసకు తన ఆయుధ సరఫరాలతో ఆజ్యం పోస్తున్న ఇజ్రాయిల్‌ గతంలో కూడా రువాండా, బాల్కన్స్‌, చిలీ, అర్జెంటీనా, శ్రీలంక, హైతీ, ఎల్‌ సాల్వడార్‌, నికరాగువా వంటి దేశాలలో కూడా చిచ్చు పెట్టిందన్న విమర్శలు ఎదుర్కొంటోందని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com