మా ఊరి పండుగ

- November 08, 2015 , by Maagulf


ఇగ ఇప్పుడు అక్కడ గరం గరం జిలేబితో తీపిని, 
కంచుట్లల్ల కాలుస్తూ.. నోట్లే నీళ్ళురిస్తూ  
చిరు చిరు కారంతో మిక్షర్ పొట్లాలను పాత పేపర్లల్ల కట్టిస్తూ 
తోపుడు బల్ల కూనపుల్లోల్లు....
గుర్రం,ఏనుగు,పులి బొమ్మలతో యువలోకాన్ని ఆకర్షిస్తూ
పదికి ఇరువై, నూటికి ఇన్నూరు అని అరుసుకుంట
లక్కీమూటల ఆటగాళ్ళు" 
చిట్టి పొట్టి బుడుగుల్ని రంగుల లోకంలోకి తీస్కపోయే 
ప్లాస్టిక్ బొమ్మల దుకానాలు .. తొవ్వకిరువైపుల
పెద్దోల్ల పూజలు.. పంతుల్ల అదిలింపు కోపాల నడుమ 
సాగే హోమాలు ..ఆడోల్ల కుంకుమ పూజలు అయ్యవారి హరికథ.. 
అన్నా..గా ఉప్పు అందుకోయ్యే" అని ఒకల్లు.. అన్నం పొంగుతుందో 
లేదో గొంత సూడేబావ"అని ఇంకొకల్లు,,పొగలెల్తున్న అన్నదానం.. 
పొయ్యిల కాడ, శ్రమ దానం చేసే మా ఊరి పేరెల్లిన వంటన్నల ప్రేమలు  
మందిరపు గోడవతల సాగే వంటకాలు 
ఆకలిని పెంచే ఘుమ ఘుమల వాసనలు
బైకుల మీద రయ్యు రయ్యు మంటూ తిరిగే 
మీసం మొలవని పిల్లగాండ్లు.. ముసి ముసి 
నవ్వులు లేడి కళ్ళ లంగా ఓణి అమ్మాయిలు.. 
అదొక కనుల విందైన కళ్యాణం 
విధాతను విగ్రహంగా మార్చుకొని 
అపురూపంగా అరాదించే అలుపెరుగని 
అద్భుత విన్యాసం 
జగన్మాతలతో జత కట్టించి ఆ స్వామికి ఊరు మొత్తం 
మూకుమ్మడి "సావ" అనే ఉయ్యాలగా మార్చి 
తమ కోరికల గుర్రాల కళ్ళేలలను అదుపుచేయలేక 
అమాయక జనం, జగన్నాథున్ని తమ భుజాలపై మోస్తూ ..
గోవిందా..గోవిందా.. వెంకట రమణ గోవింద అంటూ 
ఊరు ఊరంతా ఉత్చాహంగా తిరుగు ఆనంద హేల 
అదే అదే జాతరమ్మ జాతర మూడురోజుల జాతర 
ముచ్చటైన జాతర మా ఊరి .. జాతర..
రాత్రిళ్ళు రకరకాల డాన్సుల విన్యాసాలతో ,,జానపద 
గానాలతో కామెడి ఘట్టాలతో పిల్లా జెల్ల ,,ముసలి ముతక మొకాల మీద 
నిగ నిగ నిండుగా మురిపెంగా మెరిసి సంబురంగా ముగిసే .. 
మా ఊరి వేంకటేశుని కళ్యాణ మహోత్చవ జాతర .. ఊరంతా పండుగ" 
మా ఊరి దేవుని "లగ్గానికి" అందరు రాండ్రి మరిసి పోకుండా,,

 

--జయ రెడ్డి బోడ(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com