నవ్యాంధ్ర రాజధాని తొలి ధర..చ.అడుగు 5,500!
- November 06, 2017
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తొలి అమ్మకం ఆఫర్ వచ్చింది. చదరపు అడుగు సుమారు రూ.5,500. కేవలం ప్రవాసాంధ్రులకు మాత్రమే ఇది పరిమితం. అయినా తీవ్ర పోటీ నెలకొంది. అమ్మేందుకు ఉన్న నిర్మాణ స్థలం కంటే మూడున్నర రెట్ల మంది కొనేందుకు పోటీపడుతుండడం గమనార్హం. ప్రవాసాంధ్రుల కోసం ఐకానిక్ భవనాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రవాసాంధ్రుల సంఘం (ఏపీఎన్ఆర్టీ)కి ఐదెకరాల భూమి ఇచ్చింది. విద్యాసంస్థలకు, ఇతరులకు ఎకరా రూ.50 లక్షల చొప్పున ఇచ్చినా.. ఏపీఎన్ఆర్టీ మాత్రం సామాజిక బాధ్యతగా ఎకరానికి రూ.2 కోట్లకు ఆ భూమిని తీసుకుంది. ప్రభుత్వాన్ని ఒక్క రూపాయి అడగకుండా.. సొంతంగా నిధులు సమకూర్చుకుని ‘ఎన్ఆర్టీ ఐకాన్’ పేరిట ఈ భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. జనవరి ఒకటో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి శంకుస్థాపన చేయనున్నారు. 33 అంతస్తుల్లో 10 లక్షల చదరపు అడుగులను నిర్మించనున్నారు. దీనిలో కొంత భాగాన్ని ప్రవాసాంధ్రులకు అమ్మనున్నారు.
ఈ భవనంలో కొన్ని అంతస్తుల్లో 120 సూట్లు నిర్మిస్తారు. ఒక్కో సూట్ 4,500 చదరపు అడుగులు ఉంటుంది. ఒక్కో దాని ఖరీదు రూ.2.5 కోట్లుగా నిర్ణయించారు. అంటే చదరపు అడుగు ధర సుమారు రూ.5,500. కేవలం ప్రవాసాంధ్రులకే విక్రయిస్తారు. ఈ సూట్లో ఆఫీసు కార్యాలయం పెట్టుకోవచ్చు. లేదంటే నివాసం ఉండొచ్చు. ఇందులో 70 వరకు ఆఫీసు కార్యాలయాలుగా అమ్మితే.. మిగతావి రెసిడెన్షియల్‌గా ఇవ్వాలని భావిస్తున్నారు. మొత్తంగా 120 ఉంటే.. ఇప్పటికే 400 మంది వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. తమకివ్వాలంటే తమకు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇలా అమ్మగా వచ్చే రూ.300 కోట్లతోనే ఎన్ఆర్టీ ఐకాన్ భవనాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఆఫీసు స్థలాల కోసం 70 సూట్లను ఐటీ సంస్థలు కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది. ఒక్కో కంపెనీలో 80-100 మంది చొప్పున సుమారు ఐదు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారని అంచనా. ఈ భవనాన్ని 14నుంచి 18 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మరో ప్రపంచం..
ప్రపంచంలో ఉన్న అత్యంత ఆకర్షణీయ రిటైల్ స్టోర్స్ ఇందులో ఉంటాయి. ఈఫిల్ టవర్లాంటి ఐకానిక్ నిర్మాణాల నమూనాలు, వాటి చరిత్రలు ఒక అంతస్తులో ఉంటాయి. 33 అంతస్తుల్లో ఎక్కడున్నా కింద భూమిమీదే ఉన్నట్లుగా ప్రతి అంతస్తులో మొక్కలు, కిచెన్ గార్డెన్స్ ఉంటాయి. అదే సమయంలో భవనం ముందు భాగంలో పెద్ద పెద్ద ఎల్ఈడీ స్ర్కీన్లు ఉంటాయి. ఆ భవనంలో జరిగే కార్యక్రమాలు, ఎవరైనా జన్మదినం లాంటివి చేసుకుంటే వారికి శుభాకాంక్షలు తెలపడం, వాణిజ్య ప్రకటనలు, ఏపీ రాజధాని గురించిన విశేషాలు, ఇతర ఆసక్తికర అంశాలు ఈ స్ర్కీన్లపై వస్తుంటాయి. ఈ భవనమంతా సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. అంటే వర్షం పడితే ఆ వర్షపు నీటితోనే భవనం శుభ్రపడేలా ఉంటుంది. సెల్ఫ్క్లీనింగ్ పెయింట్‌ను ఈ భవనం పైన ఒక కోట్ వేస్తారు. అదే సమయంలో ఈ భవనం సముదాయంలో పడిన ప్రతి చుక్క వర్షపు నీటిని, వాడిన నీటిని రీసైక్లింగ్ చేసి మళ్లీ ఉపయోగిస్తారు. సాధారణ ఏసీ ఖర్చులో సగమే ఈ భవనంలో వస్తుంది. విద్యుత్‌ను అతి తక్కువగా వాడేలా.. అత్యంత వెలుతురు, చల్లదనం ఉండేలా భవన నిర్మాణం ఉండడమే దీనికి కారణం. ప్లాటినం గ్రీన్ బిల్డింగ్‌గా దీనికి గుర్తింపు దక్కనుంది. రాజధాని డిజైన్ల ఏజెన్సీగా ఉండేందుకు పోటీపడిన దక్షిణ కొరియాకు చెందిన స్పేస్ గ్రూప్ అనే సంస్థ ఈ భవనానికి డిజైన్లు సిద్ధం చేసింది. అమరావతి నగరాన్ని ప్రతిబింబించేలా ఆంగ్లంలో ‘ఏ’ అన్న అక్షరం ఆకారంలో ఈ భవనం ఉంటుంది. భవనం మధ్యలో ఒక గ్లోబ్ నిరంతరం తిరుగుతుంటుంది.
మరోవైపు ఈ భవనంలోనే ఒక అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది. మూడు వేలమంది ప్రతినిధులు కూర్చునేలా సౌకర్యాలుంటాయి. అదే సమయంలో ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేకంగా సూపర్ ఎన్ఆర్ఐ క్లబ్ ఒకటి నిర్మిస్తారు. భవనంలో అడుగుపెడితే మరో ప్రపంచంలో ఉన్నామా అనిపించేటట్లు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని తెలిసింది.
ఎవరు అమరావతికి వచ్చినా ఈ భవనాన్ని సందర్శించి.. ఇక్కడ ఒక సెల్ఫీ దిగేలా నిర్మాణం ఉండాలని నిర్దేశించారు. ఈ భవనంలో ప్రవేశానికి, అందులోని విశేషాలు చూసేందుకు ప్రతి ఒక్కరినీ అనుమతిస్తారు. ఇలాంటి భవనం ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తయ్యేది అమరావతిలోనే అని సమాచారం. దక్షిణ కొరియాలో ఇప్పటికే ఇలాంటి పరిజ్ఞానంతో భవన నిర్మాణం ప్రారంభించినా.. అది పూర్తయ్యేసరికి నాలుగేళ్లు పడుతుందని అంచనా.
సామాజిక బాధ్యతగా చేస్తున్నాం
‘ఈ భవనం ప్రవాస తెలుగువారికి, రాజధానికి గర్వకారణంగా ఉంటూనే.. మరోవైపు సామాజిక బాధ్యతగా కూడా నిలుస్తుంది. ప్రపంచంలో ఎన్నో భవనాలను ఐకానిక్‌గా నిర్మించారు. వాటన్నిటి వెనక సామాజిక కారణం, బాధ్యత ఉండవు. ఈ భవనం మాత్రం తెలుగు రాజధాని అమరావతికి కీర్తి తేవడం, తెలుగు యువతకు ఉద్యోగాలు కల్పించడం, అద్భుత పర్యాటక కేంద్రంగా ఉండేందుకు సామాజిక బాధ్యతగా భావించి నిర్మిస్తున్నాం. అందుకే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అడగకుండా పూర్తిగా ప్రవాసాంధ్రుల సొమ్ముతోనే నిర్మిస్తున్నాం.’
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!