'హిట్‌ రిఫ్రెష్‌'పైనే ప్రసంగమంతా!

- November 07, 2017 , by Maagulf
'హిట్‌ రిఫ్రెష్‌'పైనే ప్రసంగమంతా!

హైదరాబాద్‌: మైక్రోసాఫ్ట్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) సత్య నాదెళ్ల హైదరాబాద్‌లోని కంపెనీ అభివృద్ధి కేంద్రం (ఇండియన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌-ఐడీసీ)లో ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. తన పుస్తకం 'హిట్‌ రిఫ్రెష్‌', అందులోని అంశాలపై సత్య నాదెళ్ల దాదాపు అరగంట సేపు మాట్లాడారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఇక్కడకు వచ్చినప్పుడు ఆయన కంపెనీ అంతర్గత విషయాలపై మాట్లాడతారని, ఈ సారి మాత్రం తన పుస్తకం గురించే మాట్లాడినట్లు పేర్కొన్నాయి. ఐడీసీలో దాదాపు 4,000-5,000 మంది పని చేస్తున్నారు. వీరిలో దాదాపు 1,000 మంది ఆయన ప్రసంగానికి హాజరైనట్లు తెలుస్తోంది. దేశంలోని ఇతర నగరాల్లోని మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులు ఆన్‌లైన్‌లో సత్య నాదెళ్ల ప్రసంగాన్ని వీక్షించినట్లు వివరించాయి. అంతకు మించి వివరాలు వెల్లడించడానికి ఆ వర్గాలు నిరాకరించాయి. ఐడీసీలో ప్రసంగానంతరం సత్య నాదెళ్ల దిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. హిట్‌ రిప్రెష్‌ను ప్రచారం చేయడానికి ఆయన భారత పర్యటనకు వచ్చారు. హైదరాబాద్‌ కేంద్రంలో యెస్‌ బ్యాంకు, యూపీఎల్‌ (యునైటెడ్‌ ఫాస్పరస్‌), ఫ్లిప్‌కార్ట్‌ తదితర కంపెనీలు ఇచ్చిన ప్రెజెంటేషన్లను సత్య నాదెళ్ల వీక్షించినట్లు తెలుస్తోంది. మంగళవారం దిల్లీలో తొలిసారిగా జరుగుతున్న తొలి 'ఇండియా టుడే కాంక్లేవ్‌ నెక్స్ట్‌ 2017'లో నాదెళ్ల కీలకోపన్యాసం చేయనున్నారు. తన వ్యక్తిగత జీవితం, కంపెనీలో వస్తున్న మార్పులు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలు తదితర అంశాలను హిట్‌ రిఫ్రెష్‌లో ఆయన వివరించారు. 

యువత నైపుణ్య శిక్షణకు సహకరించండి 
అమరావతి: విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు సహకరించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి కోగంటి సాంబశివరావు, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెేళ్లకు విజ్ఞప్తి చేశారు. దేశంలో మైక్రోసాఫ్ట్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్న సంస్థల ప్రతినిధులతో సత్య నాదెళ్ల సమావేశమయ్యారు. వీటిల్లో ప్రభుత్వ రంగం నుంచి ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థకే అవకాశం లభించింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మైక్రోసాఫ్ట్‌ కైజాల యాప్‌ వంటి సాంకేతిక సాధనాలతో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ ఎలా ఉపయోగిస్తున్నదీ సాంబశివరావు వివరించారు. రాష్ట్రంలో గుర్తించిన కొన్ని విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, టెక్నాలజీ ల్యాబ్‌లు ఏర్పాటుకు ముందుకు రావాలని మైక్రోసాఫ్ట్‌కు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది ఆరు లక్షల మందికి శిక్షణ ఇస్తున్నామని, వచ్చే ఏడాది 10 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలనేది లక్ష్యమన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com