అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులు వేగవంతం

- November 12, 2017 , by Maagulf
అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులు వేగవంతం

అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులు ఊపందుకున్నాయి. రోడ్లు, మౌలిక‌వ‌స‌తుల ప‌నులు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. ఇప్పటికే సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం దాదాపు తుది ద‌శకు చేరుకోగా.. న‌గ‌రం లోప‌లికి వెళ్లే మార్గాలు కూడా చకచకా ఏర్పాటవుతున్నాయి. సుమారు రెండు వేల కోట్ల విలువైన ప‌నుల‌ను రెండు రోజుల కిందట ప్రారంభించారు. ప్రభుత్వ భ‌వ‌నాల డిజైన్లు పూర్తయ్యే నాటికి క‌నీస వ‌స‌తుల క‌ల్పన పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది ఏపీ స‌ర్కార్..

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులు చ‌క‌చ‌కా సాగుతున్నాయి.. ప్రభుత్వ భ‌వ‌నాల డిజైన్ల ప్రక్రియ ఓ వైపు కొన‌సాగుతుండ‌గానే ఇత‌ర ప‌నులను వేగ‌వంతం చేసింది ప్రభుత్వం. ఈ నెల 9న  సుమారు రెండు వేల కోట్ల విలువైన పనుల‌ను ప్రారంభించింది. ఇప్పటికే రాజ‌ధానిలో మొద‌ట‌గా నిర్మాణం చేప‌ట్టిన సీడ్ యాక్సిస్ రోడ్డు 80 శాతం పూర్తయింది. వ‌చ్చే డిసెంబర్ నాటికి మొత్తం రోడ్డు నిర్మాణం పూర్తి చేసేలా అధికారులు ముందుకెళ్తున్నారు. ఇక ప్రభుత్వ భ‌వ‌నాలు, మౌలిక‌వ‌స‌తుల క‌ల్పన‌కు సుమారు 10 వేల కోట్లు ఖ‌ర్చవుతుంద‌ని సీఆర్డీఏ అధికారులు అంచ‌నా వేసారు. వీటిలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి స‌ర‌ఫ‌రా వంటి వాటికి ఇప్పటికే  టెండ‌ర్లు పిలిచి ప‌నులు కూడా అప్పగించేసింది ప్రభుత్వం. రాజ‌ధాని న‌గ‌రంలో వెళ్లే ఎనిమిది ప్రధాన రోడ్లను నిర్మించేలా ప‌నులు అప్పగించింది. ఈ రోడ్లన్నీ సీడ్ యాక్సిస్ రోడ్డుకు అనుసంధానం చేస్తున్నారు. దాదాపు రెండువేల కోట్ల.. ప్రపంచ బ్యాంకు నిధుల‌తో ఈ రోడ్ల నిర్మాణాలు చేప‌ట్టిన‌ట్లు సీఆర్డీఏ అధికారులు తెలిపారు.. 

ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల ఇళ్లకు సంబంధించి ఇప్పటికే టెండ‌ర్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తం మూడు ప్యాకేజీలుగా ఈ ప‌నులను నిర్మాణ కంపెనీల‌కు అప్పగించింది సీర్డీఏ. ఎన్సీసీ, ఎల్ అండ్ టీ, షాపూర్జీ ప‌ల్లోంజీ కంపెనీల‌కు ఆయా ప్యాకేజీలు అప్పగించింది. ఇప్పటికే ప్రాథ‌మిక ప‌నులు మొదలయ్యాయి. లింగాయ‌పాలెం, రాయ‌పూడి గ్రామాల మ‌ధ్యలో ఇళ్ల నిర్మాణానికి మ‌ట్టి ప‌నులు ప్రారంభించాయి కంపెనీలు. ఓవైపు రోడ్లు, ఇతర ప‌నుల‌తో పాటు ఇళ్ల నిర్మాణాలు కూడా వేగవంతం చేసేలా సీఆర్డీఏ ముందుకెళ్తోంది. రైతుల‌కు తిరిగిచ్చిన ప్లాట్ల అభివృద్దికి సుమారు 43 వేల కోట్ల రూపాయలు ఖ‌ర్చవుతుంద‌ని ప్రభుత్వం లెక్కలు వేసింది. గ్రామాల‌ను జోన్ల వారిగా విభ‌జించి రైతుల ప్లాట్లను అభివృద్ది చేస్తోంది స‌ర్కార్. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. త్వర‌లోనే అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లపై క్లారిటీ రానుంది. ఆ వెంట‌నే టెండ‌ర్లు పిలిచి వాటి నిర్మాణాలు కూడా ప్రారంభించాల‌నుకుంటోంది ప్రభుత్వం. అన్ని ప‌నులూ పూర్తిచేసేందుకు 15 నెల‌ల స‌మ‌యం తీసుకోవాల‌నుకుంటోంది. మొత్తానికి తొలి ద‌శ నిర్మాణ ప్రక్రియ‌ను 2019 ఏప్రిల్ క‌ల్లా పూర్తిచేసేలా ప‌నుల‌ను వేగ‌వంతం చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com