జింబాబ్వేలో బిగుస్తున్న సైన్యం పట్టు

- November 17, 2017 , by Maagulf
జింబాబ్వేలో బిగుస్తున్న సైన్యం పట్టు

హరారె : జింబాబ్వేలో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతోందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. అయితే, సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్న నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడే అవకాశం వుందని భావిస్తున్నారు. తమకు విశ్వసనీయంగా ఈ మేరకు సమాచారం అందిందని దక్షిణాఫ్రికా ప్రభుత్వ మీడియా తెలిపింది. జింబాబ్వే ప్రభుత్వ ప్రసార సంస్థ జెడ్‌బిసి ప్రధాన కార్యాలయాన్ని సైనికులు బుధవారం తమ అదుపులోకి తెచ్చుకున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధించారు. ఇంత చేస్తున్నా సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకోలేదని, అధ్యక్షుడు ముగాబే సురక్షితంగానే వున్నారని సైనిక ప్రతినిధి తెలిపారు. అయితే వారు ఎక్కడున్నారనేది అటు ప్రభుత్వం నుండి గానీ ఇటు ముగాబే కుటుంబం నుండి గానీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ముగాబే తన అధికారాన్ని మరింత బలోపేతం చేసుకొనేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఈ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే దేశంలో పరిస్థితులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గురువారం అందరూ తమ తమ విధి నిర్వహణల్లో పాల్గొనాల్సిందిగా బుధవారం సాయంత్రమే ప్రభుత్వ మీడియా ప్రజలను, వ్యాపారవేత్తలను, ఉద్యోగులను కోరింది. గురువారం చాలామంది స్కూళ్ళకు, పనులకు వెళ్ళిపోవడం కనిపించింది.

అయితే, ముగాబేను రాజకీయాల నుండి వైదొలిగేలా ఒప్పించేందుకు ఆయన తన గురువుగా భావించే కేథలిక్‌ మత పెద్ద ఫెడెలిస్‌ ముకొనొరి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ముగాబే మాత్రం పార్టీ నాయకత్వం నుండి ఓటు ద్వారానే తనను తొలగించాలని పట్టుబడుతున్నారు. తానే చట్టబద్ధమైన పాలకుడినని అధ్యక్షుడు ముగాబే గురువారం స్పష్టం చేశారు. దేశంలో సైనిక కుట్ర జరిగిన నేపథ్యంలో గౌరవంగా ముగాబేను పంపించేందుకు కేథలిక్‌ గురువు చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని ఆయన ప్రతిఘటిస్తున్నారు.

ఈ నెల మొదటి వారంలో ఉపాధ్యక్షుడిగా పదవీచ్యుతుడైన ఎమ్మర్సన్‌ మనగవా తాత్కాలిక ప్రభుత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం వుందని ఇంటెలిజెన్స్‌ నివేదికలు పేర్కొంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com